హమ్మయ్యా...నిధులు వచ్చేశాయి
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:55 PM
ప్రభుత్వ పాఠశాలలకు రెండో విడత నిర్వహణ నిధులు విడుదలయ్యాయి. విద్యావనరుల కేంద్రాలు, స్కూల్ కాంప్లెక్స్, ఆటలకు సంబంధించినవి సైతం వచ్చాయి.
- పాఠశాలలకు నిధులు విడుదల
- తీరనున్న సమస్యలు
బెజ్జూరు/వాంకిడి జనవరి 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలకు రెండో విడత నిర్వహణ నిధులు విడుదలయ్యాయి. విద్యావనరుల కేంద్రాలు, స్కూల్ కాంప్లెక్స్, ఆటలకు సంబంధించినవి సైతం వచ్చాయి. గతంతో పోలిస్తే ఈ సారి ముందుగానే రావడంతో ఎంఈఓలు, హెచ్‌ఎంలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి తొలివిడతలో 50శాతం నిధులు నాలుగు నెలల కిందట వచ్చాయి. ప్రస్తుతం మిగితా మొత్తం పాఠశాలల ఖాతాల్లో నిధులను ప్రభుత్వం జమ చేసింది.
వేటికి ఖర్చు చేయాలంటే...:
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీల సంయుక్త ఖాతాలో నిధులు జమ చేస్తున్నారు. కమిటీ తీర్మానం మేరకు వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. గదులకు అవసరమైన మరమ్మతులు చేయించడం, శుభ్రత, ప్రయోగశాలలకు పరికరాలు, స్టేషనరీ, పత్రికలు, పాఠశాల సమావేశాల నిర్వహణ, జాతీయ పండగలు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్ల నిర్వహణ, ఇంటర్నెట్, డిజిటల్ తరగతులకు వెచ్చించాలి. నిధులు మొత్తం రావడంతో ఇక పాఠశాలల సమస్యలు తీరనున్నాయి.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా....:
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 715ఉన్నాయి. ప్రభుత్వం నిధులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు కేటాయిస్తోంది. 1-30మంది పిల్లలున్న బడులకు 10,000 రూపాయలు, 31-100వరకు 25,000 రూపాయలు, 101-250వరకు 50,000 రూపాయలు, 251-1000వరకు ఉన్న పాఠశాలలకు 75,000 రూపాయలు, వెయ్యికిపైగా ఉంటే లక్ష రూపాయలు ఏటా నిర్వహణ నిధులు మంజూరు చేస్తోంది. గతంలో ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు వేర్వేరుగా వచ్చేవి. నాలుగేళ్ల కిందట సదరు రెండు శాఖలను కలిపి సమగ్ర శిక్షగా మార్చారు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా బడులకు నిధులు కేటాయించారు. క్రీడా కోట కింద ప్రాఽథమిక పాఠశాలలకు 5,000 రూపాయలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 10,000 రూపాయల చొప్పున మంజూరు చేశారు. ఒక్కో ఎమ్మార్సీకి ఏటా ఇవ్వాల్సిన 90,000 రూపాయలు, సీఆర్సీకి 33,000 రూపాయలు ఇచ్చారు.
జిల్లాలో నిధుల వివరాలు...:
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 715 పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలలకు మొత్తం నిధులు 77,10,000 రూపాయలు, ఎమ్మార్సీలు 15ఉండగా వాటికి 6,75,000 రూపాయలు, సీఆర్సీలు 67ఉండగా వాటికి 11,05,500 రూపాయలు ఆయా ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
సద్వినియోగం చేసుకోవాలి
- శివచరణ్‌కుమార్- ఎంఈవో- వాంకిడి
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అవసరమైన పనులు చేపట్టేందుకు సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి వీటిని వినియోగించుకోవాలి.