రమణీయం.. శివపార్వతుల కల్యాణం
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:27 PM
వాంకిడి మండల కేంద్రలోని శివాలయంలో సోమవారం శివపార్వతుల కల్యాణం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
వాంకిడి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): వాంకిడి మండల కేంద్రలోని శివాలయంలో సోమవారం శివపార్వతుల కల్యాణం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణల అనంతరం అర్చకులు నారాయణమూర్తి, మనోజ్‌పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య కల్యాణోత్సవాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవం సం దర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో అలంకరించా రు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు.
- రెండో రోజు కొనసాగిన జాతర
శివాలయ ప్రాంగణంలో రెండోరోజు మహాశివరాత్రి జాతర కొనసాగింది. సోమవారం భక్తులు భారీగా తరలివచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చు కున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి జాతరకు తరలిరావడంతో ప్రజలతో జాతర ప్రాంగణం కిటకిటలాడింది. మహిళలు, పిల్లలు, యువతీయువకులు జాతరలో తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకున్నారు. జాతరలో వెలిసిన రంగుల రట్నాలు, బ్రేక్‌డ్యాన్స్, రైలుబండి, తదితర ఆటల చక్రాలతో పిల్లలు సందడి చేశారు.
ఉమాచంద్రశేఖర ఆలయంలో బోనాలు
దహెగాం: దహెగాం మండలం లగ్గాం ఉమాచంద్రశేఖర ఆలయంలో సోమవారం బోనాలతో భక్తులు ప్రదక్షణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరుసటి రోజు బోనాలతో నైవేద్యం వండి భక్తులకు సమర్పించడం మొక్కులు చెల్లించుకుంటారు. లగ్గాం, చౌక, పంబాపూర్, ఏన, వీటిగూడెం గ్రామాల భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
ఘనంగా కర్జెల్లి ముసలమ్మ జాతర
చింతలమానేపల్లి: మండలంలోని కర్జెల్లి ముసలమ్మ గుట్టపై ఉన్న శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర కార్యక్రమం రెండవ రోజు ఘనంగా జరిగింది. చుట్టు పక్ల గ్రామాల భక్తులు, ప్రజలు రాకతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు.