Share News

విద్యార్థుల భవిష్యత్‌కు మెరుగైన వసతులు

ABN , Publish Date - May 11 , 2026 | 11:33 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్‌ కె హరిత తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్‌కు మెరుగైన వసతులు
అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న్ల కలెక్టర్‌ కె హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి

- కలెక్టర్‌ కె హరిత

రెబ్బెన, మే 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్‌ కె హరిత తెలిపారు. సోమవారం రెబ్బెన గంగాపూర్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాల్లో ఏర్పాటు చేసిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందరికి విద్యను అందించటమే ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతీ పాఠశాలలో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సీఎస్‌ఆర్‌, ఉపాధిహామీ, సర్వశిక్ష అభియాన్‌ నిధులతో జిల్లాలో ప్రతి పాఠశాలలో మౌలిక వసుతల కల్పనకు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. పాఠశాలలో సరైన స్థలం లేని చోట ప్రి పాబ్రిక్‌ టాయిలెట్‌ గదులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థినులకు వేసవి శిబిరాలను ఏర్పాటు చేయటం ద్వారా క్రీడలు, డ్రాయింగ్‌, చిత్రలేఖనం వంటి వాటిపై శిక్షణ ద్వారా మేలుకువలు సాధించవచ్చన్నారు. పదోతరగతి, ఇంటర్‌ అడ్వాన్సు సప్లిమెంటరి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కోచింగ్‌ వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించటానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తుంగెడ జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రి పాబ్రిక్‌ టాయిలెట్‌ గదిని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏం పనులు చేపట్టాలని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని కలెక్టర్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో పీఎసీఎస్‌ చైర్మన్‌ కార్నథం సంజీవ్‌, తహసీల్దార్‌ సూర్యప్రకాష్‌, ఎంపీడీవో శంకరమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 11:33 PM