Share News

కొత్త ‘పింఛన్ల’ పంపిణీకి సర్వం సిద్ధం

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:59 PM

రాష్ట్రంలో కొత్త పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా ‘చేయూత’ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా సర్వే పూర్తికాగా, కొత్తగా దరఖాస్తు చేసేందుకు ఈ నెల 15తో తుది గడువు ముగియనుంది.

కొత్త ‘పింఛన్ల’ పంపిణీకి సర్వం సిద్ధం

- అనర్హుల ఏరివేత దిశగా ప్రభుత్వం సన్నాహాలు

- ఈనెల 15తో ముగియనున్న ‘చేయూత’ దరఖాస్తు ప్రక్రియ

- విచారణ అనంతరం కొత్త పింఛన్ల మంజూరు

మంచిర్యాల, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా ‘చేయూత’ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా సర్వే పూర్తికాగా, కొత్తగా దరఖాస్తు చేసేందుకు ఈ నెల 15తో తుది గడువు ముగియనుంది. అనంతరం అర్హతగల లబ్ధిదారులకు పింఛన్‌ మంజూరు చేయడమే మిగిలి ఉంది. లబ్ధిదారుల్లో మృతిచెందిన వారిని గుర్తించి, వారి పింఛన్లు రద్దు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టారు. గ్రామీణాభివృద్దిశాఖ అధికారులు, నగర పాలక సంస్థ, పురపాలక సంఘాల కమిషనర్లు సంయుక్తగా పింఛన్ల జాబితాలో మృతుల వివరాలు అందజేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించారు. గ్రామాల్లో పంచాయతీ అధికారులు, కార్పొరేషన్‌, మునిసిపాలిటీల్లో వార్డు అధికారులు, బిల్‌ కలెక్టర్లు లబ్ధిదారుల సర్వే నిర్వహించి పూర్తివివరాలు సేకరించారు. పదేళ్లుగా అందుతున్న పింఛన్లలో చాలా మంది వృద్ధులు, ఇతర లబ్ధిదారులు మృతి చెందినప్పటికీ వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఇంకా సొమ్ము జమ అవుతూనే ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మృతుల ఏరివేతతో పింఛన్ల రూపంలో ప్రభుత్వ ఖజానాపై పడుతున్న అనవసర భారం తగ్గడంతోపాటు నిజమైన పేదలు, అవసరమున్న వారికి లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయి, విచారణ అనంతరం అర్హులకు కొత్త పింఛన్లు జారీ చేయనున్నారు.

జిల్లాలో 92,159 మంది లబ్ధిదారులు....

వివిధ రకాల పింఛన్లు పొందుతున్న వారిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 92,159 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో మునిసిపాలిటీలకు చెందిన 22,641 మంది లబ్ధిదారులు ఉండగా, వీరికి బ్యాంకు ఖాతాల్లో నగదు పింఛన్‌ డబ్బులు జమ అవుతుండగా 70,018 మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాగా, వారందరికీ పోస్టాఫీసుల ద్వారా నెలవారీ పింఛన్లు అందుతున్నాయి. గతప్రభుత్వ హయాం నుంచి ఈ విధంగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతూనే ఉంది. ఈ క్రమంలో చనిపోయిన వారికి కూడా పింఛన్‌ సొమ్ము జమ అవుతుందనే ప్రచారం మేరకు ప్రభుత్వం సర్వేకు పూనుకుంది. సర్వేలో భాగంగా అధికారుల విచారణలో మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు మందమర్రి, బెల్లంపల్లి మునిసిపాలిటీలకు సంబంధించి గత పదేళ్ల కాలంలో ఇప్పటి వరకు 1600 పైచిలుకు లబ్ధిదారులు మృతి చెందినట్లు తేలింది. అలాగే పోస్టాఫీసు ద్వారా పింఛన్లు పొందుతున్న వారిని ప్రత్యేకంగా రూపొందించిన ’యాప్‌’ ద్వారా ముఖ గుర్తింపు చేపడుతున్నారు.

జిల్లాలో 11వేల పైచిలుకు దరఖాస్తులు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వివిధ పథకాల అమలు కోసం ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించింది. అంతా సవ్యంగా సాగితే 2024 ఆగస్టు ఒకటవ తేదీ నుంచే కొత్త పింఛన్లు అందజేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, అనూహ్యంగా మృతి చెందిన లబ్ధిదారుల అంశం తెరపైకి రావడం, జాబితాను ప్రక్షాళన చేయాల్సి రావడంతో కొత్త దరఖాస్తుల పరిశీలనకు ఆటంకం ఏర్పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ‘చేయూత’ పథకం కింద కొత్తగా దరఖా స్తులు ఆహ్వానించింది. చేయూత పథకం కోసం ఈనెల 15వ తేదీతో ప్రక్రి య ముగియనుండగా, ఇప్పటివరకు 11,200 పైచిలుకు మంది అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసే సమయం వరకు వచ్చే దరఖాస్తులతోపాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్న పింఛన్‌ లిస్టు కూడా పరిగణలోనికి తీసుకోవడం ద్వారా అర్హుల జాబితా తయారు చేయనున్నట్లు సమాచారం. దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగానే ఈనెల 25వ తేదీ వరకు విచారణ జరిపి, తుది అర్హుల జాబితాను ప్రభుత్వా నికి అందజేయ నున్నారు. దాని ఆధారంగా అర్హులైన దరఖాస్తుదారులకు చేయూత పింఛన్లు అందనున్నాయి. పథకంలో భాగంగా చేనేత, పైలేరియా రోగులు, వితంతువు లు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులకు పింఛన్లు అందజేయ నున్నారు. ప్రస్తుతం ఆసరా పథకం కింద 2016 రూపాయలు, దివ్యాంగులకు 3016 రూపాయలు ఇస్తున్నారు. చేయూత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అందించనున్నట్లు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని అర్హులకు పింఛన్లు అందజేసేందుకు నెలకు దాదాపు రూ. 3 కోట్ల 95 లక్షల 46 వేలు అవసరం కాగా, ఇతర విభాగాల వారికి పింఛన్లు మంజూరు చేసేందుకు నెలకు రూ. 20 కోట్ల 18లక్షల 68 వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Updated Date - Sep 11 , 2026 | 11:59 PM