Share News

జంతువుల లెక్క తేలనుంది

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:37 PM

జిల్లాలో ఈ నెల 19నుంచి 24వరకు జంతు గణనను అటవీ అధికారులు చేపట్టనున్నారు. ఈ లెక్కింపును ప్రతీ నాలుగేళ్లకోసారి లెక్కిస్తారు. జిల్లాలో జంతువులను లెక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆరురకాల విధానాలను అవలంభిస్తారు.

జంతువుల లెక్క తేలనుంది

- ఈనెల 19నుంచి 24వరకు జంతుగణన

- ఆరు రోజుల పాటు గణన

- తొలుత మాంసాహార జంతువులు ఆ తర్వాత శాఖాహార జంతువుల లెక్కింపు

- సిద్ధమవుతున్న అటవీశాఖ

బెజ్జూరు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 19నుంచి 24వరకు జంతు గణనను అటవీ అధికారులు చేపట్టనున్నారు. ఈ లెక్కింపును ప్రతీ నాలుగేళ్లకోసారి లెక్కిస్తారు. జిల్లాలో జంతువులను లెక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆరురకాల విధానాలను అవలంభిస్తారు. కాలినడకదారులను, ప్రత్యక్ష, పరోక్ష, పాదముద్రలు, మలమూత్రాలు, గూడు, శబ్దాలు, చెట్లను గీకడం, నేలను దున్నడం, ట్రాన్సెక్టు లాంటి తదితర విధానాల ద్వారా జంతువులను లెక్కిస్తారు. సుమారు 15 కిలోమీటర్ల పరిధిని తీసుకొని రోజుకు ఐదు కిలో మీటర్ల చొప్పున తిరుగుతూ లెక్కిస్తారు. ఇందులో ముందుగా మాంసాహారం ఆతర్వాత శాఖాహార జంతువులను లెక్కిస్తారు. జనాభా లెక్కల మాదిరిగానే ప్రతీ నాలుగేళ్లకోసారి అటవీశాఖ జంతుగణనను చేపట్టి వాటి లెక్కలను తేల్చుతుంది. గతంలో 2022లో జంతుగణను చేపట్టిన అటవీశాఖ అధికారులు తిరిగి ఈ నెల 19నుంచి 24వరకు జిల్లాలో జంతుగణను చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా అటవీ శాఖ ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌-2026 చేపట్టనుంది. ఇందుకోసం కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని రేంజ్‌, సెక్షన్‌, బీట్‌స్థాయి అధికారులకు ఇప్పటికే శిక్షణ సైతం ఇచ్చారు. వన్యప్రాణుల గణన ఎలా చేయాలో నేర్పించారు. ఒకబీట్‌ పరిధిలో బీట్‌స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరు కలిసి రోజుకు అయిదు కిలోమీటర్ల చొప్పున మూడు రోజుల్లో 15కిలోమీటర్లు పర్యటించి కెమెరాల ఆధారంగా పులుల పాదముద్రలు, పెంటికలు, తదితర ఆనవాళ్లను సేకరించనున్నారు. అటవీ శాఖ సిబ్బంది కొరత కారణంగా వలంటీర్లను సైతం తీసుకోనున్నారు. అటవీశాఖకు సహకరిస్తున్న ఎన్జీవోలను భాగస్వాములను చేయనున్నారు. అడవులు, చట్టాలపై అవగాహన కలిగి, నిబంధనలు పాటించే నిరుద్యోగ యువతను ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అవకాశం కల్పించనున్నారు. ఎంపిక చేసిన సిబ్బందికి శిక్షణ అనంతరం ఈ నెల 19నుంచి చేపట్టనున్న గణనలో భాగస్వాములను చేయనున్నారు.

- యాప్‌లో నమోదు....

అటవీ శాఖ సిబ్బంది మొబైల్‌ యాప్‌ ద్వారా నమోదు చేస్తారు. జిల్లాలోని వివిధ అటవీ ప్రాంతాల్లో పెద్ద పులులు, చిరుతలు తరచూ తిరుగుతూ ఉంటాయి. మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి తరచూ జిల్లా అడవుల్లోకి పెద్ద పులులు ప్రవేశించి అనువైన స్థావరం కోసం వెతుక్కుంటాయి. ప్రస్తుతం పులుల మేటింగ్‌ సీజన్‌ కావడంతో ఆడపులుల కోసం మగపులులు వెతుక్కుంటూ అడవుల్లోకి ప్రవేశిస్తాయి. ప్రతీరోజు రెండు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో అటవీ ప్రాంతాల్లో ఉన్న బాటల వెంట తిరుగుతారు. చిరుతలతో పాటు ఇతర జంతువులు బాటల వెంట వెళ్తాయని అధికారులు తెలిపారు.

- లెక్కింపు ఇలా....:

అడవుల్లో జంతుగణను అటవీశాఖ అధికారులు ముఖ్యంగా ఆరు రకాల విధానాల ద్వారా గుర్తిస్తారు. అడవిలో కాలినడకన దారులను గుర్తించి జంతువుల వివరాలను సేకరిస్తారు. ప్రత్యక్ష గణన విధానం ద్వారా జంతువులను నేరుగా చూసి లెక్కించడం, పరోక్ష గణన విధానం ద్వారా జంతువుల గుర్తుల ఆధారంగా లెక్కిస్తారు. చిరుతలు, ఇతర వన్యప్రాణుల విసర్జనలు, పాదముద్రలు వంటి వాటితో లెక్కిస్తారు. అలాగే చిరుతలు చెట్లను గీరుతుంటాయి. దాని ప్రకారం కూడా గుర్తు పట్టేందుకు వీలుంటుంది. అటవీ ప్రాంతాల్లో కెమెరాలను సైతం బిగించనునన్నారు. అయితే జిల్లాలో అటవీ బీట్‌ అధికారుల పోస్టులు చాలావరకు ఖాళీగా ఉన్నాయి, దీంతో గణన చేసేందుకు వలంటీర్లను తీసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి గణన నిర్వహిస్తారు. జిల్ల్లాలో ఈ నెల 19నుంచి గణన కొనసాగనుంది. మూడు రోజుల పాటు మాంసాహార జంతువులైన చిరుతలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లను లెక్కిస్తారు. తర్వాత శాఖాహార జంతువులను లెక్కిస్తారు.

- ఉదయం సమయంలోనే...:

ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే గణన చేపట్టనున్నారు. వాస్తవానికి వన్యప్రాణులు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలోనే మేల్కొంటాయి. ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటల నుంచే ఆహారం కోసం వేట ప్రారంభిస్తాయి. అందువల్ల ఆ సమయంలోనే గణన చేపట్టే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 11 రేంజ్‌లు, 54 సెక్షన్లు , బీట్లు 243 ఉండగా, 2.44లక్షల హెక్టార్లు అటవీ విస్తీర్ణం ఉంది. జిల్లాలో బీట్‌ అధికారులు మరో 50శాతం మేర ఖాళీలు ఉన్నాయి. సెక్షన్లు ఒకటి, రెండు మినహా దాదాపు భర్తీ అయ్యాయి.

ఎక్కడా పొరపాట్లు లేకుండా...

- నీరజ్‌కుమార్‌ టిబ్రేవాల్‌, జిల్లా అటవీశాఖ అధికారి

వన్యప్రాణుల గణన కోసం ఇప్పటికే జిల్లాలోని అటవీ సిబ్బందికి శిక్షణ ఇచ్చాము. గతంలో చాలామందికి లెక్కించిన అనుభవం కూడా ఉంది. ఎక్కడా పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్యప్రాణుల గణనలో పులులతో పాటు ఇతర జంతువులను కూడా లెక్కిస్తాం.

Updated Date - Jan 10 , 2026 | 11:37 PM