పేరుకుపోయిన సింగరేణి బకాయిలు
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:02 PM
సింగరేణికి ప్రభుత్వాలు బకాయి పడ్డ వేల కోట్ల రూపాయలు చెల్లించడంలో తీవ్రజాప్యం జరుగుతోంది.
-ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో రూ. 56 వేల కోట్లు
-జెన్‌కో బిల్లులు చెల్లించడంలో తీవ్ర జాప్యం
-గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కుదేలైన సంస్థ
-కాంగ్రెస్ ప్రభుత్వానిదీ అదే దారి
-యంత్రాల కొనుగోళ్లకూ డబ్బులు కొరత
మంచిర్యాల, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): సింగరేణికి ప్రభుత్వాలు బకాయి పడ్డ వేల కోట్ల రూపాయలు చెల్లించడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. వివిధ ప్రాంతాల్లోని విద్యుత ప్లాంట్లకు, ఇతర సంస్థలకు బొగ్గు, విద్యుత్ సరఫరా చేసిన బిల్లులు రూ. 56 వేల కోట్ల వరకు పెండింగులో ఉన్నాయి. తద్వారా సంస్థ ఆర్థిక కష్టాల్లో మగ్గాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణిపై ఆధారిత పరిశ్రమలు దక్షిణ భారతదేశంలో నాలుగువేల వరకు ఉంటాయి. ఆయా పరిశ్రమలకు కూడా సింగరేణి బొగ్గు, విద్యుత్‌ను వినియోగించగా, ఆ సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన డబ్బులు మొత్తం చెల్లించలేదని తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కూడా విద్యుత సంస్థలకు బొగ్గు సరఫరా చేసిన డబ్బు సింగరేణికి రావాల్సి ఉండగా, ప్రస్తుత ప్రభుత్వ బకాయిలు సైతం పెద్ద మొత్తంలోనే రావలసి ఉంది.
- బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాం నుంచే....
సింగరేణి సంస్థకు చెందిన వేల కోట్ల రూపాయల సొమ్ము అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఖజానాకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ప్రతీ సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించే పన్నులే కాకుండా అదనంగా సంస్థ సొమ్మును ప్రభుత్వం వాడుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కరోనా సమయంలో రూ.40 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయగా, డీఎంఎఫ్‌టీ (డిసి్ట్రక్ట్ మినరల్ ఫండ్) నిధులు రూ. 2,740 కోట్లు, హరితహారం కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్సార్) నిధులు సుమారు రూ. 263 కోట్లను సంస్థ ప్రభుత్వానికి దారాదత్తం చేసినట్లు సమాచారం. ఇవిగాక సింగరేణి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ప్రభుత్వరంగ సంస్థలైన జెన్‌కో, ట్రాన్స్‌కోలకు విక్రయిస్తోంది. వాటి బిల్లులు వేల కోట్లలో పేరుకుపోయాయి. అలా బీఆర్‌ఎస్ హయాంలోనే సింగరేణికి ప్రభుత్వం రూ. 27వేల కోట్ల మేర బకాయిలు పడింది.
- రూ. 56వేల కోట్లకు చేరుకున్న బకాయిలు...
ప్రభుత్వ నుంచి సుమారు రూ. 56వేల కోట్లు సింగరేణికి రావాల్సి ఉంది. బీఆర్‌ఎస్ హయాంలో బకాయిపడ్డ రూ. 27వేల కోట్లతోపాటు కాంగ్రెస్ హయాంలోనూ మరో రూ. 29వేల కోట్ల మేర బకాయిలు పడ్డట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో సింగరేణి బకాయిలు చెల్లించడం ద్వారా సంస్థ అభివృద్ధికి సహకరిస్తామన్న కాంగ్రెస్... అధికారంలోకి వచ్చాక తనవంతు బకాయిలు కూడా జమ చేయకపోవడం గమనార్హం. ప్రభుత్వాల వద్ద వేల కోట్లు పెండింగులో ఉండటంతో సంస్థ బొగ్గు తవ్వకాల కోసం ఉపయోగించే భారీ వాహనాలైన షావల్, డోజర్, తదితర వాహనాలను కొనుగోలు చేయలేక ఓసీల్లో ఉత్పత్తిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. కాంట్రాక్టీకరణ వల్ల కూడా సంస్థపై ఆర్థికభారం పడుతున్నట్లు కార్మికులు చెబుతున్నారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన తన హయాంలో బకాయిపడ్డ సొమ్ము చెల్లిస్తే సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందించినట్లవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
బకాయిలు చెల్లించాలి...
వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడ్డ సుమారు రూ. 56వేల కోట్లను వెంటనే చెల్లించాలి. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచడం వల్ల సంస్థ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. కొత్త గనులు రాకపోవడానికి ముఖ్య కారణం తగిన నిధులు లేకపోవడమే. ఓసీల్లో బొగ్గు తవ్వకాలు జరిపేందుకు వినియోగించే భారీ వాహనాలు కొనుగోలు చేసేందుకు యాజమాన్యం పునరాలోచించాల్సిన పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్లకు ఇవ్వడం మూలంగానూ సంస్థ నష్టాల్లో నడుస్తోంది. ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్వయంగా ఆర్థిక, గనుల శాఖ మంత్రిగా ఉన్నందున సంస్థకు మనుగడ కోసం దానికి రావలసిన బకాయిలు వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది.