గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:42 PM
గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేసి, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.
- మంత్రి వివేక్‌వెంకటస్వామి
చెన్నూరు, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేసి, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం చెన్నూరులోని గోదావరి నది తీరంలో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పుష్కరఘాట్ ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గోదావరినది పరివాహకంలో అనువైన ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్ల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి నది పరిధిలోని రహదారుల విస్తరణ, మూత్రశాలలు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదుల ఏర్పాటు శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజారవాణ వ్యవస్థ, పుష్కరఘాట్‌ల వద్ద లైలింగ్, తాగునీరు ఏర్పాట్లు చేయాలన్నారు. పట్టణంలోని మహంకాళి కాలనీ నుంచి పుష్కరఘాట్ వరకు నూతన విద్యుతలైన ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 2027 ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెన్నూరు పట్టణంలో శ్మశాన వాటిక ఏర్పాటుకు కోటి రూపాయలు కేటాయించి చర్యలు చేపడతామని తెలిపారు.
కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ చెన్నూరు గోదావరి తీరంలో పుష్కర స్నానాలకు రోజుకు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, పార్కింగ్, వాహనాల నియంత్రణ కోసం అంతర్గత రహదారుల విస్తరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అనంతరం చెన్నూరు మండల కేంద్రంలో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణపనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో కొనసాగుతున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణపనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. చెన్నూరు పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటులో భాగంగా కొనసాగుతున్న పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, దేవాదాయ, విద్యుత, రహదారుల శాఖల అధికారులు పాల్గొన్నారు.