తేలిన రిజర్వేషన్లు
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:46 PM
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల కోసం చకచకా అడుగులు వేస్తోంది. ఓటరు తుది జాబితా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ప్రక్రియ పూర్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో రిజర్వేషన్ల జాబితాను అధికారులు విడుదల చేశారు.
- రెండు మున్సిపాలిటీలో జాబితాను విడుదల చేసిన అధికారులు
- నోటిఫికేషన్ కోసం నిరీక్షణ
- టిక్కెట్ల కేటాయింపులపై పార్టీల చర్చలు
- నాయకుల ఇళ్ల వద్దకు ఆశావహుల పరుగులు
కాగజ్‌నగర్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల కోసం చకచకా అడుగులు వేస్తోంది. ఓటరు తుది జాబితా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ప్రక్రియ పూర్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో రిజర్వేషన్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదల కోసం అంతా నిరీక్షిస్తున్నారు. నోటిఫికేషన్ రాగానే అన్ని వివరాలు ప్రకటించేందుకు సన్నద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు విడుదల చేసిన రిజర్వేషన్ జాబితా వివరాలను పరిశీలిస్తే...
రిజర్వేషన్లు ఇలా..
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులకు 2011 జనాభా గణన ప్రకారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్ ప్రకటించారు. ఎస్సీ-5, జనరల్-8, మహిళలు-2, ఎస్టీ-1, జనరల్-1, బీసీ-9, మహిళలు 4 కేటాయించారు. ఈ ప్రక్రియ పూర్తి కావటంతో నోటిఫికేషన్ కోసం విడుదల కోసం అంతా నిరీక్షిస్తున్నారు. 2011 జనాభా గణన ప్రకారం ఈ కేటాయింపు చేశారు. నోటిఫికేషన్ విడుదల కాగానే వార్డుల వారీగా రిజర్వేషన్ ప్రకటించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులుండగా, ఎస్టీ-2, ఎస్సీ-3, బీసీ-5, ఆన్ రిజర్వుడ్ మహిళ-6, ఆన్ రిజర్వుడ్ జనరల్-4 కేటాయించారు. రిజర్వేషన్ల జాబితాను ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఆశావహుల్లో టెన్షన్ ఏర్పడింది. తమ వార్డుకు ఏ రిజర్వేషన్ వస్తోందని అంతా హైరానా పడుతున్నారు. ఒక వైపు తాము బరిలో ఉంటామని ముందస్తుగానే వార్డు ప్రజలతో మాటామంతీ కలుపుకొని అడుగులు వేస్తున్న ఆశావహులకు నిద్ర పట్టని పరిస్థితి నెలకొంది.
టిక్కెట్ కేటాయింపులపై చర్చలు..
రిజర్వేషన్ ప్రక్రియ ప్రకటించిన తర్వాత ప్రధాన పార్టీల నాయకుల వద్దకు ఆశావహులు పరుగులు పెడుతున్నారు. తమకు వార్డుకు రిజర్వేషన్ వస్తే బీ ఫాం, టికెట్టు తమకే ఇవ్వాలని పైరవీలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దండే విఠల్ పూర్తి స్థాయి సర్వేలు చేయించారు. ఏ వార్డులో రిజర్వేషన్ ఎలా వచ్చినా అభ్యర్థి ఉండేట్టు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తమకే టికెట్ ఇప్పించాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసం వద్ద ఆశావహులు పడిగాపులు కాస్తున్నారు. ఇదే పార్టీలో ఉన్న బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వద్దకు కూడా ఆశావహులు నిత్యం వచ్చి పైరవీలు చేస్తున్నారు. ఒకే పార్టీలో ఉన్న కోనేరు కోనప్ప, డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌లకు అధిష్ఠానం బీఫాం ఇచ్చే అవకాశం ఎవరికి కేటాయిస్తోందని బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు పట్టణంపై పట్టు పెంచుకునేందుకు మున్సిపల్ ఎన్నికలు వేదిక కావటంతో రెండు పార్టీలకు దీటైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వార్డుల కార్యకర్తలతో సమీక్షా సమావేశాలను కూడా నిర్వహించారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం..
- రాజేందర్, కమిషనర్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ
మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటరు తుది జాబితాను ప్రకటించాము. రిజర్వేషన్ల జాబితాను కూడా విడుదల చేశాము. నోటిఫికేషన్ రాగానే వార్డుల వారీగా వివరంగా ప్రకటిస్తాం. పోలింగ్ బూత్‌ల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశాము.