అడవుల సంరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Jun 04 , 2026 | 10:49 PM
అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని ఫారెస్టు డిప్యూటి రేంజ్ ఆఫీసర్(డీఆర్‌వో) ఎం. లావణ్య అన్నారు.
డీఆర్‌వో లావణ్య
కాసిపేట, జూన 4 (ఆంధ్రజ్యోతి) : అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని ఫారెస్టు డిప్యూటి రేంజ్ ఆఫీసర్(డీఆర్‌వో) ఎం. లావణ్య అన్నారు. గురువారం ముత్యంపల్లి సెక్షన పరిధిలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా వన దర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. అడవులను సంరక్షించడంలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చెట్లతోనే జీవ వైవిధ్యం కాపాడబడుతుందన్నారు. ప్రతీ ఒక్కరు అడవులను సంరక్షించాలని సూచించారు. వాతావరణంలో వచ్చే మార్పులను ఎదుర్కోవడంలో వృక్షాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ప్లాస్టిక్‌ను నిర్మూలించాలన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచు సుగుణ, ఎఫ్‌బీవో శ్రీధర్, మహిళలు పాల్గొన్నారు.
నెన్నెల: అటవీ శాఖ ఆధ్వర్యంలో జోగాపూర్ అటవివీ ప్రాంతంలో గురువారం వనదర్శిని కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, పరిసర ప్రాంత ప్రజలను అడవిలోకి తీసుకెళ్లి వివిధ రకాల చెట్లు, వాటి ఉపయోగం, వన్యప్రాణుల జీవన విధానం గురించి వివరించారు. మూగజీవాలు దాహార్తిని తీర్చుకునేందుకు ఏర్పాటు చేసిన నీటి కుంటలు, భూగర్భ జలాలు పెంపొందించేందుకు తవ్విన ట్రెంచుల గూర్చి చెప్పారు. అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయరాదని సూచించారు. నేల కోతకు గురికాకుండా ఉండేందుకు దట్టమైన అడవులు ఉండాలన్నారు. అటవీ సంరక్షణకు తమకు సహకరించాలని ప్రజలను కోరారు. ప్రజలను చైతన్యపరిచే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించిన అధికారులను సర్పంచ శ్రీవిద్య అభినందించారు. కార్యక్రమంలో రేంజ్ అధికారి దయాకర్, డిప్యూటీ రేంజర్ ప్రవీణ్‌నాయక్, ఎఫ్‌ఎస్‌వోలు శ్రీనివాస్, బాలకృష్ణ, రాందాస్, ఎఫ్‌బీవోలు మహేష్, శంకర్, రాజు, ఉపసర్పంచ వాణి తదితరులు పాల్గొన్నారు.
భీమిని: అండవులను సంరంక్షించాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందని డిప్యూటీ రేంజ్ అధికారి కే. గౌరీ శంకర్ అన్నారు. గురువారం మండలంలోని ఖర్జిభీంపూర్ గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వన్య ప్రాణుల వేట, కలప అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎఫ్‌బీవో గోపీకృష్ణ, గ్రామస్థులు పాల్గొన్నారు.