ఇంటి నిర్మాణ అనుమతులపై ఫిర్యాదు
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:39 PM
అప్పటి నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 42లో అక్రమంగా ఇంటి నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయని వాటిని రద్దు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని జాఫర్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి, టీఎన్‌జీవోస్ సభ్యుడు సాబీర్ అహ్మద్ ఖాన్ మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌కు ఈ నెల 10వ తేదీన లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
- లీవ్‌లో ఉండి పర్మిషన ఇచ్చినట్టు అప్పటి నస్పూర్ కమిషనర్‌పై ఆరోపణలు
- రద్దు చేయాలని రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు
- కలెక్టరేట్ రోడ్డులో కొనసాగుతున్న నిర్మాణాలు
మంచిర్యాల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): అప్పటి నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 42లో అక్రమంగా ఇంటి నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయని వాటిని రద్దు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని జాఫర్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి, టీఎన్‌జీవోస్ సభ్యుడు సాబీర్ అహ్మద్ ఖాన్ మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌కు ఈ నెల 10వ తేదీన లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. కమిషనర్‌తోపాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, వరంగల్‌లోని మున్సిపల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, హైద్రాబాద్‌లోని మున్సిపల్ అడ్మినిసే్ట్రషన్ డైరెక్టర్‌కు సైతం రిజిష్టర్డ్ పోస్టు చేశారు. సాబీర్ అహ్మద్‌ఖాన్ ఫిర్యాదుతో అక్రమంగా జారీ అయిన ఇంటి నంబర్ల అంశం మళ్లీ తెరపైకి రాగా, సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారోనన్న చర్చ ఊపందుకుంది. కాగా సర్వే నంబర్ 42లో కొంత భూమిని టీఎన్‌జీవోస్‌కు కేటాయించగా, అందులో సభ్యులు పలువురికి గతంలోనే ఇంటిస్థలాలు కేటాయించారు. ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, అర్హత లేకపోయినా ప్లాట్లు కేటాయించారని, ఈ విషయమైనా జిల్లా ఉన్నతాధికారులు ధృష్టిసారించాలని సాబీర్ అహ్మద్‌ఖాన్ కోరుతున్నారు.
- రాత్రికి రాత్రే అనుమతులు జారీ..
అసైన్డ్ భూమిలో ఓ మున్సిపల్ కమిషనర్ రాత్రికి రాత్రే జారీ చేసిన ఇంటి నిర్మాణ అనుమతులు చట్టబద్దమేనా...? అన్న చర్చ జిల్లా కేంద్రంలో జోరుగా జరుగుతోంది. అదికూడా సదరు అధికారి మెడికల్ లీవులో ఉన్న రోజు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా మరునాడే ఆయన మరో చోటుకు బదిలీ అయ్యారు. అయితే అప్పట్లోనే ఈ విషయమై హైదరాబాద్‌లోని మునిసిపల్ అడ్మిసే్ట్రటివ్ అథారిటీకి ఫిర్యాదులు అందాయి. దీంతో సదరు కమిషనర్‌పై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తూ మున్సిపల్ అడ్మినిసే్ట్రషన్ జాయింట్ డైరెక్టర్ దివ్య ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్‌పై చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు ఆయన జారీ చేసిన ఇళ్ల అనుమతులు రద్దు చేయకపోవడంతో అసైన్డ్ భూమిలో యథేచ్ఛగా నిర్మాణాలు వెలిశాయి. అలా అక్రమంగా వెలిసిన ఇళ్ల నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ ఓ రిటైర్డ్ ఉద్యోగి స్థానిక మున్సిపల్ అధికారులతోపాటు జిల్లా ఉన్నతాధికారులకు మూడు రోజుల క్రితం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో మంచిర్యాల కార్పొరేషన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
- తొమ్మిది ఇళ్లకు అనుమతులు జారీ....
నాటి నస్పూర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన తన్నీరు రమేష్ అనారోగ్య సమస్యల కారణంగా 2024 ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు మెడికల్ లీవు పెట్టారు. అనంతరం రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా 14వ తేదీన రిలీవ్ అయి 15న చేర్యాల మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా ఆయన 14వ తేదీన రాత్రికిరాత్రే అసైన్డ్ భూమిలో తొమ్మిది ఇళ్లకు నిర్మాణ అనుమతులు జారీ చేయడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. మెడికల్ లీవులో ఉండి కూడా ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేయడంతో కమిషనర్ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. అప్పటి నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 42లో అసైన్డ్ భూమి ఉంది. అందులో అక్రమంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచరు చేసి ప్లాట్లు విక్రయించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయి. అసైన్డ్ భూమిలో కొనుగోలు చేసిన ప్లాటుకు కమిషనర్ నిర్మాణ అనుమతుల కోసం టీఎస్ బీపాస్‌కు పంపగా జి లలిత, జి శ్రీనివాస్ పేరిట ప్లాట్ నంబర్ 126లోని 146.31 చదరపు గజాలకు ఆర్డర్ నంబర్ 364103/ఎన్‌ఏఎస్‌పీ/0027/2024 ద్వారా రెండంతస్థులతోపాటు మరో ఎనిమిది మందికి ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరయ్యాయి. సర్వే నంబరు 42లోని సదరు ప్లాటుకు రిజిసే్ట్రషన్ డాక్యుమెంట్ ఉన్నందునే నిర్మాణ అనుమతులు జారీ చేయడం జరిగిందని, బదిలీ అయిన స్థానంలో అత్యవసరంగా చేరాలని ఆదేశాలు ఉండటంతో తక్షణమే మెడికల్ లీవు రద్దు చేసుకుని విధులు చేరినట్లు కమిషనర్ వివరణ ఇచ్చారు. అయితే ఒక్క రోజులోనే ఏకంగా తొమ్మిది ఇంటి నంబర్లు మంజూరు చేయడాన్ని మున్సిపల్ అడ్మిసే్ట్రషన్ అధికారులు తప్పుబట్టారు. ఇదిలా ఉండగా అసైన్డ్ భూమిలో ఉన్న ప్లాటుకు అసలు డాక్యుమెంట్ ఎలా వచ్చిందనే చర్చ జరుగుతోంది.