Share News

మున్సిపాలిటీలకు కలిసొచ్చిన ఎన్నికలు

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:35 PM

మునిసిపల్‌ ఎన్నికలు బల్దియాలకు భలేగా కలిసి వచ్చాయి. ఎన్నికల మాట పక్కన పెడితే నో డ్యూస్‌ సర్టిఫికెట్ల కోసం బరిలో నిలిచే అభ్యర్థులు బారులు తీరుతున్నారు.

మున్సిపాలిటీలకు కలిసొచ్చిన ఎన్నికలు
మంచిర్యాల కార్పొరేషన్‌లో పన్నులు చెల్లించేందుకు బారులు తీరిన ఆశావహులు

- నో డ్యూ సర్టిఫికెట్లకు బారులు తీరుతున్న అభ్యర్థులు

- పెద్ద మొత్తంలో ఆస్తిపన్ను వసూలు

- వారం రోజుల్లో రూ.9.8 కోట్ల పన్నుల చెల్లింపు

మంచిర్యాల, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికలు బల్దియాలకు భలేగా కలిసి వచ్చాయి. ఎన్నికల మాట పక్కన పెడితే నో డ్యూస్‌ సర్టిఫికెట్ల కోసం బరిలో నిలిచే అభ్యర్థులు బారులు తీరుతున్నారు. ఫలితంగా పాత బకాయిలు వసూలు అవుతున్నాయి. మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఈ నెల 27న విడుదలైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మునిసిపాలిటీలకు ఆస్తి, నీటి పన్ను తదితర బకాయిలు ఏవీ ఉండకూడదన్న నిబంధన ఉంది. ఇందులో భాగంగా తాను ఎలాంటి బకాయిలు లేనని నిరూపించే నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ను అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రంతోపాటు సమర్పించడం తప్పనిసరి. దీంతో అభ్యర్థులంతా పాత బకాయిలతో సహా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులను ఒకేసారి చెల్లించాల్సి వస్తోంది.

గడువు తక్కువగా ఉండటంతో....

మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ణయించిన మేరకు గడువు అతి తక్కువగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి నామినేషన్‌ పత్రాలను ఈ నెల 28 నుంచి మొదలుకొని 30వ తేదీ వరకు సమర్పించాల్సి ఉంది. కేవలం మూడు రోజులు గడువే ఉండటం, షెడ్యూల్‌ కూడా నామినేషన్‌ దాఖలు గడువుతోనే విడుదలకావడంతో అభ్యర్థులంతా ఉరుకులు పరుగులతో మునిసిపల్‌ కార్యాలయాలకు వెళ్తున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో దిగనున్నారు. జిల్లాలోని ఎన్నికలు జరగనున్న మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట మునిసిపాలిట్లీ మొత్తం 149 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డుకు కనీసం ముగ్గురు అభ్యర్థులు పోటీపడనుండగా, కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు కూడా బరిలో నిలవనున్నారు. ఈ లెక్కన జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల నుంచి కనీసం 600 మంది అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. వారందరికీ.. మునిసిపాలిటీల నుంచి నో డ్యూ సర్టిఫికేట్లు అందాల్సి ఉంది. అభ్యర్థుల రద్దీ ఎక్కువగా ఉండటం, నామినేషన్లు దాఖలు గడువు సమీపిస్తుండటంతో సిబ్బంది కూడా పన్నుల స్వీకరణలో బిజీగా ఉన్నారు.

పూర్తికాని అభ్యర్థుల ఎంపిక...

మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలై నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనా ఇంకా కొన్ని చోట్లా అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు. ప్రధాన పార్టీల్లో సైతం ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మంచిర్యాల కార్పొరేషన్‌ విషయానికి వస్తే మొత్తం 60 డివిజన్లకు గాను అధికార కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అభ్యర్థుల ఎంపిక చేపట్టలేదు. ఇదేపరిస్థితి జిల్లాలోని మిగతా మునిసిపాలిటీలలో ఉంది. ఈ నేపథ్యంలో తమకు పార్టీలు టికెట్‌ ఇస్తాయో...లేదోనన్న మీమాంసలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే నాటికి కూడా అభ్యర్థులు నో డ్యూ సర్టిఫికేట్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదు. నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత హడావుడిగా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. దీంతో నో డ్యూస్‌ సర్టిఫికేట్ల కోసం మునిసిపల్‌ కార్యాలయాల్లో బారులు తీరుతున్నారు.

ఊపందుకున్న పన్నులు వసూలు....

మునిసిపల్‌ ఎన్నికల పుణ్యమా అని ఇంతకాలం వసూలు కాని ఆస్తి, నీటి పన్ను బకాయిల చెల్లింపులు ఇప్పుడు ఊపందుకున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్‌లో ఎక్కువ సంఖ్యలో డివిజన్లు ఉండటంతో కౌంటర్ల వద్ద అభ్యర్థులు బుధవారం బారులు తీరారు. మునిసిపాలిటీల వారీగా వసూలైన పన్నుల వివరాలు ఇలా ఉన్నాయి.

మంచిర్యాల కార్పొరేషన్‌లో మొత్తం 50,050 నివాస గృహాలు ఉన్నాయి. వాటి పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 30.30 కోట్లు ఆస్తిపన్ను డిమాండ్‌ ఉంది. అందులో ఈనెల 25వ తేదీ వరకు రూ. 9.24 కోట్లు వసూలుకాగా, నో డ్యూస్‌ సర్టిఫికేట్‌ కోసం కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 9.55 కోట్లు వసూలు కావడం గమనార్హం.

బెల్లంపల్లి మునిసిపాలిటీలో మొత్తం 15,565 నివాస గృహాలు ఉండగా, వారం క్రితం వరకు రూ. 9 లక్షల ఆస్తిపన్ను, రూ.3 లక్షల నీటి పన్ను వసూలైంది. ఇక నో డ్యూ సర్టిఫికేట్‌ కోసం గడిచిన రెండు రోజుల్లో రూ. 6.50 లక్షల పన్నును అభ్యర్థులు చెల్లించారు.

లక్షెట్టిపేట మునిసిపాలిటీలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూలు డిమాండ్‌ రూ. 1.90 కోట్లు డిమాండ్‌ కాగా, ఈ నెల 20వ తేదీ వరకు రూ. 90.09 లక్షలు వసూలుకాగా, నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ కోసం ఏకంగా రూ. 3.2 లక్షల పన్నులు చెల్లించారు.

చెన్నూర్‌ మున్సిపాటిటీలో వారం రోజుల వరకు 2,47,803 రూపాయలు వసూలు కాగా బుధవారం ఒక్కరోజే 1,30,821 రూపాయల పన్నులు వసూలయ్యాయి.

క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో మొత్తం 12,468 నివాస గృహాలు ఉండగా, రూ. 3.77 కోట్లు ఆస్తిపన్ను డిమాండ్‌ ఉంది. ఇందులో పది రోజుల క్రితం వరకు రూ. 1.87 కోట్లు వసూలు కాగా, నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ కోసం ఇప్పటి వరకు రూ. 14 వేలు వసూలయ్యాయి.

Updated Date - Jan 28 , 2026 | 11:35 PM