జిల్లాకో బాలికల వసతి గృహం
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:28 PM
దేశ వ్యాప్తంగా సైన్స్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్ధినుల కోసం ప్రతీ జిల్లాలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
- రూ.53,47,315 కోట్లతో కేంద్ర బడ్జెట్
- బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
- బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా సైన్స్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్ధినుల కోసం ప్రతీ జిల్లాలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఆదివారం లోక్‌సభలో ఆమె 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ.53,47,315 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రక్షణ రంగానికి రూ.5,94,585 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.2,73,108 కోట్లు, హోం శాఖకు రూ.2,55,234 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగానికి రూ.1,62,671 కోట్లు, విద్యారంగానికి రూ.1,39,289 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.1,04,599 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.85,522 కోట్లు, ఐటీ టెలికాం రంగానికి రూ.74,560 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.81,174 కోట్లు, వాణిజ్య పరిశ్రమలకు రూ.70,296 కోట్లు, సామాజిక సంక్షేమానికి రూ.62,362 కోట్లు, విదేశి వ్యవహారాలకు రూ.22,119 కోట్లు, శాస్త్ర సాంకేతి శాఖకు రూ.55,756 కోట్లను కేటాయిస్తూ బడ్జెట్‌ను రూపొందించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం దివ్యాంజన్ కౌసర్ యోజన, దివ్యాంగ్ సహకార పథకాలను తీసుకొచ్చారు. క్యాన్సర్ రోగులకు ఉపయోగించే 12 ఔషధాలపై పన్ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. సెంట్రల్ ఎక్సైజ్ నుంచి బయో గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే సీఎన్‌జీకి మినహాయింపు ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానుంది. సవరించిన పన్ను రిటర్నింగ్ దాఖలు గడువును డిసెంబరు 31 నుంచి మార్చి 31 వరకు పొడగించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో చిన్న తరహా పరిశ్రల కోసం ప్రత్యేకదృష్టి సారించి రుణ పరిమితిని పెంచారు. బడ్జెట్‌తో బంగారం, వెండి దిగుమతి సుంకం తగ్గించటం వల్ల వాటి ధరలు తగ్గే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్లు, విడి భాగాలు సుంకం తగ్గించటంతో ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. సిగరేట్, పాన్‌మసాల, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంచటంతో భారీగా వాటి రేట్లు పెరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రానికి తీరని అన్యాయం:
- ఆత్రం సుగుణక్క, డీసీసీ అధ్యక్షురాలు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. రాష్ట్రానికి నిధుల కేటాయింపులు చేయలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ప్రకటించలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసిలు, బడుగుబలహీన వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఏమీ ప్రకటించలేదు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవటం బాధాకరం. రైతుల అప్పులు మాఫీ చేయలేదు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
సార్వత్రిక విద్యకు దూరంగా బడ్జెట్ కేటాయింపు..:
- కె.ఊశన్న, ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు
కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు సార్వత్రిక విద్య సాధన లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. గత సంవత్సరం రూ.1,28,600 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.1,39,289 కోట్లు కేటాయించారు. అంకెల్లో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ మొత్తం బడ్జెట్ దమాశాలో తక్కువగానే ఉంటుంది. పెరిగిన ధరలతో పోలీస్తే మధ్యాహ్న భోజనం, సమగ్ర శిక్షకు కేటాయించిన బడ్జెట్ ఏ మాత్రం సరిపోదు. ఉద్యోగులకు బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుందని ఆశించినా ఉద్యోగులకు ఊరట లభించలేదు.
కార్మిక వ్యతిరేక బడ్జెట్..
- బి ఉపేందర్, సీపీఐ జిల్లా నాయకుడు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉంది. కార్మిక, కర్షకులకు వ్యతిరేకంగా ఉంది. తెలంగాణకు కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగింది. యువజన హామీలు మరిచి పోయారు. ఈశాన్య రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్ ఎన్నికల స్టంటే.
అప్పుల వడ్డీకే సరిపోతోంది..
- దినకర్, సీపీఎం జిల్లా నాయకుడు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అప్పుల వడ్డీలకే సరిపోతోంది. బడ్జెట్ పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలకు, దేశాభివృద్ధికి ఉపయోగపడే విధంగా లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమానికి నిధులు తగ్గించారు. దేశ కార్పొరేట్ సంస్థలు అయినా అదానీ, అంబాని తదితరులకు డెటా సెంటర్ల పేరుతో రాయితీలు ప్రకటించారు. ఉద్యోగులకు ఆదాయం పన్ను పరిమితిని పెంచకుండా నిరాశ పరిచింది.
దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని..:
-శ్రీశైలం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేసింది. పేదలు, మధ్యతరగతి రైతులు, యువత సంక్షేమానికి ఈ బడ్జెట్ ఎంతో దోహదపడుతుంది. అభివృద్ధి ఉపాధి అవకాశాల పెంపు, మహిళ సాధికారతతో పాటు ఆర్థిక, స్థిరత్వం లక్ష్యంగా బడ్జెట్‌ను కేంద్రప్రభుత్వం రూపొందించింది. అన్ని రంగాలకు నిధులు కేటాయింపు జరిగింది. చాలా సంతోషంగా ఉంది.