Share News

ఇంటర్‌ పరీక్షలకు తొలిరోజు 96.90శాతం హాజరు

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:33 AM

ఇంటర్మీడియట్‌వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పరీక్షకు 5,14,598 మంది హాజరు కావాల్సి ఉండగా.. 4,98,695 (96.90శాతం) మంది హాజరయ్యారు....

ఇంటర్‌ పరీక్షలకు తొలిరోజు 96.90శాతం హాజరు

  • తొలిరోజు పరీక్ష రాయని విద్యార్థులు 15,903 మంది

  • తొలిరోజు పరీక్ష ప్రశాంతం: ఇంటర్‌బోర్డు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఇంటర్మీడియట్‌వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పరీక్షకు 5,14,598 మంది హాజరు కావాల్సి ఉండగా.. 4,98,695 (96.90శాతం) మంది హాజరయ్యారు. 15,903 మంది హాజరు కాలేదు. తొలిరోజు పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క మాల్‌ ప్రాక్టీస్‌ కేసు కూడా నమోదు కాలేదని ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. బుధవారం ఆయన సికింద్రాబాద్‌, మారేడుపల్లి ప్రాంతాల్లోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు బోర్డు జారీచేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను కోరారు. పరీక్షల పర్యవేక్షణకు 75 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 200 సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,500 మంది ఇన్విజిలేటర్లు, 1,495 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,495 మంది వివిధ శాఖల అధికారులు పాల్గొంటున్నారని కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొలిరోజు పరీక్షకు 85,690 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, హైదరాబాద్‌ శివార్లలోని బాచుపల్లి-మల్లంపేట్‌ రోడ్డులో బుధవారం ఇంటర్‌ పరీక్షా పత్రాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. దీంతో మల్లంపేట్‌ ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.


సంస్కృతానికి బదులు హిందీ ప్రశ్నపత్రం

సంస్కృతం పరీక్ష రాయాల్సిన విద్యార్థికి హిందీ ప్రశ్నపత్రం ఇచ్చిన ఘటన బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలోని చైతన్య జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో చోటుచేసుకున్నది. పట్టణంలోని ఓ ప్రైవేట్‌కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న మణిదీప్‌ అనే విద్యార్థికి స్థానిక చైతన్య జూనియర్‌ కళాశాలలో పరీక్ష కేంద్రం కేటాయుంచారు. మొదటి రోజు తెలుగు, హిందీ, అరబిక్‌, సంస్కృతం, ఉర్దూ పరీక్షలు నిర్వహించగా.. సంస్కృతం పరీక్ష రాయాల్సిన మణిదీ్‌పకు ఇన్విజిలేటర్‌ హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. సంస్కృత ప్రశ్నపత్రాన్ని హిందీ భాషలోనే ఇస్తారేమోనని భ్రమపడి.. ఆ విద్యార్థి హిందీ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు సంస్కృతంలో జవాబులు రాశాడు. పరీక్ష పూర్తయిన అనంతరం ఇంటికి వెళ్లి తన తండ్రి యాదయ్యకు ఈ విషయం చెప్పాడు. యాదయ్య వెంటనే మణిదీ్‌పను వెంటబెట్టుకొని పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి చీఫ్‌ సూపర్‌వైజర్‌ అరుణ, ఏసీఎస్‌ ఆంజనేయులు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ కరణ్‌జీరావులను నిల దీశారు. దీంతో పొరపాటు జరిగినట్లు పరీక్ష కేంద్రం అధికారులు గుర్తించి.. డీఐఈవో, డీఈసీల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ కోసం సీఎస్‌, ఏసీఎస్‌, డీవో, విద్యార్థి, విద్యార్థి తండ్రిని మహబూబ్‌నగర్‌కు రావాలని సూచించడంతో వారంతా అక్కడికి వెళ్లారు. కాగా, ఇన్విజిలేటర్‌ పొరపాటు వల్ల తన కుమారుడికి ఒక సంవత్సర కాలం వృథా కానుందని యాదయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై పరీక్షల నిర్వహణ అధికారి కరణ్‌జీరావుకు జిల్లా ఎగ్జామినేషన్‌ కమిటీ కన్వీనర్‌ కౌసర్‌ జహాన్‌ షోకాజు నోటీసు జారీచేశారు.

కన్నతల్లులు మృతి.. కన్నీళ్లతోనే పరీక్షకు..

ఇంటర్‌ పరీక్షల మొదటి రోజు ఇద్దరు విద్యార్థులు పుట్టెడు దుఃఖంతో పరీక్ష రాయాల్సి వచ్చింది. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల అర్బన్‌ హౌసింగ్‌ కాలనీ(నూకపల్లి)కి చెందిన కనగల లక్ష్మణ్‌బాబు- అనూషల పెద్ద కుమార్తె రమ్యశ్రీ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అనూష మంగళవారం కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది . ఆ బాధను దిగమింగుకున్న రమ్యశ్రీ పరీక్షకు హాజరైంది. తర్వాత తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో నివాసముండే గోపులారం రమేశ్‌, కల్పన దంపతులకు రవితేజ, హిమశ్రీ సంతానం. కల్పన శంకర్‌పల్లిలోని కేజీబీవీ పాఠశాలలో కంప్యూటర్‌ టీచర్‌గా పనిచేస్తూ.. అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందింది. కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా కొల్లూరుకు తరలించారు. ఇంటర్‌ చదువుతున్న రవితేజ.. తల్లి మరణించిన దుఃఖంతోనే పరీక్షకు హాజరయ్యాడు.

Updated Date - Feb 26 , 2026 | 03:33 AM