సర్వీస్ రోడ్డు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:41 PM
జైపూర్ మండలం ఇందారం గ్రామ రైతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.
- ఇందారం ఓవర్ బ్రిడ్జికి అనుసంధానంగా ఏర్పాటు
- భూసేకరణ జరపాలంటూ కలెక్టర్ ఆదేశాలు
- ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదిలిన జిల్లా యంత్రాంగం
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామ రైతులు, ప్రజలు
- ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
మంచిర్యాల, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జైపూర్ మండలం ఇందారం గ్రామ రైతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. సర్వీస్ రోడ్డు లేని కారణంగా ఐదేళ్లుగా ఇబ్బంది పడుతున్న రైతులు, ప్రజల సమస్యను పరిష్కరించడంలో భాగంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘సర్వీస్ రోడ్డు నిర్మాణం జరిగేనా?’ శీర్షికన ఆగస్టు 17వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. కథనంపై స్పందించిన జిల్లా యంత్రాంగం రైతుల సమస్య పరిష్కరించడం కోసం వెంటనే సర్వీస్ రోడ్డు నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందారంలోని సింగరేణికి చెందిన ఐకే ఓపెన్‌కాస్టు గని సింగరేణి అవసరాల కోసం గోదావరిఖని-ఇందారం జాతీయ రహదారిపై ఆరేళ్ల క్రితం రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మించారు. ఆర్వోబీ నిర్మిస్తే తమ వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయని పేర్కొంటూ ఆ సమయంలో రైతులు, గ్రామస్థులు సింగరేణి అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బ్రిడ్జికి సమాంతరంగా సర్వీసు రోడ్డు నిర్మిస్తామని సింగరేణి అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్లు గడిచినా.. ఆ ఊసే ఎత్తకపోవడంతో భూములు సాగు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అప్పటి నుంచి గ్రామ రైతులు సింగరేణి, రెవెన్యూ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’లోనూ కథనం ప్రచురితం కావడంతో స్పందించిన కలెక్టర్ కుమార్ దీపక్ గత నెల 20వ తేదీన కలెక్టరేట్‌లో రైతులు, సింగరేణి, రెవెన్యూ అధికారులతో విచారణ జరిపారు.
మట్టి డంప్ కోసం బ్రిడ్జి నిర్మాణం...
సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందారం ఓపెన్‌కాస్టు గని (ఐకే ఓసీపీ)లో వెలువడే మట్టి (ఓవర్ బర్డెన్) డంప్ కోసం సంస్థ అధికారుల విన్నపం మేరకు జాతీయ రహదారిపై రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. బ్రిడ్జి కింద నిర్మించిన అండర్ పాస్ నుంచి నిత్యం వందల సంఖ్యలో టిప్పర్ లారీలు ఓసీపీ మట్టిని తరలిస్తున్నాయి. బ్రిడ్జిని ఆనుకొనిఇరువైపులా ఇందారం, రామారావుపేట గ్రామాలకు చెందిన సుమారు 150 మంది రైతులకు చెందిన ఐదారు వందల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్వం రహదారి పైనుంచి టీ-జంక్షన్ వద్ద రైతులు అవతలివైపు ఉన్న తమ పొలాలకు రాకపోకలు సాగించేవారు. బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పటి నుంచి ఆ అవకాశం లేకుండా పోయింది. బ్రిడ్జి ఎత్తులో ఉండటం, దాని కింద నిర్మించిన అండర్ పాస్ నుంచి ఓసీపీకి చెందిన లారీల రాకపోకలు సాగిస్తుండటంతో రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఐదేళ్లుగా రైతులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన పంటను తరలించేందుకు సమీపంలోని రైతులు ఇతరుల పట్టా భూములపై ఆధారపడుతున్నారు. సంబంధిత యజమానులు అభ్యంతరం తెలపడంతో పంటను తరలించే మార్గం లేకుండాపోయింది.
అమలుకాని సింగరేణి అధికారుల హామీ...
రాజీవ్ రహదారిపై రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో ఇందారం, రామారావుపేట గ్రామాల రైతులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే తమ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడతాయని పనులను అడ్డగించే ప్రయత్నం చేశారు. దీంతో అప్పటి సింగరేణి అధికారులు బ్రిడ్జికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే బ్రిడ్జి నిర్మాణం జరిగి ఐదేళ్లు గడుస్తున్నా రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో సింగరేణి అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. రైతుల డిమాండ్ మేరకు బ్రిడ్జి వెంట దాదాపు 400 మీటర్ల పొడవుతో 30 అడుగుల వెడల్పుతో సర్వీస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇందు కోసం అవసరమైన భూమిని సేకరించాలనే నిర్ణయానికి సింగరేణి అధికారులు వచ్చారు. అయితే కాలక్రమంలో సింగరేణి అధికారుల బదిలీలు జరగడం, కొత్తగా వచ్చిన వారు పట్టించుకోకపోవడంతో సర్వీస్ రోడ్డు నిర్మాణ విషయం మరుగున పడింది.
భూ సేకరణకు ఆదేశాలు జారీ..
ఇందారం గ్రామ రైతుల విజ్ఞప్తి మేరకు సింగరేణి, రెవెన్యూ, రోడ్లు భవనాలశాఖ అధికారులతో విచారణ చేపట్టిన కలెక్టర్ కుమార్ దీపక్ సర్వీస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించాలని రెవెన్యూ డివిజనల్ అఽధికారిని ఆదేశిస్తూ ఈనెల 10వ తేదీన ఉత్తర్వులు జారీచేశారు. సర్వీస్ రోడ్డు నిర్మాణానికి 10 గుంటల స్థలం అవసరం ఉంటుందని, భూ సేకరణకు నోటిఫికేషన్ ఇస్తే సంబంధిత యజమానులకు భూ సేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లించనున్నట్లు సింగరేణి అధికారులు విన్నవించడంతో ఎలాంటి తాత్సారం లేకుండా భూ సేకరణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భూ సేకరణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడమేగాక, త్వరగా సర్వీస్ రోడ్డు కూడా నిర్మించాల ని సింగరేణి అధికారులను జిల్లా పాలనాధికారి ఆదేశించారు. తమ సమస్యను వెలుగులోకి తెచ్చి, పరిష్కారం అయ్యే విధంగా కృషి చేసిన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికకు ఇందారం గ్రామ రైతులు, ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.