Share News

ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

ABN , Publish Date - May 19 , 2026 | 12:21 AM

రాష్ట్రంలో వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవించేటప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ కె హరిత

- రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఆసిఫాబాద్‌, మే 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవించేటప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి 18 జిల్లాలో వరదలు, అగ్ని ప్రమాదాలపై నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ నమునా ప్రదర్శణ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 13 జిల్లాల్లో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల వల్ల నదులు, వాగులు ఉధృతంగా ప్రవహించే గ్రామాలను లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుత్తాయని ముందస్తుగా ప్రజలను సురక్షితంగా రక్షించేందుకు అధికార యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో భారీ అగ్ని ప్రమాదాలు ఇటీవల సంభవించి భారీగా ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు సంభవించాయన్నారు. అడవుల్లో నిప్పురవ్వలు పడి అడవిలోని విలువైన సంపద కాలిబూడిద అవుతున్నాయని, అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండి అడవులను రక్షించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ కె హరిత పాల్గొని మాట్లాడారు. సిర్పూర్‌(టి) మండలం వెంపల్లి అటవీ ప్రాంతంలో అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక, రాష్ట్ర విపత్తల నిర్వహణశాఖ, పంచాయతీ రాజ్‌, పోలీస్‌, వెటర్నరీ, విద్య, వైద్యం, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొని అటవీ అగ్ని ప్రమాదాల నియంత్రణపై మాక్‌ డ్రిల్‌ను నిర్వహించారని తెలిపారు. జిల్లాలో విపత్తులు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎదుర్కొవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

నీతి ఆయోగ్‌ సంపూర్ణ అభియాన్‌లో భాగంగా ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ కె హరిత తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ భవన సముదాయంలోని వీసీ హాల్‌లో న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్‌ కార్యాలయం నుంచి నీతి ఆయోగ్‌ సీఈవో నిధి చిబ్బర్‌ ఇతర ఉన్నతాధికారులతో కలిసి దేశంలోని ఆకాంక్షిత బ్లాక్‌లో నీతి ఆయోగ్‌ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నీతి ఆయోగ్‌ ద్వారా ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం, ఆకాంక్షిత బ్లాక్‌ కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తిర్యాణి మండలంలో ఆర్ట్‌ విలేజ్‌, లైబ్రరీ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, ఆకాంక్షిత మండల సమన్వయకర్త బాలరాజు, రాజారామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 12:21 AM