Share News

చేరికలపైనే దృష్టి

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:36 PM

మునిసిపల్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వివిధ పార్టీల నేతలు చేరికలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు.

చేరికలపైనే దృష్టి

- వలసలను ప్రోత్సహిస్తున్న వివిధ పార్టీల నాయకులు

- ద్వితీయశ్రేణి నాయకులను చేర్చుకునేందుకు ఆరాటం

- వారిపైనే ఆధారపడుతున్న అభ్యర్థులు

మంచిర్యాల, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వివిధ పార్టీల నేతలు చేరికలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. చేరికలను ఓట్లుగా మార్చుకొనే ఎత్తుగడతో వివిధ పార్టీల నుంచి విరివిగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ఈ ఒరవడిని అవలంభిస్తున్నాయి. వివిధ మునిసిపాలిటీ పరిధిలో ద్వితీయశ్రేణి నాయకులను చేరదీయడం ద్వారా ఎన్నికల్లో తమ బలం పెంచుకొనేం దుకు ముఖ్య నాయకులు ఆరాటపడుతున్నారు.

- మచ్చిక చేసుకునే యత్నం...

మునిసిపల్‌ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో వార్డులను కైవసం చేసుకునేందుకు వివిధ పార్టీల నాయకులు అన్ని దారులూ వెతుక్కుంటున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వార్డుల వారీగా కొందరు చోటామోటా నాయకులను ఎంపిక చేసుకుంటున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు. దీంతో వార్డుల వారీగా నాయకులు డిమాండ్‌ చేసినంత ఇవ్వకతప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి వార్డుల వారీగా దావత్‌లు ప్రారంభం కాగా, ఎన్నికలకు ఒక రోజు ముందు పెద్ద మొత్తంలో నగదు, మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటికో క్వార్టర్‌ బాటిల్‌ చొప్పున మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధంకాగా, గ్రూపుల వారీగా సభ్యులు కోరే సామగ్రి ఇవ్వడానికి అభ్యర్థులు అంగీకరిస్తున్నారు.

- అవకాశంగా మల్చుకుంటున్న నాయకులు..

జిల్లాలోని ఎన్నికలు జరగనున్న మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట మునిసిపాలిటీల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులను తమ దారికి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల్లో నెలకొన్న పోటీని కొందరు ద్వితీయశ్రేణి నాయకులు అవకాశంగా మల్చుకుంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా డిమాండ్ల పేరిట అందినకాడికి దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలు మద్దతునిస్తున్న పలువురు అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. తమ పరిధిలో ఇంతమంది ఓటర్లు ఉంటారని, వారిని మచ్చిక చేసుకునేందుకు ఇంతమొత్తం కావాలంటూ అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అలాగైతేనే పార్టీ మారతామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇలా ఒక పార్టీ కాకుండా పోటీలో ఉన్న అన్ని ప్రధానపార్టీల మద్దతున్న అభ్యర్థులకు ఇదే పరిస్థితులు ఎదురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్యాకేజీలు మాట్లాడుకుంటూ ఓట్లు వేయిస్తామనే హామీ ఇస్తుండటంతో విపరీతమైన పోటీ ఎదుర్కొంటున్న అభ్యర్థులు తప్పనిసరి పరిస్థితుల్లో వారి వలలో చిక్కుకుంటున్నారు.

- ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు....

మునిసిపల్‌ ఎన్నికల్లో పెద్దమొత్తంలో డబ్బుల పంపిణీకి తెరలేచినట్లు తెలుస్తోంది. కార్పొరేటర్‌/ కౌన్సిలర్‌ అభ్యర్థులు కొన్ని చోట్లా రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వెచ్చించేందుకూ సిద్ధపడుతున్నట్లు సమాచారం. ద్వితీయస్థాయి నాయకులకు నిత్యం దావత్‌లు ఏర్పాటు చేయడంతోపాటు ఓటర్లకు అందజేసేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు మద్దతిస్తున్న అభ్యర్థులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మునిసిపల్‌ ఎన్నికలను అధికార పార్టీ కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ మద్దతునిస్తున్న అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్య నేతలు సైతం డబ్బులు వెదజల్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీలైనన్ని వార్డులను తమ ఖాతాల్లో వేసేకోవడానికి ప్రఽధాన పార్టీల నేతలు అలుపెరుగని విధంగా కృషి చేస్తున్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:36 PM