Share News

పుస్తకాలొచ్చాయ్‌...

ABN , Publish Date - May 09 , 2026 | 11:46 PM

పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. గతంలో పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించని విద్యాశాఖ అధికారులు రెండేళ్లుగా అందుకు భిన్నంగా సకాలంలో పాఠ్యపుస్తకాలను అందజేస్తోంది.

పుస్తకాలొచ్చాయ్‌...

-జిల్లాకు 3,39,170 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం

-ఇప్పటి వరకు వచ్చినవి 2,82,435

-ఈనెల చివరి వరకు మిగతావి వచ్చే అవకాశం

-పాఠశాలల పునఃప్రారంభం రోజే అందించేలా చర్యలు

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 9(ఆంధ్రజ్యోతి): పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. గతంలో పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించని విద్యాశాఖ అధికారులు రెండేళ్లుగా అందుకు భిన్నంగా సకాలంలో పాఠ్యపుస్తకాలను అందజేస్తోంది. సబ్జెక్ట్‌ పుస్తకాల కొరత తలెత్తకుండా అధిగమించడానికి కలెక్టర్‌ కె హరిత ఆధ్వర్యంలో ప్రత్యేక చొరవ తీసుకొని మందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని స్టాక్‌ పాయింట్‌కు 80 శాతం పుస్తకాలు చేరాయి. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి కలెక్టర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో అభివృద్ధి పనులు చేపడుతోంది. పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి పెండింగ్‌ పనులు పూర్తి అయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభంలోనే విద్యార్థులకు సమస్యలు రాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు అవసరమైన పుస్తకాలు జిల్లాకు విడతల వారీగా అందిస్తున్నారు.

62,315 మంది విద్యార్థులు

జిల్లాలోని 15 మండలాల్లో 103 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 106 ప్రాథమికోన్నత పాఠశాలలు, 833 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 62,315 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 3,39,170 పుస్తకాలు అవసరమని అధికారులు ప్రణాళికలు రుపొందించారు. ఇప్పటి వరకు 2,82,435 పుస్తకాలు రాగా వాటిని గోదాంలో భద్రపరిచారు. అలాగే పేద, మధ్యతరగతి కుటుంబాల వారి పిల్లలకు నోట్‌బుక్స్‌ కొనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాటిని సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గతేడాది నుంచి పాఠ్యపుస్తకాలతో పాటు రాత పుస్తకాలను అందిస్తోంది.

క్యూ ఆర్‌ కోడ్‌తో ముద్రణ

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధన కొనసాగుతోంది. విద్యార్థులకు అన్ని విషయాలు ఆర్థం అయ్యే విధంగా ఇబ్బందులు పడకుండా ఉండాలని పాఠ్యపుస్తకాల్లో ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో పాఠ్యంశాలను ముద్రిస్తున్నారు. అలాగే పుస్తకాలపై క్యూ ఆర్‌ కోడ్‌తో ముద్రిస్తున్నారు. దీంతో పుస్తకాలు పక్కదారి పట్టకుండా ఉండే అవకాశం ఉంది.

పూర్తిస్థాయిలో అందిస్తాం..

-రాథోడ్‌ ప్రకాష్‌, పుస్తకాల డిపో మేనేజర్‌

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభం రోజే ఉచిత పాఠ్యపుస్తకాలను అందేలా కృషి చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాకు 80 శాతం పుస్తకాలు చేరుకున్నాయి. మరో పది రోజుల్లో పూర్తిస్థాయిలో రానున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పాఠ్యపుస్తకాలను అందించడానికి కృషి చేస్తున్నాం.

Updated Date - May 09 , 2026 | 11:46 PM