సమగ్ర సర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Jun 24 , 2026 | 10:58 PM
భూముల సమగ్ర సర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పట్టాదారులు దగ్గరుండి కొలతలు చేయించుకొని హద్దులు పెట్టించుకోవాలని సూచించారు.
- కలెక్టర్ కుమార్ దీపక్
నెన్నెల, జూన 24 (ఆంధ్రజ్యోతి): భూముల సమగ్ర సర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పట్టాదారులు దగ్గరుండి కొలతలు చేయించుకొని హద్దులు పెట్టించుకోవాలని సూచించారు. మండలం లోని పుప్పాల్‌వానిపేటలో బుధవారం సర్వేపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సర్వే కోసం పట్టాదారులకు నోటీసులు అందజేస్తామని, తమ వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలతో నిర్దేశించిన రోజులో మోఖాపై అందుబాటులో ఉండాలని సూచించారు. సర్వేనంబర్ల ప్రకారం హద్దులు గుర్తిస్తామన్నారు. బోగస్‌లను గుర్తించి రద్దు చేస్తామన్నారు. పట్టాదారులు ఇప్పుడే అన్ని సరిచూసుకోవాలని, తప్పులు జరిగితే సవరించేందుకు సమయం పడుతుందన్నారు. అందుకుగాను హైదరాబాదు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. పుప్పాల్‌వానిపేటలో మొత్తం 110 సర్వే నంబర్లకు గాను 176 మంది పట్టాదారులున్నారని చెప్పారు. రెండు బృందాలను నియమించామని, ఒక్కో టీమ్‌లో ఇద్దరు సర్వేయర్లు ఉంటారని పేర్కొన్నారు. రైతులు సహకరిస్తే 20రోజుల్లో సర్వే పూర్తవుతుందన్నారు. వారసత్వ పంపకాలు, మ్యూటేషన, సాదాబైనామా తదితర సమస్యలు ఉంటే తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్ట్ గ్రామంగా వాటిని మొదటి ప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తామన్నారు. అంతకంటే ముందు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సులద్వారా వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. కోనంపేట ప్రాథమిక పాఠశాల, అంగనవాడీ కేంద్రం, నెన్నెల జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించి విధ్యార్థులతో మాట్లాడారు. కస్తూర్బాలో అదనపు గదుల నిర్మాణం పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, ఎంపీడీవో మహ్మద్ అబ్దుల్ హై, తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.