Share News

ఆదాయం ఉన్నా... సౌకర్యాలు సున్నా

ABN , Publish Date - May 19 , 2026 | 12:25 AM

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కూరగాయలు విక్రయించేందుకు వ్యాపారులకు సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడింది. తైబజార్‌ టెండరులో మున్సిపాలిటీకి ఆదాయం వస్తున్నా వసతుల కల్పించటం లేదని పలువురు పేర్కొంటున్నారు.

ఆదాయం ఉన్నా... సౌకర్యాలు సున్నా
కాగజ్‌నగర్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులు

- కాగజ్‌నగర్‌ మార్కెట్‌లో సమస్యల తిష్ఠ

- కలగానే మిగిలిన సమీకృత మార్కెట్‌ నిర్మాణం

- అవస్థలు పడుతున్న పట్టణ వాసులు

కాగజ్‌నగర్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కూరగాయలు విక్రయించేందుకు వ్యాపారులకు సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడింది. తైబజార్‌ టెండరులో మున్సిపాలిటీకి ఆదాయం వస్తున్నా వసతుల కల్పించటం లేదని పలువురు పేర్కొంటున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్వహించిన తైబజారు టెండరులో రూ.10,73,000 ఆదాయం సమకూరింది. గతేడాది రూ.6,80,900 ఆదాయం ఉండగా, ఈ ఏడాది రూ.3,92,100 ఆదాయం పెరిగింది. ఏటేటా ఆదాయం పెరుగుతున్నప్పటికీ సౌకర్యాల కల్పనలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు.

- సరిపడా స్థలం లేక..

పట్టణంలోని ప్రధానంగా ఇందిరా మార్కెట్‌ ఏరియా, అంబేద్కర్‌ చౌరస్తా, సర్‌సిల్క్‌ ఎల్‌బీఎస్‌ మార్కెట్‌లో కూరగాయల విక్రయాలు సాగుతున్నాయి. ఇందిరా మార్కెట్‌ ఏరియాలో కూరగాయల విక్రయదారుల కోసం ప్రత్యేకంగా స్లాబ్‌ వేసినప్పటికీ సదుపాయం కల్పించలేదు. అక్కడ సరిపడా స్థలం లేకపోవటంతో అనేక మంది అంబేద్కర్‌ చౌరస్తా వద్దనే రోడ్లపై విక్రయాలు సాగిస్తున్నారు. ఉదయం నుంచే కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసుకోగా సరైన షెడ్లు లేక ఎండ, వర్షానికి అంతా ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీటి వసతి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలోనే నిత్యం వివిధ వాహనాలు పోతుండటంతో ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఒకవైపు ట్రాఫిక్‌ నిలుస్తుండటంతో కూరగాయలు కొనుగోలు చేసే వారికి మరింత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. పొట్టిశ్రీరాములు చౌరస్తా నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు భారీ వాహనాలు వస్తే ఈ మార్గంలో నడవలేవని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పండుగల సమయంలో ఈ మార్గం గుండా పోలేని పరిస్థితి ఉంటుంది. పూర్తిగా రద్దీగా ఉంటుంది. కనీసం నడిచేందుకు కూడా వీలుండదు. ఆదివారం, పండుగ సమయాల్లో ట్రాఫిక్‌ సమస్య వేధిస్తోంది.

- వెనక్కి మళ్లిన నిధులు..

పట్టణ ప్రజలకు అవసరమైన కూరగాయలు, పండ్లు, మటన్‌, చికెన్‌ తదితర వాటిని ఒక్క చోటనే విక్రయానికి ఏర్పాటు చేసేందుకు గత పాలకవర్గం సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.7కోట్ల నిధులు మంజూరు చేసినప్పటకీ స్థల సేకరణలో సమస్య ఏర్పడింది. తొలుత ఆదర్శనగర్‌ సబ్‌స్టేషన్‌ ఏరియాలో నిర్మాణానికి ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రజలకు అనుకూలంగా ఉండదని మార్పు చేశారు. అనంతరం ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏరియా, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌, ఆర్టీసీ బస్టాండు ఏరియాలోని స్థలాలను పరిశీలించినప్పటికీ ఇంతవరకు ఈ సమస్య కొలిక్కి రాలేదు. దీంతో సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి సంబంఽధించిన నిధులు కూడా వెనక్కిపోయాయి. ప్రధానంగా సర్‌సిల్క్‌, ఇందిరా మార్కెట్‌ ఏరియాలను కలుపుతూ అన్నిరకాల విక్రయాలు ఒకే చోట జరిగేలా పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తూ సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి కృషిచేయాలని పట్టణ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతిని వివరణ కోరగా మార్కెట్‌లో సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

Updated Date - May 19 , 2026 | 12:25 AM