వేలాల జాతరకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:51 PM
మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని వేలాల గ్రామంలోని గుట్టపై వెలిసిన గట్టు మల్లన్న జాతరకు ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి గుట్టపై దొనలో ఉన్న గట్టు మల్లన్నను దర్శించుకున్నారు.
- వైభవంగా వేలాల గట్టు మల్లన్న జాతర
- తరలివచ్చిన భక్తజనం
- గోదావరిలో పుణ్యస్నానాలు
జైపూర్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని వేలాల గ్రామంలోని గుట్టపై వెలిసిన గట్టు మల్లన్న జాతరకు ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి గుట్టపై దొనలో ఉన్న గట్టు మల్లన్నను దర్శించుకున్నారు. తెల్లవారుజామునే భక్తులు కుటుంబాలతో కలిసి వచ్చి గోదావరినదిలో స్నానాలు ఆచరించారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు వండి గట్టు మల్లన్న స్వామికి నైవేద్యం గా సమర్పించారు. మల్లన్న స్వామికి భక్తులు వారి పిల్లల తలనీలాలు సమర్పించారు.
వేలాల సర్పంచు డేగ స్వప్ననగేష్, ఆలయ ఈవో రమేష్ భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్‌లో నీడ కోసం టెంట్లను ఏర్పాటు చేశారు. వేలాల గ్రామపంచాయ తీ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీటిని భక్తులకు అందజేశారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, జైపూర్ సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ రాజశేఖర్, ఆధ్వర్యం లో గుట్టపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా పోలీసులు బందోబస్తు నిర్వ హిస్తూ భక్తులను క్యూలో పంపించారు. భక్తులు రాత్రి గుట్టపైనే జాగారం చేశారు. వేద పండితులు, ఒగ్గు పూజా రులు సంప్రదాయబద్దంగా మల్లికార్జునస్వామి భ్రమరాంబికలకు పట్నం వేసి వైభవం గా కల్యాణం జరిపించారు.
- సీసీ కెమెరాలతో నిఘా
జాతరలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మరో ముగ్గురు ఏసీపీలు, పదిమంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, 400 మంది పోలీసు సిబ్బందితో ఐదు రూట్లుగా బందోబస్తు నిర్వహించామన్నారు. ప్రధాన ప్రాంతాల్లో వంద సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేసి జాతరను పర్యవేక్షించా మన్నారు. మంచిర్యాల, చెన్నూరు, గోదావరిఖని ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వేలాలకు ఆర్టీసీ బస్సులు కేటాయించ డంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
- పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
వేలాల జాతరలో పంచాయతీరాజ్, పోలీసు, రెవెన్యూ, విద్యుత్, వైద్యశాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రమేష్ పేర్కొన్నారు. మొదటి రోజు అనేక మంది భక్తులు తరలి వచ్చారని, వచ్చిన భక్తు లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుధ్య్ద పనులను, తాగునీటి సదుపాయం కల్పించామన్నారు. జైపూర్, భీమారం పంచాయతీ కార్యదర్శులకు పారిశుధ్య పనుల విధులను అప్పగించామన్నారు. ఆర్‌డబ్య్లూఎస్ డీఈ విద్యాసాగర్ తాగునీటిని సరఫరాను నిరంతరం పర్యవేక్షించారు.
- మల్లన్న ఆశీస్సులతో చెన్నూరు అభివృద్ధి
వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి హామీ ఇచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం గట్టు మల్లన్న స్వామిని వివేక్‌వెంకటస్వామిఆయన సతీమణి సరోజ దర్శించుకున్నారు.
- పార్కింగ్‌పై భక్తుల ఆగ్రహం
జాతర సందర్భంగా వేలాల గ్రామంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ వ్యవస్థపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కింగ్ టెండరు దక్కించుకున్న ఓ వ్యక్తి గంటల కొద్ది వాహనాలను నిలిపివేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో వాహనదారులను తిడుతున్నాడని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీ పాస్‌లు ఉన్న వాహనాలను సైతం అనుమతించకుండా వీఐపీ పాస్‌లు ఎవరిస్తున్నారని భక్తులతో ఎగతాళిగా మాట్లాడారన్నారు. పార్కింగ్ నిర్వహణలో 12 నుంచి 15 సంవత్సరాల పిల్లలతో వాహనాలను ఆపివేస్తూ నిర్వహణ చేయిస్తున్నారని, మహిళల పట్లఅనుచితంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. జాతరకు వచ్చిన భక్తులు ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేశారు.