సహకార అస్త్రం.. అధికార పార్టీకి బలం
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:52 PM
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. మార్కెట్ కమిటీల మాదిరిగానే సహకార సంఘాల్లోనూ నామినేటెడ్ విధానంలో పదవులను భర్తీ చేయాలనే ప్రజాప్రతినిధుల విన్నపానికి తాజాగా మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
- కీలక నేతల చూపు పదవుల వైపు
- సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకమండళ్లు
వాంకిడి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. మార్కెట్ కమిటీల మాదిరిగానే సహకార సంఘాల్లోనూ నామినేటెడ్ విధానంలో పదవులను భర్తీ చేయాలనే ప్రజాప్రతినిధుల విన్నపానికి తాజాగా మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు సహకార శాఖకు ఆదేశాలు జారీచేసింది. ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో వీటిని నియమించనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 సహకార సంఘాలకు పదవీకాలం ఫిబ్రవరిలో ముగిసింది. ప్రస్తుతం వీరి స్థానంలో అధికారులతో కూడిన పర్సన్ ఇన్‌చార్జీల కమిటీలు పనిచేస్తున్నాయి.
- అంసతృప్తులకు చెక్ ....
శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ద్వితీయశ్రేణి నాయకులకు ఊరట కలిగించే అంశమిది. ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో 5-10 వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ముగ్గురు లే దా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలు అంటే.. 30-50 మంది కీలక నాయకులకు పదవులు దక్కనున్నాయి. తద్వారా అధికార పార్టీలోని అంతర్గత విభేదాలు, అసంతృప్తిని చక్కదిద్ది శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇది చక్కటి మార్గంగా ఉపయోగపడే అవకాశం ఉంది.
- క్షేత్రస్థాయిలో పట్టు.....
పీఏసీఎస్‌లు నేరుగా రైతులతో సంబంధం కలిగి ఉంటాయి. ఎరువుల పంపిణీ, ధాన్యం కొనుగోళ్లు, రుణాల మంజూరు వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుంటాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రస్తుతం నామినేటెడ్ విధానంలో పదవులను భర్తీ చేస్తున్నారు. సహకార సంఘాల్లోను నామినేటెడ్ కమిటీల ద్వారా అధికార పార్టీ నాయకులను అక్కడ కూర్చోబెట్టడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఎన్నికల వ్యయాన్ని తగ్గించుకోవచ్చని ప్రభుత్వం బావిస్తోంది.
- నూతన అధ్యాయానికి నాంది...
నామినేటెడ్ కమిటీల నియామకమనేది సహకార వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది పలుకనుంది. ఇవి కేవలం రైతుల ప్రయోజనాల కోసమే కాకుండా అధికార పార్టీ తన క్యాడర్ బలోపేతం చేసుకునేందుకు చక్కటి వేదికలు కానున్నాయి. ఈ నియామకాలు పూర్తిస్థాయిలో జరిగితే స్థానికంగా రాజకీయ సమీకరణాలు మారుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ సహకార సంఘాల్లో నామినేటెడ్ సభ్యులుండటం వల్ల ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా అమలుపరచటమే కాకుండా ప్రతిపక్షాలకు పట్టుచిక్కకుండా జాగ్రత్తపడవచ్చునని అధికార పార్టీ భావిస్తోంది.
- చిగురిస్తున్న అశలు....
నామినేటెడె పీఏసీఎస్‌లను నియమించేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 77 సహకార సంఘాలు ఉన్నాయి. 1.77 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. నామినేటెడ్ పద్ధతిలో పదవులు భర్తీచేస్తే జిల్లాలో 77 సంఘాలకు చైర్మన్ పోస్టులతోపాటు వైస్ చైర్మన్లుగా మరో 847 మందికి డైరెక్టర్లుగా వచ్చే అవకాశం ఉంది. దీంతో ద్వితీయశ్రేణి నేతలు పైరవీలపై దృష్టి సారిస్తున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ల లోనూ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ పదవులు ఉంటాయి. అధికార పక్షం ప్రజాప్రతినిధులు అయా పదవులకు అభ్యర్థులను ప్రాతిపాదించే అవకాశం ఉండటంతో నేతలు.. కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో....
జిల్లా పీఏసీఎస్‌లు సభ్యులు
ఆదిలాబాద్ 28 59,483
కుమరంభీం 12 23,788
నిర్మల్ 17 46,928
మంచిర్యాల 20 47,474