Share News

గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:18 AM

రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ఇందులో భాగంగా గిరిజనులకు ఇళ్లు కట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

- గూడెల్లో గుడిసెలు లేకుండా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు

- సీఎం రేవంత్‌ రెడ్డి

- కుమరం భీం జిల్లా కొఠారి కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌ రూరల్‌/కెరమెరి/రెబ్బెన, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ఇందులో భాగంగా గిరిజనులకు ఇళ్లు కట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలోని కొత్తగూడ కొఠారిలో సోమవారం రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో, కాగజ్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అత్యంత వెనుకబడిన మారుమూల ప్రాంతమనితాను కాంగ్రెస్‌ అధ్యక్షుడి హోదాలో ఉన్న సమయంలోనే ఆదిలాబాద్‌ అభివృద్ధిపై చర్చ చేశామన్నారు. ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపితేనే రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడుతాయనే దృఢ నమ్మకంతో గిరిజనులకు ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిదఫాలో నాలుగు లక్షల ఇళ్లు మంజూరు చేయగా, కొంత మంది గిరిజన పెద్దలు నాగోబా జాతర సందర్భంగా తన వద్దకు వచ్చి గిరిజన గూడెల్లోని గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు సరిపోవటం లేదని పేర్కొన్నట్టు తెలిపారు. వెంటనే 21వేల ఇళ్లను ప్రత్యేకంగా గిరిజనుల కోసమే మంజూరు చేసినట్టు ప్రకటించారు. గిరిజన గూడెల్లో ఇళ్లు లేని గిరిజనులు ఉండరాదన్న ఉద్దేశంతో అందరికి ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందు కోసం ఐటీడీఏ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షించాలని మంత్రికి సూచించారు. గిరిజన గూడెల్లో గుడిసెలనేవి లేకుండా, అందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్టు హర్షద్వానాల మధ్య సీఎం ప్రకటించారు. గిరిజన గూడెం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది కల్లా అంతా ఇళ్లు కట్టుకోవాలని, మళ్లీ గృహ ప్రవేశానికి వస్తానని తెలిపారు. ప్రస్తుతం గిరిజనులు సంబరం చూస్తుంటే దసరా పండుగకు వచ్చినట్టు ఉందని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో విద్య ఎంతో అవసరమని, ఆదివాసీ గిరిజనులు తమ పిల్లలను తప్పకుండా చదివించుకోవాలని, ఉన్నతస్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని తెలిపారు. మహిళలు తమ సంపాదనను పొదుపు చేసుకోవాలని భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతకు ముందు కొలాం కోఠారి గ్రామపంచాయతీలోని కొత్తగూడ గ్రామంలోని సిడాం కన్నీబాయి, టేకం పగ్గుబాయి, ఆత్రం పోచుబాయిలకు చెందిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి కుటుంబసభ్యులతో కలిసి గృహ ప్రవేశం చేశారు. అనంతరం గ్రామంలోని షియర్‌ వాల్‌ సాకేంతికతతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

- ఎంత కష్టం వచ్చినా ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఆపటం లేదు

కుమురం భీం సాక్షిగా గిరిజన గూడెలను అభివృద్ధి చేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో పాలమూరు జిల్లాకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఉమ్మడి ఆదిలాబాద్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించారు. జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రకటించారు. తండాల్లో గూడెల్లో ఉండే అందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని అందుకుగానూ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రికి జూపల్లి కష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్వహణలో ఆర్థిక సమస్యలున్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఆదివాసీ బిడ్డల గౌరవం పెంచేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో పనులు మొదలు పెట్టి, ఆపేసిన వారికి కూడా ఈ సారి ఇందిరమ్మలో చోటు కల్పిస్తామన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ ముందుకు రావటం లేదని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర సీఎం తమతో చర్చలు జరపాలని విజ్ఙప్తి చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తే లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఎత్తిపోతలు లేకుండా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు నీరందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈవిషయంలో త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఈ ప్రాంత వాసులంతా కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పండించిన పంటలను కొనుగోలు చేయాల్సేందనని ప్రకటించారు. ఇప్పటికే 75లక్షల క్వింటాళ్ల వడ్లను కేంద్రం కొనసాల్సిందేని చెప్పారు. మొక్కలు, జొన్నలు కొనాలని పేర్కొన్నారు. లేదంటే జూన్‌ 15 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రూ.112.14 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్‌ వెంకటస్వామి, సీతక్క, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎంపీ గడ్డ ం వంశీ, రాజ్యసభ సభ్యుడు ఎం.నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేంసాగర్‌రావు, కోవలక్ష్మి, హరీష్‌బాబు, వెడ్మ బొజ్జు, కలెక్టర్‌ హరిత పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 12:18 AM