Share News

శాస్ర్తీయ వ్యవసాయ సాగుతో అధిక దిగుబడి

ABN , Publish Date - May 05 , 2026 | 11:23 PM

వ్యవసాయ సాగులో శాస్ర్తీయ విధానాలు అవలంభించడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా అభివృద్థి చెందవచ్చని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

శాస్ర్తీయ వ్యవసాయ సాగుతో అధిక దిగుబడి
రైతులకు విత్తన కిట్‌లను అందజేస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ సాగులో శాస్ర్తీయ విధానాలు అవలంభించడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా అభివృద్థి చెందవచ్చని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరులోని మైనార్టీ ఫంక్షనహాలులో నిర్వహించిన రైతు వారంలో భాగంగా ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. రైతులు ఒకేరకరమైన పంట సాగు చేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని, కూరగాయలు, పప్పుధాన్యాలు పండించాలని సూచించారు. ప్రస్తుతం మార్కెట్‌లో రా రైస్‌కు డిమాండ్‌ ఉందని, సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్‌ కూడా అందిస్తోందన్నారు. పంట సాగు సమయంలో అవసరం మేరకు మాత్రమే యూరియాను వినియోగించాలన్నారు. అనంతరం రైతులకు విత్తన కిట్‌లను అందజేశారు. అంతకుముందు చెన్నూరులో కొనసాగుతున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు, కస్తూర్బా విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదులు, భోజన శాల నిర్మాణ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని, పాఠశాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సోమనపల్లిలో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనిత, తహసీల్దార్‌ మల్లికార్జున, మున్సిపల్‌ చైర్‌పర్సన పెద్దింటి పద్మ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2026 | 11:23 PM