ఆసిఫాబాద్ బల్దియా పీఠం బీఆర్‌ఎస్‌దే
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:33 PM
అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆసిఫాబాద్ మున్సిపల్ పీఠాన్ని బీఆర్‌ఎస్ దక్కించుకుంది. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి చక్రం తిప్పడంతో చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు బీఆర్‌ఎస్‌కే దక్కాయి.
- చక్రం తిప్పిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
- సొంత పార్టీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్
- అందరి అంచనాలు తారుమారు
- కాంగ్రెస్ నాయకులపై సస్పెన్షన్ వేటు
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆసిఫాబాద్ మున్సిపల్ పీఠాన్ని బీఆర్‌ఎస్ దక్కించుకుంది. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి చక్రం తిప్పడంతో చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు బీఆర్‌ఎస్‌కే దక్కాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చైర్మన్‌గా మెంగ్రె అకాష్, వైస్ చైర్మన్‌గా ఎండీ ఆహ్మద్‌లు ఎన్నికయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం అవరణలో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేకాధికారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్ గజానంద్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు హాజరయ్యారు. మొదట గెలుపొందిన అభ్యర్థులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం 12:30 గంటలకు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. మున్సిపాలిటీలో 20 వార్డులుండగా మ్యాజిక్ ఫిగర్ 11 కావాల్సి ఉంది. కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అబ్దుల్లా, బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థిగా మెంగ్రె ఆకాష్ పేర్లను అయా పార్టీల అభ్యర్థులు ప్రతిపాదించి బలపరిచారు. అబ్దుల్లాకు మద్దతుగా ఆరుగురు కాంగ్రెస్ పార్టీ, నలుగురు స్వతంత్రులు మాత్రమే చేతులు లేపారు. 13వ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుండా స్నేహ మాత్రం అబ్దుల్లా అభ్యర్థిత్వాన్ని సమర్థించలేదు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ చైర్మన్ మెంగ్రె ఆకాష్ అభ్యర్థిత్వాన్ని ఎక్స్ అఫీషియో ఓటు కలిగిన ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు తొమ్మిది మంది బీఆర్‌ఎస్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ గుండా స్నేహ బీఆర్‌ఎస్ అభ్యర్థి అకాష్‌కు మద్దతు తెలపడంతో 11 మంది మెజార్టీ సభ్యులు చేతులు లేపారు. దీంతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన మెంగ్రె ఆకాష్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత వైస్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన ఎండీ ఆహ్మద్‌కు కూడా 11 మంది చేతులు లేపి బలపరచడంతో వైస్ చైర్మన్‌గా ఆహ్మద్‌ను ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ కౌన్సిలర్ అనూహ్యంగా మద్దతు తెలపడంతో అందరి అంచనాలు తారుమారయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు షాక్ ఇస్తారన్నా టెన్షన్‌లో ఉన్న కాంగ్రెస్ నేతలకు సొంతపార్టీ కౌన్సిలర్ స్నేహ షాక్ ఇవ్వడంతో అధికార పార్టీ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను దక్కించుకొలేకపోయింది.
హైడ్రామ మధ్య ఎన్నిక
ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక అత్యంత హైడ్రామ మధ్య సాగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యులు వేర్వేరుగా తమ వాహనాల్లో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈసమయంలో ఎవరెవరికి మద్దతు ఇస్తారో తెలియని పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ క్యాంపులో 11 మంది సభ్యులు ఉండగా స్వతంత్ర అభ్యర్థుల వ్యవహారశైలిపైనే అనుమానాలు వ్యక్తమవ్వగా వారు ఓటు ఎటు వేస్తారనే చర్చ వినిపించింది. ఈ అనుమానాలకు తగ్గట్టుగానే కొంత మంది కౌన్సిలర్లు లోనికి వెళ్లేందుకు ససేమేర అనడంతో అధికార పార్టీ నాయకులు ఎలాగోల నచ్చజెప్పి లోనికి పంపించారు. ఈ పరిస్థితుల్లో స్వతంత్రులు తమకు ఓటు వేస్తారో లేదోనన్న ఆందోళన అధికార పార్టీలో నెలకొంది. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక సమయంలో నలుగురు స్వతంత్రులు కాంగ్రెస్‌కు మద్దతిచ్చినప్పటికీ సొంత పార్టీ కౌన్సిలర్ గుండా స్నేహ బీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడం అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఎమ్మెల్యే కోవ లక్ష్మి చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు చక్రం తిప్పడంలో సఫలీకృతం అయ్యారు.
అంతర్మథనంలో కాంగ్రెస్..
మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను బీఆర్‌ఎస్ దక్కించుకోవడం అందుకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మద్దతు తెలపడంతో కాంగ్రెస్ జిల్లా నాయకులు అంతర్మఽథనంలో పడ్డారు. ఈ అనూహ్య పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకొలేకపోతున్నారు. కాంగ్రెస్‌లోని వర్గపోరే ఈ పరిణామాలకు దారి తీసిందని పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీ నాయకులు ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వ్యవహారం, ప్రచారంలో వైఫల్యం చెందినట్లు స్పష్టం మవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడంతో మాజీ డీసీసీ ప్రెసిడెంట్ విశ్వప్రసాద్ ఇంటివద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి డీసీసీ అధ్యక్షురాలు సుగుణను రాజీనామా చేయాలని నిలదీశారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకులను సస్పెండు చేయాలని పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్ విప్ ధిక్కరించి బీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన 13వ వార్డు కౌన్సిలర్ గుండా స్నేహ, అమె భర్త, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, తిర్యాణి మండల అధ్యక్షుడు అనిల్‌గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండు చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను పీసీసీకి పంపిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ వైఫల్యమే మా గెలుపునకు నాంది
- ఎమ్మెల్యే కోవ లక్ష్మి
అధికార కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల్లో ప్రజలకు ఏమి చేయలేదని అదే మా గెలుపునకు నాందిగా నిలిచిందని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల అనంతరం విలేకరులతో మాట్లాడారు. చైర్మన్ ఎన్నికల్లో తమకు సహకరించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీతో ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు. దీంతో విసుగు చెంది తమ పార్టీకి మద్దతు తెలిపిందని అమెకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.