‘కో-ఆప్షన’్లపై కన్ను
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:30 PM
రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం పంచాయతీలకు డిసెంబరు 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిం చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్తపాలకవర్గాలు కొలువుదీరాయి.
- ప్రతీ గ్రామపంచాయతీలో ముగ్గురు సభ్యులకు అవకాశం
- జిల్లాలో 335 పంచాయతీలు
- 1005 మందికి అవకాశం
వాంకిడి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం పంచాయతీలకు డిసెంబరు 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిం చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్తపాలకవర్గాలు కొలువుదీరాయి. సర్పంచులు, ఉపసర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించే పనిలో పడ్డారు. సర్పంచుగా, వార్డు సభ్యులుగా పోటీ చేయని రాజకీయ నేతల కన్ను కో-ఆప్షన్ పదవిపై పడింది. కో-ఆప్షన్ గతంలో మండల పరిషత్‌లో, జిల్లా పరిషత్‌లో, మునిసిపల్ కౌన్సిల్‌లోనే ఉండేవి. మండల, జిల్లా పరిషత్‌లలో మైనార్టీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. మున్సిపల్, కార్పొరేషన్లపై మైనారిటీలతో పాటు ఇతరవర్గాల సభభ్యులకు కూడా అవకాశం ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యె ఎవరిని నియమిస్తే వారికే పదవి వరించేది. పంచాయతీరాజ్-2018 నూతన చట్టం ప్రకారం పంచాయతీలలో ముగ్గురు కో-ఆప్షన్ సభ్యుల ను నియమించాలని పేర్కొంది. దీని ప్రకారం ప్రతీ పంచాయతీలో ఈ పదవులపై అసక్తి ఏర్పడింది. ఎవరికి వారు సర్పంచులతో, మండల నాయకులు, ఎమ్మెల్యేలతో పైరవీలకు సిద్ధం అవుతున్నారు.
- పంచాయతీకి ముగ్గురు చొప్పున
జిల్లాలోని 335 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీకి ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులను నియమించానున్నారు. దీంతో జిల్లాలోని 335 పంచాయతీల్లో 1005 మంది కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు.
- కేవలం సలహాదారులుగానే....
కో- ఆప్షన్ సభ్యులకు గ్రామసభల్లో, పంచాయతీ సమావేశాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్డు సభ్యులతో సమానంగా హోదా, ప్రొటోకాల్ కూడా ఉంటుంది. వీరు సమావేశాల్లో పాల్గొని చర్చలు, సూచనలు చేయవచ్చు. కానీ ఏదైనా తీర్మానంపై ఓటు వేసే హక్కు వీరికి ఉండదు. కేవలం సలహాదారులుగానే ఉండాల్సి ఉంటుంది.
- ఎంపికకు అర్హతలు...
గ్రామంలోని మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలిని తప్పకుండా ఎంపిక చేయాలి. గ్రామ అవసరాల రీత్యా స్థలం ఇచ్చిన దాతను కో-ఆప్షన్ సభ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగం చేసి విరమణ పొందిన ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ నేతలు ఎవరిని అనుకుంటే వారికి పదవి వరించే అవకాశాలు ఉన్నాయి.
- ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడకపోయినా...
గ్రామ పంచాయతీల్లో కో- ఆప్షన్ సభ్యుల స్థానాల భర్తీకి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. అయినా గతంలోలాగా కో-ఆప్షన్ సభ్యులను తీసుకుంటారన్న నమ్మకంతో ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ఏపార్టీ వారికి మెజార్టీ ఉంటే వారు ఎన్నుకున్న వారే కో- ఆప్షన్ సభ్యులవుతారు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాక చూద్దాంలే అని ఊరుకుంటే అప్పటికే మాట ఇచ్చామంటారేమోనని ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.