భానుడి...భగభగ
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:23 AM
భానుడు భగ్గు మంటున్నాడు. ఉదయం తొమ్మిదింటి నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రహదారులు జన సంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు ఎండ వేడిమి తగ్గడం లేదు.
- జిల్లాలో తీవ్రమవుతున్న ఎండలు
- 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి
- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
ఆసిఫాబాద్/బెజ్జూరు, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): భానుడు భగ్గు మంటున్నాడు. ఉదయం తొమ్మిదింటి నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రహదారులు జన సంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు ఎండ వేడిమి తగ్గడం లేదు. జిల్లాలో ఐదురోజులుగా జిల్లాలో భానుడి ప్రతాపానికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోత, వడగాలులతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారు. అంతే కాకుండా ఉష్ణోగ్రతకు వన్యప్రాణులు అల్లాడి పోతున్నాయి. మూడు రోజులు గా జిల్లాలో 40 నుంచి 41.5 డిగ్రీల సెల్సియస్‌తో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డీ హైడ్రేషన్‌కు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో కొన్ని రోజులు ఇలాగే ఉంటుందని అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు...
జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నాలుగు రోజులుగా భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. శుక్రవారం సిర్పూర్-టిలో 41.5 డిగ్రీలు, దహేగాంలో 41.4, రెబ్బెనలో 41.3 డిగ్రీలు, కాగజ్‌నగర్‌లో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి.
శనివారం కెరమెరి మండలం ధనోరాలో అత్యధికంగా 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రెబ్బెన మండలం వంకులంలో 41.4, దహేగాం మండలం కుంచవెల్లిలో 41.2, కౌటాల, కెరమెరి, రెబ్బెన మండల కేంద్రాల్లో 41.1 తిర్యాణి, కాగజ్‌నగర్‌లో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఎండ ప్రతాపం చూపుతున్నది. వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంట్లో ఉన్న సామగ్రి సైతం ఎండ వేడికి భగ్గుమంటోంది. భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఏసీ, కూలర్లకు పెరిగిన డిమాండ్...
ఎండవేడిమి నుంచి తట్టుకునేందుకు ప్రజలు ఏసీలు, కూలర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. కొత్తవాటిని కొనుగోలు చేయడం పెరిగింది. సంపన్నులు, మధ్యతరగతి వారు ఏసీలు కొనడానికి ఎక్కువ మొగ్గు చూపుతుండగా, పేదలు కూలర్లు కొనేందుకు చూస్తున్నారు. మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల మధ్య కూలర్లు దొరుకుతుండటంతో వాటినే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. గతం కన్నా ఇప్పుడు ఏసీల ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో ఏసీలు రూ.30వేలకు దొరికేవి. ఇప్పుడు రూ.40వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. ఎండలు పెరగడంతో కుండల కొనుగోళ్లు కూడా పెరిగాయి. కొత్త కుండలు తీసుకెళ్లి చల్లని నీళ్లు తాగుతున్నారు. ఎండలకు విద్యుత్ వాడకం భారీగా పెరిగింది. ఉక్కపోత నుంచి ఉపశమనానికి ప్రజలు కూలర్లు, ఏసీల వాడకంతో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. చల్లదనం కోసం ప్రజలు శీతలపానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో దొరికే మజ్జిగ, పండ్ల రసా లు, చెఱుకు రంస, కొబ్బరి బొండాలను తీసుకునేందుకు ప్రజలు వాలిపోతున్నారు.
నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
వాహనదారులతో రద్దీగా ఉండే రోడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. ఎండ తీవ్రతకు వాహనదారులు రోడ్లెక్కాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం రోడ్లపైకి రావాలంటే వాహనదారులు వెనకంజ వేస్తున్నారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతుండగా మరికొన్ని రోజులు ఎండలు ఇలాగే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఎండలతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.
వడదెబ్బ అంటే..
శరీరం అధిక ఉష్ణోగ్రత్తకు గురైనప్పుడు శరీరంలోని నాడి సమస్యలు ఉత్పన్నమవుతాయి. సాధారణంగా మానవ శరీరంలో 70 శాతానికిపైగా నీరు నిలువ ఉండాలి. వేసవిలో పనిచేయడంతో చెమట రూపంలో నీటి శాతం తగ్గిపోయి నాడులు సరిగ్గా పని చేయవు. శరీరంలో జరిగే రసాయన చర్యలతో అధికంగా వేడి ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ చెమట పోవడం, శరీరానికి ఎక్కువ వేడిమి తాకడంతో డీహైడ్రేషన్‌తో ఊపిరితిత్తులు సరిగా పనిచేయక బాధితులు వాంతులు చేసుకుంటారు. శరీరంలో ఉన్న వేడితో విరేచనాలు అయి అపస్మారక స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. దీనినే సాధారణ భాషలో వడదెబ్బ అని వైద్యులు చెబుతున్నారు.
వడదెబ్బ లక్షణాలు
- మనిషి శరీరంలో ఉష్ణోగ్రత తీవ్రంగా పెరుగుతుంది.
- తలనొప్పి ఎక్కువగా ఉంటుంది.
- నాడి వేగంగా కొట్టుకుంటుంది.
- నాలుక ఎండి పోతుంది.
-శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది.
-పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక దశకు చేరుతారు
-వాంతులు, విరేచనాలు, దడ, అయాసం వస్తుంది.
ప్రథమ చికిత్సలు..
- వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని నీడ ఉండే ప్రమాదేశానికి చేర్చాలి.
- శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారన్ హీట్ లోపునకు వచ్చేలా చల్లని నీటిలో ముంచిన గుడ్డతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి.
- వడవెబ్బ తగిలిన వారికి ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్, ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం(ఓఆర్‌ఎస్) కలిపిన నీటిని తరుచూ తాగించాలి.
- పరిస్థితిని బట్టి చికిత్స కొనసాగించాలి.
- ప్రథమ చికిత్స అనంతరం దవాఖానకు తరలించాలి.