Share News

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jan 26 , 2026 | 11:53 PM

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన 77వ గణతంత్ర వేడుకలకు కలెక్టర్‌ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
జెండా ఎగరవేసి వందనం చేస్తున్న కలెక్టర్‌ హరిత, పక్కన ఎస్పీ నితికా పంత్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి

- రాజ్యాంగ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

- కలెక్టర్‌ హరిత

- ఘనంగా గణతంత్ర దినోత్సవం

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన 77వ గణతంత్ర వేడుకలకు కలెక్టర్‌ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ఎంతో మంది గొప్పవాళ్లు తమ మేధాశక్తితో భారతదేశానికి భవిష్యత్‌ దిశానిర్దేశం చేశారని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగిస్తూనే అదే స్ఫూర్తితో భారతీయులంతా ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను జిల్లాలో పక్కగా అమలు చేస్తూ ఆర్హులైన ప్రతి లబ్ధిదారునికి అభివృద్ధి ఫలాలను అందజేస్తామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు.

ఫ రైతు సంక్షేమమే లక్ష్యంగా..

రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. పేదలకు గూడు కోసం జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో 9,057 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. ఇప్పటి వరకు 19 ఇళ్లు పూర్తికాగా 5,167 ఇళ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 1.99 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. జిల్లాలో గృహజ్యోతి పథకం ద్వారా 1.23 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. రైతు బీమా పథకం ద్వారా జిల్లాలో 195 మంది రైతు కుటుం బాలకు 9.75 కోట్ల రూపాయలు అందించామని వివరించారు. రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్‌లో జిల్లాలోని 1.33 లక్షల మంది రైతులకు రూ. 250 కోట్లు మంజూరు చేశామన్నారు. రైతులకు అయిల్‌పామ్‌ మొక్కలను వంద శాతం రాయితీపై అందిస్తున్నామని చెప్పారు. సన్నరకం వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్‌ చెల్లించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రజలకు కార్పొరేట్‌ వైద్యం అందించడమే లక్ష్యంగా జిల్లా ఆసుపత్రిని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచడమే లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసి 11.69 కోట్ల ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

- మహిళా సంఘాల బలోపేతం..

మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి జిల్లాలోని 8,170 స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందజేసి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని వివరించారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల ఆభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రజాపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎస్పీ నితికా పంత్‌, అడిషనల్‌ కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ద శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, అయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

- అభివృద్ధిని చూపేలా స్టాల్స్‌

జిల్లా కేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌, శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పాఠశాలల విద్యాశాఖ, పశువైద్య, పశు సంవర్ధక శాఖ, ఉద్యాన, పట్టుపరిశ్రమల వాఖ, అటవీ శాఖ, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ స్టాల్స్‌ ఆయా శాఖల అభివృద్ధి పనులను తెలియజేసేలా ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ హరిత వాటిని పరిశీలించినప్పుడు ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు అభివృద్ధి పనులను వివరించారు. స్టాల్స్‌ ఏర్పాటు చేసిన శాఖల అధికారులకు కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు.

- ఉత్తమ సేవలకు అవార్డులు..

జిల్లాలో 44 శాఖలకు సంబంధించిన 172 మంది ఉత్తమ అధికారులకు అవార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర కుటుంబ భద్రత పథకం ద్వారా జిల్లాలోని 142 మంది కుటుంబాలకు రూ.8.40 లక్షల చెక్కులను అందజేశారు.

- సేవలతో కూడిన శకటాలు..

వివిధ రకాల విభాగాలు తమ సేవలతో కూడిన శకటాలను చూపించాయి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 108, 102తో పాటు ఆలన, ఆర్టీసీ, అగ్నిమాపక శాఖ తమ శకటాలను ప్రదర్శించగా ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల మోడల్‌ శకటాన్ని గృహ నిర్మాణ శాఖ ప్రత్యకంగా అలంకరించాయి.

- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి. కలెక్టర్‌ హరిత, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరు కగా వివిధ పాఠశాల ల విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చేశారు.

Updated Date - Jan 26 , 2026 | 11:53 PM