ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలి
ABN , Publish Date - May 12 , 2026 | 10:24 PM
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
మంచిర్యాల కలెక్టరేట్, మే 12 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల్లో ప్రత్యేక అధికారులను నియమించి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తున్నామన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొన్నవెంటనే గోదాములకు తరలించేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారా వు, డీఎం శ్రీకళ, జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, డీఆర్‌డీఓ కిషన్, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం దెబ్బతినకుండా గోదాముల్లో నిల్వ చేయాలి
చెన్నూర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని గోదాములలో నిల్వ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. చెన్నూరు మండల కేంద్రంలో ఉన్న మార్కెట్ యార్డు గోదామును జిల్లా సహకార అధికారి సత్యనారాయణ, ఉప తహశీల్దార్ సనత్‌లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతినకుండా గోదాముల్లో నిల్వ చేసి కేటాయించిన ప్రకారం రైసుమిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన లారీల నుంచి ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలన్నారు. అనంతరం ఆయన ఆస్నాద్, ఒత్కులపల్లి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
తడిసిన ధాన్యాన్ని కొంటాం
కోటపల్లి మండలం దేవులవాడ, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా సహకార అధికారి సత్యనారాయణ, కోటపల్లి మండల తహశీల్దార్ రాఘవేంద్రలతో కలిసి సందర్శించి ధాన్యం కొనుగోలు, ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు చెల్లింపులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులు ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ధాన్యాన్ని శుభ్రపరిచి, నాణ్యతాప్రమాణాలు పాటించి కేంద్రాలకు తీసుకురావాలన్నారు. అలాగే అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని త్వరగా ఆరబెట్టి తీసుకువచ్చినట్లయితే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.