Share News

సింగరేణిలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి

ABN , Publish Date - Jun 19 , 2026 | 11:28 PM

సింగరేణిలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, హౌస్‌ కమిటీ వేయాలని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఎస్‌ఆర్‌పీ ఓసీపీ, ఎస్‌ఆర్‌పీ-3 గనులను పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందాన్ని పోలీసులు అడ్డుకుని గనుల్లోకి వెళ్లనీయలేదు.

సింగరేణిలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
శ్రీరాంపూర్‌లో మాట్లాడుతున్న బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

- బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

- సింగరేణి భరోసా యాత్రలో ఉద్రిక్తం

- గనుల్లోకి వెళ్లకుండా నాయకులను అడ్డుకున్న పోలీసులు

శ్రీరాంపూర్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, హౌస్‌ కమిటీ వేయాలని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఎస్‌ఆర్‌పీ ఓసీపీ, ఎస్‌ఆర్‌పీ-3 గనులను పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందాన్ని పోలీసులు అడ్డుకుని గనుల్లోకి వెళ్లనీయలేదు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట చేసుకుంది. ఈసందర్భంగా ఉద్రిక్తతత చోటుచేసుకుంది. బీజేపీ నాయకులను అరెస్ట్‌ చేసి అనంతరం విడిచిపెట్టారు. అనంతరం శ్రీరాంపూర్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో అనేక అక్రమాలు జరిగి వేలకోట్ల రూపాయలు దోచుకుంటే తాము అధికారంలోకి వస్తే విచారణ చేయించి శిక్ష పడేలా చూస్తామని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి చిలుకపలుకులు పలికారని, అధికారంలోకి రాగానే విచారణ వదిలేసి దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దోపిడీ చేసేందుకు సింగరేణి రూపంలో లంకెబిందెలు దొరికాయన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంధన శాఖ మంత్రిగా సింగరేణిని తన జేబు సంస్థగా మార్చుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ఆదేశించడంలేదని, హౌస్‌ కమిటీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సింగరేణిని దర్జాగా దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా నిబంధలు పెట్టి సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ పేరుతో తాము అనుకున్న వారికి ఓబీ కాంట్రాక్టులు కట్టబెడుతున్నారన్నారు. వీకే ఓసీపీలో పొందిన కాంట్రాక్టరు సీఎం రేవంత్‌రెడ్డికి ఏమైతడో చెప్పాలన్నారు. నైనీ బ్లాకు కాంట్రాక్టు నా మనిషికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, నా మనిషికి రావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రయత్నాలు చేయడంతో టెండర్‌ క్యాన్సెల్‌ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు రూ. 51,500 కోట్లు బకాయి పడిందన్నారు. ఓసీపీలకు అవసరమైన డీజిల్‌ను మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల సింగరేణిపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ కుంభకోణాలు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై వెంటనే హౌస్‌ కమిటీ వేయాలని, సీబీఐ విచారణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేష్‌ రెడ్డి, సిర్‌పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరిష్‌బాబు, ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 11:28 PM