మండుతున్న ఎండలు.. వాహనాలకు మంటలు
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:49 PM
రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. పగటివేళ బయటకు వెళ్లడానికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- నీడలో పార్కింగ్‌తోనే రక్షణ సాధ్యం
- ముందస్తు జాగ్రత్తతోనే ప్రమాదాల నియంత్రణ
వాంకిడి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. పగటివేళ బయటకు వెళ్లడానికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భానుడి ప్రభావంతో మనుషులే కాకుండా వాహనాలు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల మండల కేంద్రంలో ద్విచక్రవాహనానికి హఠాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల ఇంజన్, ఇతర బాగాలపై ఒత్తిడి పెరుగుతుంది. చిన్న లోపం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే పరిస్థితి నెలకొంది. వేసవిలో వాహన వినియోగంపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- ఇంజన్ వేడి.. మంటలకు కారణం
వేసవిలో వాహనాల ఇంజన్‌లు వేగంగా వేడుక్కుతుంటాయి. అధిక వేడి కారణంగా అయిల్, ఇంధన వ్యవస్థల్లో లోపాలు తలెత్తే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లీకేజీలు ఉంటే మంటలు చెలరేగే ప్రమాదం మరింత పెరుగుతుంది. ప్రయాణ సమయంలో ఢీకొన్న ఘటనల్లో కూడా ఇంధన లీకేజీ వల్ల అగ్నిప్రమాదం సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో నిలిపి ఉంచిన వాహనాల్లోనే ఆకస్మికంగా మంటలు అంటుకుంటున్నాయి. ఈ పరిణామాలు వాహనదారుల్లో అందోళన కలిగిస్తున్నాయి. ఇంజన్ స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
- వైరింగ్ లోపాలతో షార్ట్ సర్క్యూట్....
వాహనాల్లో నాణ్యతలేని వైరింగ్ వాడటం ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతుంది. వైర్లు దెబ్బతినడం, ఒకదానికికొకటి తగలడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది. అదనంగా ఫాగ్ లైట్స్, మొబైల్ చార్జర్లు, డెకరేషన్ లైట్లు అమర్చడంవల్ల వైరింగ్‌పై లోడ్ పెరుగుతుంది. ముఖ్యంగా పాత వాహనాల్లో ఈసమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. గ్యాస్ కిట్లు అమర్చిన వాహనాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే లీకేజీతో ప్రమాదం సంభవించవచ్చు. ఈ విషయాలపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. నాణ్యమైన భాగాలను మాత్రమే వినియోగించడం అవసరం.
- ఈవీ వాహనాలకు జాగ్రత్తలు అవసరం..
ప్రస్తుతం ఎలక్ర్టిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. వేసవిలో ఈవీ వాహనాలు త్వరగా వేడెక్కే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చార్జింగ్ సమయంలో దీర్ఘప్రయాణాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాటరీలు అధిక ఉష్ణోగ్రతలకు లోనైతే ప్రమాదాలు సంభవించే అవకాశంఉంది. కాబట్టి వాహనాలను నీడలో నిలిపి ఉంచడం మంచిది. గుర్తింపు పొందిన సర్వీస్ సెంటర్లలోనే మరమ్మతులు చేయించుకోవాలి. ఈవీ వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
- ఫుల్ ట్యాంక్‌తో ప్రమాదం...
అనేక మంది వాహనాల్లో ట్యాంక్ నిండా ఇంధనం నింపిస్తారు. అందులో పెట్రోల్, డీజిల్, హైడ్రోకార్బన్ సమ్మేళనాలు ఉంటాయి. ఎండాకాలంలో ఫుల్‌ట్యాంక్ చేయిస్తే వేడికి ట్యాంక్‌లో రసాయన చర్యలతో గ్యాస్‌ఫాం అయి మంటలు వచ్చే అవకాశం ఉంది. 1-2 లీటర్ల ఇంధనాన్ని నింపించటం ఉత్తమం.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
- వేసవిలో వాహనాలను సాధ్యమైనంత వరకు ఎండలో నిలపకుండా నీడలోనే ఉంచాలి.
- 5-6 గంటలు వాహనం నడిపిస్తే తప్పనిసరిగా 30 నుంచి 60 నిమిషాల వరకు విరామం ఇవ్వాలి. ఇంజన్ హీట్ ఎక్కకుండా వాహనం బయటికి తీసే ముందు కూలెంట్, ఇంజన్‌ఆయిల్ సరి చూసుకోవలి.
- ఫిల్టర్లను తరచూ మార్చుతూ ఉండాలి. వాహనంలోని హౌజ్‌పైప్, వైరింగ్‌ను సరిచూసుకోవాలి.
- బ్రేక్ స్లిప్పులు సరిగా లేకపోతే స్ట్రక్ అయి టైర్లలో మంటలు వస్తుంటాయి. టైర్లు అరిగిపోతే మార్చుకోవాలి.
- ఏసీ, గ్యాస్ వాహనాల్లో పైపులు లీకేజీ కాకుండా చూసుకోవాలి.
- వాహనాల్లో హీటర్‌ను 30-40 సెకండ్లు మాత్రమే వేయాలి. ఎక్కువసేపు వేస్తే ఓవర్ హీట్ అయి గ్యాస్ పైపులకు మంటలు అంటుకుంటాయి. అరగంట తర్వాత మరోసారి ఆన్ చేసుకోవాలి.
- వేసవిలో ఇంజన్, రేడియేటర్లలో డస్ట్ నిండుతోంది. ఇంజన్ రేడియేటర్లను నీటిలో శుభ్రం చేస్తే వాహనం త్వరగా చల్లబడుతుంది.
- ప్రతి వాహనంలో ఫైర్ సెఫ్టీ సిలిండర్ పరికరం ఉండేలా చూసుకోవాలి. మంటలు వచ్చినప్పుడు దానిని లాక్‌పుల్ చేసి స్ర్పేచేస్తే మంటలు అదుపులోకి వస్తాయి. ప్రతీ వాహనానికి నిర్ణీత సమయంలో సర్వీసింగ్ చేయించుకోవాలి.
- ద్విచక్రవాహనం 2500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఒకసారి అయిల్ మార్చుకోవాలి. సర్వీసింగ్ చేయించే సమయంలో అన్నిరకాల లిక్విడ్ల స్థాయిలు చెక్ చేసుకోవాలి.
- బైక్‌పై 40 కిలోమీటర్లకు ఒకసారి ఆగి వెళ్లటం మంచిది.
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహనాల వివరాలు.....
జిల్లా ద్విచక్రవాహనాలు కార్లు
కుమరం భీం 73,501 6,002
మంచిర్యాల 2,36,002 26,471
ఆదిలాబాద్ 1,86,926 16,256
నిర్మల్ 1,42,045 16,014