హాజరుకు అమావాస్య గండం
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:39 PM
తెలుగువారి ఇంట ఏ చిన్న ముచ్చట జరగాలన్నా ముందుగా పంచాంగమే చూస్తారు.
- పాఠశాలల పునఃప్రారంభానికి సెంటిమెంట్ ఎఫెక్ట్
- విద్యార్థులు రాక వెలవెలబోయిన పాఠశాలలు
వాంకిడి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): తెలుగువారి ఇంట ఏ చిన్న ముచ్చట జరగాలన్నా ముందుగా పంచాంగమే చూస్తారు. ఇల్లు మారాలన్నా, కొత్త పనులు మొదలు పెట్టాలన్నా తిథి, వారం, నక్షత్రాలు కుదరాల్సిందే. అలాంటిది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే చదువుకు శ్రీకారం చుట్టే వేళ, ముహూర్తం సరిగ్గా లేకపోతే తల్లిదండ్రుల మనసు అంగీకరిస్తుందా? రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ జీవోల ప్రకారం పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. సోమవారం అమావాస్య కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించలేదు. దీంతో ప్రారంభం రోజు విద్యార్థులురాక పాఠశాలలు వెలవెలబోయాయి. సోమవారం అమావాస్య మంగళవారం కూడా సెంటిమెంట్లు బ్రేకులు వేస్తున్నాయి.
- అమావాస్య ట్విస్ట్....
వేసవి సెలవుల సందడి ముగిసి, పిల్లలు బడికి వెళ్తారని సంబరపడిన తల్లులకు క్యాలెండర్ గట్టి షాక్ ఇచ్చింది. సోమవారం అమావాస్య కావడతో ఆ రోజున కొత్త పుస్తకాలు తీయడం లేదా కొత్త ప్రయాణాలు మొదలు పెట్టడం అపశకునమని చాలామంది భావిస్తారు. అమావాస్య రోజున అక్షరాభ్యాసాలే ఉండవు. ఇక కొత్త క్లాసులకు పిల్లలను ఎలా పంపాలి? అన్నఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఫలితంగా తొలిరోజు హాజరుశాతంపై అమావాస్య ప్రభావం స్పష్టంగా కనిపించింది.
- మంగళవారం కూడా..
విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి మంగళవారం మరో అడ్డంకిగా మారింది. మంగళవారం కొత్త పనులు మొదలు పెట్టకూడదనేది సెంటిమెంట్‌ను నమ్మే వారు చాలామంది ఉన్నారు. ఆ రోజు పంపితే చదువుకు మంగళం పాడతారని భయపడే వారు లేకపోలేదు. దీంతో విద్యాశాఖ ఆశించిన స్థాయిలో సోమ, మంగళవారాల్లో విద్యార్థులు పాఠశాలకు రాకపోవచ్చు.
- బుధవారం నుంచి మొదలు..
ప్రభుత్వ రికార్డుల ప్రకారం పాఠశాలలు సోమవామే తెరుచుకున్నా, క్లాస్ రూముల్లో సందడి మాత్రం బుధవారం 17 నుంచే మొదలయ్యేలా ఉంది. బుధవారం సర్వశ్రేష్టమైన రోజు కావడంతో మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ రోజే బడికి పంపాలని నిర్ణయించుకున్నారు. డిజిటల్ యుగంలో ఎన్ని మార్పులు వచ్చినా, తెలుగువారి సెంటిమెంట్లు మాత్రం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని ఈవిద్యాసంవత్సరం ఆరంభమే తెలియజేస్తుంది.
తెరుచుకోని 13 పాఠశాలలు
ఆసిఫాబాద్‌రూరల్: ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు, పిల్లలు లేక మూతపడుతున్నాయి. సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం కాగా మండలంలోని 13 పాఠశాలలు తెరుచుకోలేదు. మండంలోని గొల్లగూడ(ఎస్), కొమ్ముగూడ(ఎ), బాబాపూర్ తాండ, భవానీనగర్, సముతులగుండం, రాజంపేట, జెండాగూడ, వట్టివాగు, రౌటసంకెపల్లి, దేవదుర్గం, టొక్కిగూడ, గొల్లగూడ(ఈ), గూడెన్‌ఘాట్ పాఠశాలలు తెరుచుకోలేదు. అయా గ్రామాల్లోని పాఠశాల భవనాలు, పిల్లలు ఉన్నప్పటికి ఉపాధ్యాయులు లేక తెరుచుకోలేదు. గతేడాది గొల్లగూడ(ఎస్), కొమ్ముగూడ, బాబాపూర్ తాండ పాఠశాలలను పునః ప్రారంబించినప్పటికి కొన్ని రోజులు మాత్రమే నడిచాయి. మూతపడ్డ హీరాపూర్ పాఠశాలను సోమవారం పునః ప్రారంబించారు. మండలంలో మూతపడ్డ పాఠశాలలను తెరిపించాలని అయా గ్రామాల ప్రజలు కొరుతున్నారు. తెరుచుకోని పాఠశాలల విషయమై ఎంఈఓ సుభాష్‌ను వివరణ కోరగా దశల వారీగా మూతపడిని పాఠశాలలను పునః ప్రారంబించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.