భగ్గుమన్న సూరీడు..
ABN , Publish Date - May 20 , 2026 | 11:49 PM
భగ్గుమంటున్న ఎండల కారణంగా జనజీవనం అతలాకుతలం అవుతోంది. వారం పదిరోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. విపరీతమైన దాహార్తితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్య ప్రతాపం కారణంగా మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
- మండిపోతున్న ఎండలు
- 46 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
- మధ్యాహ్నం సమయంలో ఎండ ప్రభావం తీవ్రం
- ఉదయం నుంచే వేడెక్కుతున్న వాతావరణం
- రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
మంచిర్యాల, మే 20 (ఆంధ్రజ్యోతి): భగ్గుమంటున్న ఎండల కారణంగా జనజీవనం అతలాకుతలం అవుతోంది. వారం పదిరోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. విపరీతమైన దాహార్తితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్య ప్రతాపం కారణంగా మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో క్రమేపీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణశాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని నిపుణులు హెచ్చరించారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లపై జనసంచారం పూర్తిగా తగ్గుముఖం పడుతోంది.
అడుగంటుతున్న భూగర్భ జలాలు...
ఎండలు తీవ్రతరం కావడంతో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ కారణంగా గోదావరి నదిలో పూర్తిగా నీరు అడుగంటి పోవడంతో బోర్లలో సైతం లోతుల్లోకి వెళ్లాయి. గోదావరిలో నీరు అడుగంటి పోతుండటంతో దాని ప్రభావం నది పరివాహక ప్రాంతాల్లోని బోర్లపైనా పడుతోంది. బోర్లలో నీటి మట్టం లోలోతుల్లోకి వెళ్లింది. దీంతో మోటార్లు ఆన్ చేసిన చాలా సేపటికిగాని నీరుపైకి రావడం లేదు. ఉష్ణోగ్రతలు ప్రమాదకరస్థాయిలో నమోదవుతుండటంతో అక్కడక్కడ కొన్ని చోట్లా తీవ్ర నీటి ఎద్దడి తలెత్తుతోంది. ప్రజలు వాడల్లో ఉన్న పబ్లిక్ బోర్లకు ఏర్పాటు చేసిన మోటార్లపై ఆధారపడుతున్నారు. మూగజీవాలు తాగునీటి కోసం తహతహలాడుతున్నాయి.
ఇబ్బందులు పడుతున్న సింగరేణి కార్మికులు...
జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల్లోని ఓపెన కాస్టు, అండర్ గ్రౌండ్ మైన్లలో విధులు నిర్వహించే కార్మికులు పెరిగిన ఎండల కారణంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉండటంతో పనివేళల్లో మార్పులు చేయడం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా మిడిల్ షిఫ్ట్, ఉదయం షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహించే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ షిఫ్ట్ వెళ్లే కార్మికులు మధ్యాహ్నం రెండు గంటలకు విధులు ముగించుకొని ఇంటికి రావాల్సి ఉండగా, మిడిల్ షిఫ్ట్ వెళ్లేవారు మధ్యాహ్నం ఒంటి గంటకు బయలు దేరాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విధులకు హాజరయ్యే వారు, విధుల నుంచి తిరిగి వచ్చే వారు ఎండ తీవ్రతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. హాజరు శాతంపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండల వేడిమి కారణంగా విధులు నిర్వహించేందుకు కార్మికులు ఆసక్తి చూపడంలేదు. కార్మికుల అవస్థలు దృష్టిలో పెట్టుకొని సింగరేణి ఉన్నతాధికారులు షిఫ్ట్‌ల వేళల్లో మార్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి...
క్రమేపీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల ఉక్కపోత కూడా అధికంగా ఉంటోంది. అలాగే ఇళ్లలోనూ ఉక్కపోతలు ప్రారంభమవుతున్నాయి. కూరగాయలు, ఇతర చిరువ్యాపారులు ఎండవేడిమి భరించలేకపోతున్నారు. రోడ్లపక్కన గొడుగులు ఏర్పాటు చేస్తూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. పగటిపూట వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు రోడ్ల పక్కన ఉండే సోడా, జ్యూస్ సెంటర్ల వద్ద సేద తీరుతున్నారు. ఎండల కారణంగా వివిధ రకాల జ్యూస్‌లు సేవించే వారి సంఖ్య పెరుగుతోంది.
ఎడారిని తలపిస్తున్న గోదావరి...
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా గోదావరి నది పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు కూడా సరిపడా నీరు అందుబాటులో లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు పూర్తిగా మూసివేయడంతో దిగువన గోదావరిలోకి ఇన్ ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ఇసుక తవ్వకాల కోసం తీసిన గుంతలు, మగుడుగుల వద్ద మాత్రమే కొద్దిగా నీరు అందుబాటులో ఉండటంతో అందులోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
జిల్లాలో 46.4 డిగ్రీలు నమోదు...
తీవ్రరూపం దాల్చుతున్న ఎండల కారణంగా జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరుసగా ఐదారు రోజులుగా జిల్లాలో 45 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం భీమారం మండలంలో 46.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఇంతగా ఉష్ణోగ్రతలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కోటపల్లి మండలం దేవులవాడలో 46.3, కోటపల్లి, దండేపల్లి మండలం వెల్గనూరు, చెన్నూరు మండలం కొమ్మెర, బెల్లంపల్లి మండలంలో 46.2, కన్నెపల్లి మండలం జన్కాపూర్, జన్నారం మండలం తపాల్‌పూర్, నస్పూర్‌లో 46.1, జైపూర్ మండలం కుందారంలో 46, మందమర్రి మండలం అందుగులపేటలో 45.9, హాజీపూర్ మండలం ర్యాలీ, పాత మంచిర్యాలలో 45.8, భీమిని మండలంలో 45.7, కాసిపేట మండలం కొండాపూర్, నెన్నెల, వేమనపల్లి మండలం నీల్వాయిలో 45.3, తాండూరు మండలంలో 45.1, లక్షెట్టిపేట మండలం శాంతాపూర్‌లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేసింది.