Share News

60 ఎకరాల్లో అరాచకం!

ABN , Publish Date - Sep 05 , 2026 | 05:45 AM

హైదరాబాద్‌కు తాగునీటికి, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన గండిపేట చెరువు గుండెల్లో రియల్టర్లు కాలుష్యం బాంబు పేలుస్తున్నారు. 111 జీవోను అడ్డగోలుగా ఉల్లంఘిస్తూ ఏకంగా 60 ఎకరాల్లో భారీ విల్లా ఫామ్‌హౌస్‌ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు

60 ఎకరాల్లో అరాచకం!
Janwadaland

  • కొండలు తవ్వి, కాల్వలు పూడ్చి గండిపేట గుండెపై అక్రమ లేఅవుట్‌

  • కుతుబ్‌షాహీల నాటి బుల్కాపూర్‌ నాలా పూడ్చివేత

  • నేతలు, అధికారుల అండతో 111 జీవోకు తూట్లు

  • శరవేగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సౌకర్యం

  • వ్యవసాయ భూములుగా గుంటల్లో రిజిస్ట్రేషన్‌

  • కరెంటు కనెక్షన్‌ ఎలా ఇచ్చారనేది బ్రహ్మరహస్యం

  • కోకాపేట పక్కనే అంటూ గజం 60 వేలకు అమ్మకం

  • దందా వెనుక ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ

  • గుట్టు చప్పుడు కాకుండా బడాబాబులకు విక్రయం

  • తమ వంతుగా సహకరిస్తున్న అధికార వ్యవస్థ

  • 2022లో 111 ఎత్తేస్తున్నట్లు ప్రకటించిన సర్కార్‌

  • ఆ వెంటనే రైతుల నుంచి చేతులు మారిన భూమి

    హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు తాగునీటికి, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన గండిపేట చెరువు గుండెల్లో రియల్టర్లు కాలుష్యం బాంబు పేలుస్తున్నారు. 111 జీవోను అడ్డగోలుగా ఉల్లంఘిస్తూ ఏకంగా 60 ఎకరాల్లో భారీ విల్లా ఫామ్‌హౌస్‌ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. అదీ గండిపేటలోకి వచ్చే మూసీ నది పక్కనే. సంపన్నుల కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్టులో ఒక్కోటి 1936 గజాల(16 గుంటలు) ప్లాటు, 40 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, చుట్టూ ప్రహరీ, క్లబ్‌ హౌస్‌ శరవేగంగా తయారవుతున్నాయి. ఎకరా 150 కోట్లు పలికే కోకాపేటను ఆనుకుని ఉన్న జన్వాడ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఉంది. డబ్బు, పలుకుబడి, ప్రజాప్రతినిధులతో మిలాఖత్‌ అయితే 111 జీవో పరిధిలో అక్రమంగా వెంచర్‌ వేయడమే కాదు ఏకంగా గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీ నిర్మించవచ్చు అని నిరూపించారు. నాలా కన్వర్షన్‌ కూడా చేయకుండా లేఅవుట్‌ వేసి, ప్లాట్లను వ్యవసాయ భూములుగా గుంటల్లో అమ్మేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ గ్రామం గండిపేట జలాశయానికి అత్యంత సమీపంలో ఉంది. ఇక్కడ కురిసే వర్షపు నీరంతా జలాశయంలో కలుస్తుంది. జంట జలాశయాల పరిరక్షణకు తీసుకొచ్చిన 111 జీవో ఈ గ్రామ భూములకూ వర్తిస్తుంది. ఇక్కడ ఎలాంటి లేఅవుట్లకు అనుమతి లేదు. .


బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం అసలే అధికారులు పట్టించుకోకపోతే భారీ ఎత్తున విల్లాలు, ఫామ్‌హౌస్‌లు నిర్మిస్తారు. వాటి నుంచి వెలువడే మురుగునీరు, వ్యర్థాలు నేరుగా గండిపేట చెరువులోకి వెళ్తాయి. ఇది మరో హుస్సేన్‌సాగర్‌లా కాలుష్య కాసారం అవుతుంది. ఇప్పటికే సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మురికినీరు జంట జలాశయాల్లో చేరుతోంది. బుల్కాపూర్‌ నాలాతో పాటు సహజ సిద్ధమైన నీటి ప్రవాహ మార్గాలు, వాగులు, వంకలను పూడ్చి ప్లాట్లు చేస్తుండడంతో వర్షాకాలంలో భారీ వరదలు ముంచెత్తే విపత్తు పొంచి ఉంది

కోకాపేట రియల్‌ ఎస్టేట్‌ జ్వరం జన్వాడకు అంటుకోవడంతో ఇక్కడ భారీ ఎత్తున అక్రమ వెంచర్‌లకు తెరలేపారు. నేతల అండతో అరాచకంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్‌లు వేస్తున్నారు. తాజాగా ఏకంగా 60 ఎకరాలతో లేఅవుట్‌ వేసి రాష్ట్ర చట్టాలను, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సవాల్‌ విసురుతున్నారు. కోకాపేట, మోకిలా పేర్లు చెబుతూ జన్వాడలో ప్లాట్లను గుంటల్లో విక్రయిస్తున్నారు. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌ సాగర్‌ల రక్షణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో 111 జీఓను తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ జలాశయాల్లోకి మురుగునీరు, రసాయన వ్యర్థాలు చేరకుండా చూడటం దీని లక్ష్యం. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో కూడా బయో కన్జర్వేషన్‌ జోన్‌గా 111 జీఓ పరిధిలోని 84 గ్రామాలను చేర్చారు. దీని ప్రకారంగా 111 జీఓ పరిధిలో ఎలాంటి భవన నిర్మాణాలు, లేఅవుట్‌లు అనుమతించరాదు. 2022లో 111 జీఓను రద్దు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, డెవలపర్లు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. 2022 ఏప్రిల్‌ నుంచి మొదలుకొని 84 గ్రామాల పరిధిలో పెద్దఎత్తున భూముల క్రయ, విక్రయాలు జరిగాయి. 111 జీఓను నామమాత్రంగా 69 జీఓతో రద్దు చేసినప్పటికీ బయో కన్జర్వేషన్‌ ఆంక్షలు ఇప్పటికీ ఉన్నాయి.


60 ఎకరాల్లో అరాచకపు వెంచర్‌

జన్వాడ గ్రామ సమీపంలో ప్రస్తుతం వేస్తున్న 60 ఎకరాల లేఅవుట్‌ కోసం అక్కడి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. 450 ఏళ్ల క్రితం మూసీ నుంచి(అప్పటికి గండిపేట నిర్మించలేదు) హుస్సేన్‌సాగర్‌కు నీళ్లు తరలించడానికి కుతుబ్‌షాహీలు తవ్విన బుల్కాపూర్‌ నాలాను పూడ్చేశారు. నిజానికి నగరంలోని బుల్కాపూర్‌ నాలా ఎప్పుడో పూడిపోయింది. ఇక్కడ మూసీ దగ్గర మిగిలిన ఈ కొద్ది ఆనవాలును రియల్టర్‌ రాబందులు బతకనివ్వడం లేదు. లేవుట్‌ అభివృద్ధి పేరుతో ఓ వైపు మొత్తం మట్టి పోస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరంగా పనిచేస్తూ గండిపేట ఎగువన పచ్చదనానికి నిలువునా తూట్లు పొడుతున్నారు. భారీ యంత్రాలతో కొండలు, గుట్టలను చదును చేస్తున్నారు. ఒక్కోటి 1936 గజాల ప్లాటతో, 30 అడుగులు, 40 అడుగుల సీసీ రోడ్లతో, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీతో శరవేగంగా పూర్తి స్థాయి రెసిడెన్షియల్‌ టౌన్‌షి్‌ప తయారవుతోంది. రెరా అనుమతులతో ఏర్పాటు చేసే లేఅవుట్లు ఎలా తీర్చిదిద్దుతారో అలాగే తీర్చిదిద్దుతున్నారు. పంట పొలాలు, చెట్లతో కళకళలాడాల్సిన వ్యవసాయ భూములను కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చేస్తున్నారు. వెంచర్‌లోకి ఇతరులెవ్వరూ అడుగకుపెట్టకుండా భారీ ప్రహరీ, సోలార్‌ విద్యుత్‌ను ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్‌లో గతంలోనే ఓ ఆశ్రమం ఉండేది. ఈ అశ్రమాన్ని తొలగించకుండా అందులోనే ఐదు ఎకరాల్లో కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. లేఅవుట్‌కు అనుమతులుంటేనే విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తారు. రికార్డుల ప్రకారం ఇది లేఅవుట్‌ కాదు. గుంటల లెక్కన భూమి అమ్ముతున్నారు. అంటే, వ్యవసాయ భూమి. విద్యుత్‌ శాఖ అధికారులు ఈ అక్రమ వెంచర్‌లో విద్యుత్‌ స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మార్లను సైతం అమర్చడం విశేషం.


గజాల్లో అమ్మకం..

గుంటల్లో రిజిస్ట్రేషన్‌

లేఅవుట్‌ ఏర్పాటులో పెద్ద తలకాయలే ఉన్నాయి. భూమి యజమాని ప్రముఖ బిస్కెట్‌ కంపెనీ ఓనర్‌. ప్రముఖ రియల్‌ ఏస్టేట్‌ సంస్థతోఒప్పందం. పరిచయాలను పెట్టుబడిగా పెట్టి పెద్ద పెద్ద ప్లాట్లు గుట్టుగా విక్రయిస్తున్నారు. గజానికి రూ.60 వేల చొప్పున హాట్‌ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ప్లాట్‌ విస్తీర్ణం, ఫేసింగ్‌ ఆధారంగా ధరలను పెట్టారు. బాగా పరిచయం ఉన్న బడాబాబులకే అమ్ముతున్నారు. గజాల చొప్పున ప్లాట్‌ మొత్తానికి డబ్బులు తీసుకొని గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 1,936 గజాల ప్లాట్‌ను 16 గుంటల వ్యవసాయ భూమి కింద రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఇప్పటికే మొత్తం ప్లాట్ల ఒప్పందాలు కూడా అయిపోయాయి. కొన్నేళ్ల క్రితం కారుచౌకగా స్థానిక రైతుల నుంచి ఈ భూములను కొన్నారు. ఈ లేఅవుట్‌లో గజం 60 వేలకు అమ్ముతుండగా అక్కడే ఎలాంటి డెవల్‌పమెంట్‌ లేని భూములను గజం రూ.28 వేల చొప్పున అమ్ముతున్నారు.

111 జీవో ఏం చెబుతోంది

111 జీఓ ఆంక్షలున్న జన్వాడలో గ్రామకంఠం మినహాయిస్తే వ్యవసాయ భూముల్లో ఎక్కడా లేఅవుట్లు వేయడానికి వీల్లేదు. వ్యవసాయ భూమిని అమ్ముకోవచ్చు. ఈ లొసుగును ఆసరాగా చేసుకొని అమ్మిన భూములను గుంటల లెక్కన రిజిస్టర్‌ చేస్తున్నారు. 111 జీవోను త్వరలో ఎత్తేస్తారని కొనుగోలుదారులను మభ్యపెడుతున్నారు. విల్లా ప్లాట్ల పేరుతో వందల కోట్ల రూపాయల దందా చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ అధికారులు, వాటర్‌ బోర్డు అధికారులు తమ కళ్లముందే జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు జన్వాడలో ఏర్పాటు చేస్తున్న అనధికారిక లేఅవుట్‌ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.


అధికారులు, ప్రజాప్రతినిధులు మిలాఖత్‌

అక్రమ వెంచర్ల రియల్టర్ల వెనుక పలువురు పలుకుబడి కలిగిన నేతలున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరూ అధికారులు సైతం రియల్టర్లతో కుమ్మక్కై భారీగా ముడుపులు తీసుకుంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి అక్రమ లేఅవుట్లపై ఫిర్యాదులు వెళ్లినా అధికారులపై ఒత్తిడి తెచ్చి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారు. జన్వాడ 60 ఎకరాల లేఅవుట్‌పై అనేక ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. పంచాయతీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, హెచ్‌ఎండీఏ అధికారులు పూర్తి ఉదాసీనత కనబరుస్తున్నారు. భారీ యంత్రాలతో కొండలు, గుట్టలను చదును చేస్తున్నా, వందల ఏళ్ల నాటి బుల్కాపూర్‌ నాలాను పూడుస్తున్నా కన్నెత్తి చూడటం లేదు. వీటిని ఇలాగే వదిలేస్తే భారీ ఎత్తున విల్లాలు, ఫామ్‌హౌ్‌సలు నిర్మించి నివాసాలు ఏర్పాటు చేస్తారని, వాటి నుంచి వెలువడే మురుగునీరు, వ్యర్థాలు నేరుగా గండిపేట చెరువులోకి పోతాయని, ఇది మరో హుస్సేన్‌సాగర్‌లా కాలుష్య కాసారం అవుతుందని పర్యావరణ ప్రేమికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మురికినీరు జంట జలాశయాల్లో చేరుతోంది. బుల్కాపూర్‌ నాలాతో పాటు సహజ సిద్ధమైన నీటి ప్రవాహ మార్గాలు, వాగులు, వంకలను పూడ్చి ప్లాట్లు చేస్తుండటంతో వర్షాకాలంలో భారీ వరదలు ముంచెత్తే విపత్తు పొంచి ఉంది. ఈ 60 ఎకరాల వెంచర్‌ పక్కనే మరికొన్ని అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారు. శంకర్‌పల్లి-హైదరాబాద్‌ ప్రధాన రోడ్డుకు సమీపంలోనే ఈ వెంచర్లు వస్తున్నాయి. ఈ భూములకు రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్ట్రేషన్‌ చేయదు కాబట్టి రెవెన్యూ శాఖలో అధికారులకు లంచాలిచ్చి గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. శంకరపల్లి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఒక గుంట నుంచి ఐదు గుంటల వరకు కూడా రిజిస్ట్రేషన్‌ చేసిన దాఖలాలు ఉన్నాయి. జన్వాడలోని ఓ సర్వే నెంబర్‌లో దాదాపు 40కిపైగా బై నెంబర్లతో రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొండాపూర్‌ వ్యక్తికి సర్వే నంబర్‌ తర్వాత /2/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/2 బై నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ జరిగింది. పాస్‌బుక్‌ కూడా వెంటనే ఇచ్చేస్తున్నారు. అధికారిక లేఅవుట్‌ అనుమతులు లేకుండా, నాలా కన్వర్షన్‌ ఫీజులు చెల్లించకుండా గుంటల లెక్కన అక్రమ రిజిస్ట్రేషన్లు చేయిస్తుండటంతో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం కూడా పోతోంది. జంట జలాశయాల అస్థిత్వానికి ప్రమాదాన్ని కొస్తోంది.

Updated Date - Sep 05 , 2026 | 07:12 AM