Share News

88,13,207 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు!

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:47 AM

ఓటర్ల పేర్లలో చిన్న చిన్న తప్పులు, వయసులో వ్యత్యాసాలు, తల్లిదండ్రుల పేర్లలో, బంధుత్వాల్లో తేడాలు, తండ్రికి-పిల్లలకు, తోబుట్టువులకు మధ్య తక్కువ వయసు తేడా (ఏజ్‌ గ్యాప్‌)...

88,13,207 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు!

  • పేర్లు, వయసు, బంధుత్వాల్లో వ్యత్యాసాలు

  • 2002 నాటి జాబితాతో పోల్చుతూ తప్పులు గుర్తించామన్న ఎన్నికల సంఘం అధికారులు

  • కుత్బుల్లాపూర్‌ సెగ్మెంట్‌లో అత్యధికంగా 78శాతం

  • వివరాల్లో తేడాలున్న ఓటర్లకు నోటీసులు

  • తగిన పత్రాలతో సరిచేస్తున్న అధికారులు

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల పేర్లలో చిన్న చిన్న తప్పులు, వయసులో వ్యత్యాసాలు, తల్లిదండ్రుల పేర్లలో, బంధుత్వాల్లో తేడాలు, తండ్రికి-పిల్లలకు, తోబుట్టువులకు మధ్య తక్కువ వయసు తేడా (ఏజ్‌ గ్యాప్‌)... రాష్ట్రంలో చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (సర్‌)’ ప్రక్రియలో గుర్తించిన తేడాలివి. ఒకరు ఇద్దరు కాదు.. రాష్ట్రంలోని 88,13,207 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించినట్టు ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. గత కొన్ని ఎన్నికల్లో వీరంతా ఓటేసినవారే. కానీ ఇప్పుడు ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా 2002 నాటి ‘సర్‌’ జాబితాతో పోల్చుతూ.. వారంతా పరిశీలన (స్ర్కూటినీ) పరిధిలోకి వచ్చారు. వారంతా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను చూపి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి తేడాలను సరిచేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఓటర్ల జాబితాలో నుంచి పేరు తొలగించే అవకాశం ఉండనుంది. 2002 నాటి సర్‌ జాబితాతో తాజా ఓటర్ల జాబితాలను పోల్చిన ఎన్నికల సంఘం.. 88,13,207 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌ నగరం, పరిసరాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా తేడాలు ఉన్నట్టు తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 37 శాతం తేడాలు ఉన్నట్టు గుర్తించింది... అత్యధికంగా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 78శాతం, ఎల్బీ నగర్‌ (74శాతం), ఉప్పల్‌ (73శాతం), శేరిలింగంపల్లి (72శాతం), కూకట్‌పల్లి (60శాతం), మల్కాజిగిరి (59శాతం), రాజేంద్రనగర్‌ (57శాతం), నిజామాబాద్‌ అర్బన్‌ (54శాతం), పటాన్‌చెరు (54శాతం) తేడాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10,77,559, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 7,85,609, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2,35,275, నారాయణపేట్‌ జిల్లాలో 1,86,544, వనపర్తి జిల్లాలో 97,387 తేడాలను గుర్తించారు. ఓటర్ల వివరాలను సరిచూసే ప్రక్రియ(మ్యాపింగ్‌)లో కొందరు అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయకపోవడం, కొందరు కేవలం ఆధార్‌ కార్డును అప్‌లోడ్‌ చేసి వదిలేయడం వంటివి కూడా ఇబ్బందిగా మారాయని అధికారులు చెబుతున్నారు.


ప్రధానంగా గుర్తించిన తేడాలు..

ఓటర్ల వయసు, బంధుత్వాల విషయంలో ఎక్కువ తేడాలు బయటపడినట్టు తెలిసింది. 2002 నాటి ‘సర్‌’తో పోలిస్తే.. ఈసారి ప్రక్రియలో ఒకే కుటుంబంలోని తోబుట్టువుల మధ్య కేవలం తొమ్మిది నెలల వయసు తేడా ఉండటాన్ని గుర్తించారు. సంతానానికి, తల్లిదండ్రులకు మధ్య 15 ఏళ్లకంటే తక్కువ వయసు తేడాలున్న కేసులు ఉన్నాయి. కొందరు ఓటర్ల విషయంలో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య 50 ఏళ్లవరకు వయసు తేడాలున్నాయి. తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలకు, మనవళ్లకు మధ్య 40 ఏళ్ల కంటే తక్కువ వయసు తేడాలను గుర్తించారు. ఇక తల్లిదండ్రుల పేర్లలో తేడాలున్నాయి. గత ‘సర్‌’లో తల్లిదండ్రుల పేర్లకు, ఈ ‘సర్‌’లో పేర్లకు పొంతన లేదు. ఇదివరకు భర్త అని ఉన్న చోట ఇప్పుడు తండ్రి అన్న బంధుత్వం నమోదైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఇలాంటి పొరపాట్లను సరిదిద్దే ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే కొంత మందికి నోటీసులు ఇచ్చామని, తప్పులను సవరించుకోవాలని సూచించామని అధికారులు తెలిపారు. తప్పులు బయటపడిన ఓటర్లకు సంబంధించి 90 శాతం మేర తేడాలను సరిదిద్దుతామని తెలిపారు.

ఈ ధ్రువీకరణ పత్రాలు అవసరం

‘సర్‌’ ప్రక్రియలో తప్పులు దొర్లినవారికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చి సరిదిద్దుతోంది. ఇందుకోసం ధ్రువపత్రాలను అడుగుతోంది. జనన ధ్రువపత్రం, టెన్త్‌క్లాస్‌ మార్కుల మెమో, పాస్‌పోర్టు, కుల ధ్రువీకరణ పత్రం, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కోసం ఆధార్‌ కార్డు, ఇతర వయసు, చిరునామానిర్ధారణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Updated Date - Jun 12 , 2026 | 05:47 AM