ధాన్యం బస్తాలు తరలించాలని రైతుల ధర్నా
ABN , Publish Date - May 20 , 2026 | 11:41 PM
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా గొల్లపల్లి రైతులు బుధవారం ధర్నాకు దిగారు. బస్తాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి బైఠాయించారు.
నెన్నెల, మే 20 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా గొల్లపల్లి రైతులు బుధవారం ధర్నాకు దిగారు. బస్తాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి బైఠాయించారు. రోజులతరబడి వేచి చూస్తే ధాన్యం కాంటా చేశారని, ఇప్పుడు ఆ బస్తాలను గోదాములకు తరలించేందుకు లారీలను పంపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 లారీల వరకు అవసరం కాగా రెండు లారీలు మాత్రమే వచ్చాయన్నారు. బస్తాల వద్ద రేయింబవళ్లు కాపలా కాయాల్సి వస్తోందన్నారు. లారీల కొరత ఉందని, సొంత వాహనాల్లో తరలించుకోవాలని అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. విషయం తెలిసిన ఎంఆర్‌ఐ సులోచన, రూరల్ సీఐ హనోక్, ఎస్సై రామకృష్ణ అక్కడికి చేరుకొని రైతులను సముదాయుంచే ప్రయత్నం చేశారు. కలెక్టర్ రావాలని వారు బీష్మించుకకూర్చున్నారు. కలెక్టరెట్‌లో మీటింగ్‌లో ఉన్న స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ రైతులతో ఫోనలో మాట్లాడారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సరిపడా లారీలు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
వేమనపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): వేమనపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ బుధవారం స్థానిక రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రోజుల తరబడి ధాన్యాన్ని కేంద్రాల్లోనే ఉంచుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం మబ్బులు వస్తుండడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అనేక తిప్పలు పడుతున్నామని వాపోయారు. తమ గ్రామసమీపంలో ఉన్న గోదాముల్లో వేరేచోట నుంచి ధాన్యాన్ని తీసుకువచ్చి నిల్వ ఉంచుతున్నారు కానీ తమ ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. గంటకు పైగా రోడ్డుపై ధర్నా చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న నీల్వాయి ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ సాయికృష్ణ అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌లు రైతుల వద్దకు వచ్చి రైతులను శాంతింపజేశారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీగింజను ప్రభుత్వం కొంటుందన్నారు. లారీలను వెంటవెంటనే పంపిస్తామని తెలిపారు. చీటికిమాటికి రైతులు ఇలా ధర్నాలు చేయవద్దని సూచించారు. దీంతో రైతులు శాంతించారు.