Share News

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:03 AM

స్కానింగ్‌ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచవో అనిత హెచ్చరించారు.

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
పోస్టర్లను విడుదల చేస్తున్న డీఎంహెచవో అనిత, వైద్యులు

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): స్కానింగ్‌ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచవో అనిత హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గర్భధారణ పూర్వ, గర్భస్త పిండ ప్రక్రియ నియంత్రణ, లింగ ఎంపిక నిషేధం చట్టం ప్రకారం జిల్లాలో అందిస్తున్న సేవలపై జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచవో మాట్లాడుతూ లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్య నేరమని పేర్కొన్నారు. ‘ఆడపిల్లలను పుట్టనిద్దాం బతకనిద్దాం చదివిద్దాం’ అనే నినాదంతో అందరు ముందుకు సాగాలన్నారు. స్కానింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని, లింగనిర్ధారణపై అవగాహన కల్పించే పోస్టర్లను ఉంచవద్దని తెలిపారు. కొత్త స్కానింగ్‌ మిషన కొనడానికి ముందుగానే నో ఆబ్జెక్షన సర్టిఫికెట్‌ తీసుకోవాలని, తీసుకున్న తర్వాతనే మిషన తెచ్చుకోవాలన్నారు. అలాగే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరాల్లో లింగనిర్ధారణపై అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. అనంతరం లింగనిర్ధారణ అవగాహణ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ అరుణశ్రీ, డాక్టర్లు ప్రసాద్‌, సుధాకర్‌, కమిటీ సభ్యులు డాక్టర్‌ రాజ్‌కిరణ్‌, డాక్టర్‌ రాంప్రసాద్‌, ప్రశాంతి, సీనియర్‌ అసిస్టెంట్‌ హారికలింగారెడ్డి, లక్ష్మణస్వామి, జిల్లా మాస్‌మీడియా అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పఆల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:03 AM