Share News

కదలని బస్సులు

ABN , Publish Date - Apr 22 , 2026 | 11:40 PM

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి బస్సులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కదలని బస్సులు
బస్సులు లేక వెలవెలబోతున్న మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్‌

- సమ్మెతో ఎక్కడికక్కడే నిలిచిన ఆర్టీసీ బస్సులు

- ప్రయాణికులులేక వెలవెలబోయిన బస్టాండ్‌లు

- రాకపోకలకు ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు

మంచిర్యాల, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి బస్సులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిత్యం ప్రయాణికులతో కళకళలాడే బస్టాండ్‌లు సమ్మె కారణంగా పూర్తిగా బోసిపోయాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, ఎన్నికల నిర్వహణ సహా మొత్తం 32 సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. 41 రోజుల కిత్రం ఇచ్చిన సమ్మె నోటీసుకు స్పందించిన ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించినప్పటికీ అవి ఫలించకపోవడంతో ఉద్యోగులు సమ్మెకు పూనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించడంతో సమ్మెకు దిగినట్లు జేఏసీ నాయకులు చెబుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా చర్చల పేరుతో కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాలయాపన చేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చినట్లు కార్మికులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈయూ, టీఎంయూ, టీజేఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఐఎన్టీయూసీ (ఎస్‌డబ్ల్యూయూ) యూనియన్ల నేతృత్వంలో ఏర్పడ్డ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు పూనుకున్నారు.

54 అద్దె బస్సులు..

ఉద్యోగుల సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొన్ని చోట్లా పోలీసులు బస్సులు నడపాల్సిందిగా సిబ్బందిపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఉద్యోగులు ససేమిరా అనడంతో సర్వీసులు కదల్లేదు. మంచిర్యాల డిపో నుంచి దాదాపు వందకుపైగా బస్సులు నిలిచిపోగా, ప్రయాణికులు రాకపోకలకు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ ఆదేశాలతో డిపో నుంచి 54 ఆర్టీసీ అద్దె బస్సులను నడపడంతో ప్రయాణికులు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. ఉద్యోగుల సమ్మె కారణంగా డిపో పరిధిలో రోజుకు రూ. 30 లక్షల మేర నష్టం వాటిళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. సమ్మె కారణంగా ప్రయాణికులతో నిత్యం కళకళలాడే మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్‌ బుధవారం బోసిపోయింది.

ఉచిత ప్రయాణానికి నిరాకరణ...

ఆర్టీసీ సమ్మె కారణంగా అద్దె బస్సులు నడిచినప్పటికీ వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణానికి సిబ్బంది నిరాకరించారన్న ఆరోపణలు వినిపించాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్త ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. సమ్మె నేపథ్యంలో పలు అద్దె బస్సుల డ్రైవర్లు ఆధార్‌ కార్డు చూపించిన మహిళల నుంచి కూడా బలవంతంగా చార్జీలు వసూలు చేసినట్లు సమాచారం. ఇదేంటని ప్రశ్నించిన వారిని ఉన్న ఫలంగా బస్సు నుంచి దించివేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. వివిధ స్టేజీల వద్ద మహిళలు బస్సులను చేయెత్తి ఆపినప్పటికీ డ్రైవర్లు వాహనాన్ని నిలవరించడకుండా వెళ్లడంతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దగ్గర ప్రయాణాలకు టాటా ఏస్‌లు, ఆటోలను ప్రజలు వినియోగించారు.

మంచిర్యాలలో ఉద్రిక్తత....

అద్దె బస్సులను ప్రైవేటు డ్రైవర్లు నడుపుతుండగా, కండక్టర్‌ లేకుండా వెళ్లాలనే ఆదేశాలను వారు ఖాతరు చేయలేదు. కండక్టర్‌ లేకుండా విధులు నిర్వహించేందుకు నిరాకరించిన ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్‌పై పోలీసులు చేయి చేసుకున్నారన్న ఆరోపణలతో మంచిర్యాల డిపో గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. డ్రైవర్‌పై చేయిచేసుకోవడంపై పోలీసులతో సిబ్బంది వాగ్వాదానికి దిగారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేయడంతో తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏసీపీ ప్రకాశ్‌ స్పందించి కార్మికులను సముదాయించడంతో వివాదం సద్దు మణిగింది.

Updated Date - Apr 22 , 2026 | 11:40 PM