గాలి దుమారంతో రైతులు బెంబేలు
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:20 PM
జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోస్తున్నారు. మూడురోజులుగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి.
- కళ్లాల్లో ధాన్యం... పరదాల కోసం పరుగులు
- ఇంకా ప్రారంభం కాని కొనుగోళ్లు
హాజీపూర్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోస్తున్నారు. మూడురోజులుగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. సాయంత్రం పూట ఈదురుగాలులు, మబ్బులతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. అక్కడక్కడ చినుకులు పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం ఉండడంతో చాలా మంది రైతులు ధాన్యాన్ని కుప్పలుగా పోసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు. కోతలు కోసి 15 రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఫ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ.....
ఈ రబీ సీజనలో మంచిర్యాల జిల్లాలో 1.22 లక్షల ఎకరాల్లో రైతులు వరిఽ సాగు చేశారు. ఏప్రిల్ మొదటి వారం నుంచే కోతలు ప్రారంభించారు. కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెడుతున్నారు. కొందరు రైతులు ధాన్యం ఆరడంతో కుప్పలు చేసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేశారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం 323 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో 20 శాతం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ కొనుగోలు చేయడం లేదు. ఈ విషయంపై రైతులు నిర్వాహకులను అడిగితే అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కానీ కొనుగోలు చేసిన ధాన్యం ఏ మిల్లుకు తరలించాలనేది పై అధికారుల నుంచి ఆదేశాలు ఇంకా రాలేదని చెబుతున్నారు. వాతావరణ మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మబ్బులతో ఆరబోసిన ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు చేయడం మరుసటి రోజు తిరిగి ఆరబోయడంతో కూలీల ఖర్చు, శ్రమ వృథా అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
-రెండు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభం
- బ్రహ్మారావు, జిల్లా పౌరసరఫరాల అధికారి
జిల్లాలో రబీ సీజన ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 323 కొనుగోలు కేంద్రాల ద్వారా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండురోజుల్లో కొనుగోళ్లు ఊపందుకుంటాయి.