Share News

వేగం పుంజుకున్న అభివృద్ధి

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:37 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి.

వేగం పుంజుకున్న అభివృద్ధి
మంచిర్యాల రైల్వే స్టేషన్‌ రోడ్డులో కొనసాగుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు

- రూ. 78 కోట్లతో జిల్లా కేంద్రంలో పనులు

- కొనసాగుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం

- అనంతరం విద్యుత్‌ పనులు కూడా

- రోడ్ల మూసివేతతో తాత్కాలికంగా ఇబ్బందులు

మంచిర్యాల, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఫుట్‌పాత్‌, విద్యుదీకరణ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. వర్షాకాలం ప్రారంభమైతే అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో పనుల్లో వేగం పెంచారు. ముందుగా వివిధ వీధుల్లో రోడ్డు ఆక్రమణలు తొలిగించిన అధికారులు, అనంతరం పనులు ప్రారంభించారు.

రూ. 78 కోట్లతో పనులు...

స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరయ్యాయి. దీంతో జిల్లా కేంద్రంలోని పలు వీధుల్లో రూ. 78 కోట్లతో పనులు చేపట్టారు. శ్రీనివాస టాకీస్‌ రోడ్డు, రైల్వే స్టేషన్‌ రోడ్డు, మార్కెట్‌ ఏరియాతోపాటు పలు ప్రధాన వీధుల్లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. అండర్‌ గ్రౌండ్‌ సీమెంట్‌ కాంక్రీట్‌ డ్రైనేజీ నిర్మాణం, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ వ్యవస్థ, ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపడుతున్నారు. అంతకుముందు ఆయా ఏరియాల్లో పనులకు అడ్డంకిగా మారిన రోడ్డు ఆక్రమణలను అధికారులు తొలగించారు. రెండు మూడు నెలలుగా పనులు చేపడుతుండగా, వర్షాకాలం ప్రారంభమయ్యేలోపే పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ముందుగా రోడ్లకు ఇరువైపులా అండర్‌ గ్రౌండ్‌ నిర్మాణ పనులు చేపట్టగా, దాన్ని ఆనుకొని వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చే పాదాచారుల కోసం ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం కూడా చేపడుతున్నారు. వాటితోపాటు వివిధ అంతర్గత రోడ్లలో అండర్‌ గ్రౌండ్‌ విద్యుదీకరణ కోసం రోడ్ల మధ్యలో తవ్వకాలు చేపట్టి పైప్‌లైన్‌ వేశారు. విద్యుత్‌ వైర్లు కనిపించకుండా సీ్ట్రట్‌ లైట్లు అమర్చనున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే రోడ్లన్నీ విశాలంగా దర్శనమివ్వడంతోపాటు నగరం సర్వాంగ సుందరంగా మారనుంది.

ఎదురవుతున్న ఇబ్బందులు..

అభివృద్ధి పనుల కారణంగా ప్రజలు తాత్కాలిక ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రహదారులకు ఇరువైపులా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపడుతుండటంతో పలు రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. ముఖ్యంగా శ్రీనివాస టాకీస్‌ రోడ్డు, రైల్వే స్టేషన్‌ రోడ్డు, కూరగాయల మార్కెట్‌ రోడ్లపై రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. జిల్లా కేంద్రంలో ఆయా రహదారులు ప్రధానమైనవికాగా వాటి మూసివేతతో ముఖ్యంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కూరగాయల మార్కెట్‌ రోడ్డును గర్ల్స్‌ హైస్కూల్‌ సమీపం నుంచి అర్చనటెక్స్‌ చౌరస్తా వరకు మూసివేశారు. ఇరువైపులా బారీకేడ్‌లు ఏర్పాటు చేయడంతో కేవలం కాలినడకన మాత్రమే ఆ రోడ్డు గుండా వెళ్లాల్సి వస్తోంది. ఆ మార్గంలో కూరగాయల మార్కెట్‌, చికెన్‌, మటన్‌ సెంటర్లు, హోల్‌సేల్‌ రైస్‌ దుకాణాలు, పండ్ల దుకాణాలు అఽధికంగా ఉండటంతో నిత్యం వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఆరోడ్డును పూర్తిగా మూసివేయడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఓవర్‌ బ్రిడ్జి నుంచి శ్రీనివాస టాకీస్‌ వైపు వెళ్లే రహదారిని సైతం మూసివేశారు. ఆ రోడ్డును ఆనుకొని ఐబీ చౌరస్తాకు వెళ్లే లింకు రోడ్డు, అండర్‌ బ్రిడ్జి వైపు వెళ్లే దారిని కూడా మూసివేశారు. దీంతో ఆయా ఏరియాలకు వెళ్లే వాహన చోధకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక మార్కెట్‌ ఏరియాకు వెళ్లే అంతర్గత రోడ్లను సైతం ఎక్కడికక్కడే మూసివేశారు. కాగా అభివృద్ధి పనుల కారణంగా మునిసిపల్‌ కార్పొరేషన్‌ సరఫరా చేసే తాగునీటి పైపులైన్లు ఎక్కడికక్కడే పగిలిపోయాయి. దీంతో తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కాగా పనులన్నీ త్వరలోనే పూర్తికానుండగా, ప్రజల ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి.

Updated Date - Jun 07 , 2026 | 11:37 PM