అ ‘సమగ్ర’ కొలువులు
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:35 PM
ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం టైం స్కేల్ ఇస్తామని ప్రకటించి మోసం చేసిందన్నారు.
- క్రమబద్ధీకరణకు నోచుకోని సమగ్ర శిక్ష ఉద్యోగులు
- సమ్మె చేసినా పరిష్కారం కాని సమస్యలు
- చాలీచాలని వేతనాలతో కుటుంబాల పోషణకు అవస్థలు
- ప్రభుత్యం హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్
- జిల్లాలో 440 మంది ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం టైం స్కేల్ ఇస్తామని ప్రకటించి మోసం చేసిందన్నారు. అలాగే అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కూడా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం 2024 డిసెంబరు 6 నుంచి జనవరి 7 వరకు సమ్మె చేసినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫాం, మధ్యాహ్న భోజనం బియ్యం సరఫరా, ఉపాధ్యాయుల హాజరు నమోదు, ఆన్‌లైన్‌లో విద్యార్థుల నమోదు, బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం వంటి పనులను నిర్వహిస్తున్నారు. గురుకులాల్లో సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు బోధన విధులు నిర్వహిస్తుండగా బోధనేతర సిబ్బంది తమకు కేటాయించిన విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకాధికారులు కేజీబీవీల నిర్వాహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. అకౌంటెంట్లు, ఏఎన్‌ఎంలు, కంప్యూటర్ ఇన్స్‌స్ట్రక్టర్లు, మండల స్థాయిలో సీఆర్పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్‌పీలు, వ్యాయమ ఒకేషనల్ ఉపాధ్యాయులు, కంప్యూటర్ ఇన్స్‌స్ట్రక్టర్లు, డే, నైట్ వాచ్‌మెన్‌లు, స్వీపర్లు, స్కావేంజర్లు, జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టం ఎనలిస్టులు, టెక్నికల్ పర్సన్‌లు, డీఎల్‌ఎంటీ మెస్సేంజర్లు, మోడల్ స్కూళ్లలో పని చేసే వార్డెన్‌లు, ఆపరేటర్లు, కేర్ టేకర్లు కూడా సమగ్ర శిక్ష పరిధిలోకే వస్తారు.
జిల్లాలో 440 మంది..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా 440 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. కేజీబీవీల్లో 347 మంది, సీఆర్పీలు 54, సీసీవోలు 10 మంది, ఎంఐఎస్‌సీవోలు 11, ఐఈఆర్పీలు 18 మంది పని చేస్తున్నారు. కలెక్టర్ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించే యూడేస్, మధ్యాహ్న భోజన పథకం నివేదికల తయారీలో సమగ్రశిక్ష ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. బియ్యం పంపిణీ, పాఠశాల బయట ఉన్న విద్యార్థులను గుర్తించడం వంటి పనులు ఈ ఉద్యోగులే నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రాప్ట్, ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యూకేషన్ బోధించే ప్రత్యేక ఉపాధ్యాయులు కూడా ఎస్‌ఎస్ పరిధిలోకి వస్తారు.
కార్యరూపం దాల్చని సమ్మె హామీలు.
సమ్మె విరమణ సమయంలో పే స్కేల్ అమలుపై మూడు నెలల్లో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వీలుగా ఉత్తర్వులు జారీచేస్తామని, సమ్మె కాలపు వేతనం అందజేస్తామన్నారు. కానీ ఇచ్చిన హామీల్లో ఇంత వరకు ఒక్కటి కూడా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ హక్కుల సాధన కోసం గత 15 సంవత్సరాలుగా వివిధ సందర్భాల్లో పోరాటాలు చేస్తూనే వచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా తమ సమస్యలను పట్టించుకోలేదు. డిమాండ్ల సాధనకు 2024 డిసెంబరు 6వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు సమ్మె కొనసాగించారు
చాలీచాలని వేతనాలతో...
సమగ్ర శిక్ష ఉద్యోగులు, సిబ్బంది చాలీచాలని వేతనాలతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా వేతనాలు పెరగక వచ్చే వేతనంతో కుటుంబం పోషించుకోలేక ఇక్కట్లు పడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా వచ్చే వేతనాలతో కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతూ మానసికంగా కుంగి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టు టైం ఉద్యోగులను ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి వేతనం పెంచాలని రెగ్యులర్ ఉద్యోగులు మారిదిగానే సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు రూ.20 లక్షల రిటర్‌మెంట్ బెనిఫిట్ చెల్లించాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం చెల్లించి ప్రతి ఉద్యోగికి రూ.10 జీవిత బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి...
- గెడేకార్ సంతోష్, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధికార ప్రతినిధి
సమ్మె సమయంలో రాఫ్ట్రప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. సమగ్ర శిక్షను పూర్తిస్థాయిలో విద్యాశాఖలో విలీనం చేసి ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి. పేస్కేల్ అమలు కోసం మంత్రివర్గ ఉప సంఘం సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం వెంటనే ప్రకటించాలి. సమ్మె కాలపు వేతనాలు వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.