Share News

73 లక్షల ఓట్లు హుష్‌కాకి!

ABN , Publish Date - Aug 11 , 2026 | 05:45 AM

రాష్ట్రంలో దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంతు కానున్నాయా!? వీరిలో చనిపోయినవారు, రెండుచోట్ల ఓట్లు ఉన్నవారితోపాటు ఓటు హక్కు కోసం ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించని వారూ...

73 లక్షల ఓట్లు  హుష్‌కాకి!

  • వీరిలో చనిపోయినవారు, రెండు చోట్ల ఓట్లున్న వారు

  • ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించనివారు కూడా..

  • 3,38,26,448 మంది ఓటర్లలో 2,64,73,616 మంది

  • వివరాలు డిజిటైజ్‌.. ఇది మొత్తం ఓటర్లలో 78.26 శాతం

  • 94.31 శాతంతో భువనగిరి టాప్‌.. హైదరాబాద్‌ లాస్ట్‌

  • రాజధానిలో ఏకంగా 20 లక్షల ఓట్లు ఏఎ్‌సడీ జాబితాలో

  • 17న ముసాయిదా.. లిస్టులో పేరు లేకపోతే మళ్లీ చాన్స్‌

  • అప్పటికీ ఫారాలు, ఆధారాలు ఇవ్వకపోతే ఓటు ఔట్‌

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంతు కానున్నాయా!? వీరిలో చనిపోయినవారు, రెండుచోట్ల ఓట్లు ఉన్నవారితోపాటు ఓటు హక్కు కోసం ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించని వారూ ఉన్నారా!?

ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించకపోతే వారి ఓట్లు జాబితా నుంచి పోనున్నాయా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానమే వస్తోంది! ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌) ముగిసింది. ఎన్నికల ప్రధాన అధికారి సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేశారు. వాటి డిజిటైజేషన్‌ ప్రక్రియ 78.26 (2,64,73,616 మంది) శాతమే పూర్తయింది. మిగిలిన 73,52,832 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలను నమోదు చేయలేదు. వీరిని ఏఎ్‌సడీ (ఆబ్సెంట్‌, షిఫ్ట్‌, డెత్‌) జాబితాలో చేర్చారు. అంటే, చనిపోయిన వారు, రెండుచోట్ల ఓట్లు ఉన్నవారు, ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకోనివారు ఉన్నారు. ఒక్క హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే దాదాపు 20 లక్షల మంది ఈ జాబితాలో ఉండడం గమనార్హం. జిల్లా పరిధిలో 27.89 లక్షల (58.89 శాతం) ఓటర్ల వివరాలు డిజిటలైజ్‌ చేశారు. 19.46 లక్షల (41.11 శాతం) ఏఎ్‌సడీ జాబితాలో చేర్చారు. అలాగే, ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియలో యాదాద్రి భువనగిరి అగ్రస్థానంలో ఉంటే, హైదరాబాద్‌ చివర్లో ఉంది. భువనగిరిలో 4,59,943 మంది ఓటర్లకు గాను 4,33,773 ఫారాల (94.31 శాతం) డిజిటలైజేషన్‌ పూర్తయింది. ఆ తర్వాతి స్థానాల్లో జనగాం 91.68 శాతం, మెదక్‌ 90.53 శాతం, సూర్యాపేట 90.45 శాతం, మహబూబాబాద్‌ 90.11 శాతం ఉన్నాయి. అతి తక్కువ సంఖ్యలో డిజిటలైజేషన్‌ పూర్తయిన జిల్లాగా హైదరాబాద్‌లో చివరిస్థానంలో నిలిచింది. ఇక్కడ 47,36,669 మంది ఓటర్లు ఉండగా, 27,89,214 ఫారాల (58.89 శాతం) డిజిటలైజేషన్‌ మాత్రమే పూర్తయింది. అంతకంటే కొంచెం మెరుగ్గా... మేడ్చల్‌ మల్కాజిగిరిలో 63.97 శాతం, రంగారెడ్డి జిల్లాలో 65.16 శాతం డిజిటలైజేషన్‌ చేపట్టారు.


మరొక్క చాన్స్‌..!

ఈనెల 17వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏఎ్‌సడీ జాబితాలో ఉన్నవారికి నోటీసులు ఇస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని వీరు సమర్పించాల్సి ఉంటుంది. దానిని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈఆర్‌ఓ) పరిశీలించి ఆమోదిస్తారు. ఆ తర్వాతే తుది ఓటర్‌ జాబితాలో పేరుంటుంది. అయితే, ఫారాలను ఇవ్వకుంటే.. తమ ఓటు కోల్పోయినట్లేనా? అనే ఆందోళన పలువురిలో వ్యక్తమవుతోంది. అయితే, ఎన్యూమరేషన్‌ ఫారం సమర్పించకుంటే.. ఓటు హక్కును శాశ్వతంగా కోల్పోయినట్లు కాదు. ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినా భయపడాల్సిన పనిలేదు. ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించిన తర్వాత, అభ్యంతరాలను స్వీకరించి ఫారం-6, అవసరమైన డిక్లరేషన్‌ ద్వారా వారి పేరును చేర్చుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా, ప్రతి పోలింగ్‌ ేస్టషన్‌ పరిధిలోని ఓటర్ల సమాచారాన్ని ఎన్నికల అధికారులు క్రమబద్ధీకరిస్తారు. ఈ సందర్భంగా, ఎన్యూమరేషన్‌ ఫారం సమర్పించని ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా పరిశీలిస్తారు. ఉదాహరణకు, ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు ఉంది. కానీ, సర్‌ ప్రక్రియలో ఎటువంటి సమాచారం అందలేదు. అప్పుడు.. ఆ ఓటరు నిజంగా అదే చిరునామాలో నివసిస్తున్నారా? ఓటరు జీవించి ఉన్నారా? మరోచోటికి శాశ్వతంగా వెళ్లిపోయారా? అనే అంశాలను పరిశీలిస్తారు. ఫారం ఇవ్వలేదనే కారణంతో అర్హుడైన ఓటరును ఎలాంటి విచారణ లేకుండా, అభ్యంతరాలను స్వీకరించకుండా తొలగించడం అనేది ఉండదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

ఇప్పుడేం చేయాలి!?

ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ప్రతి ఓటరు తన పేరు ఉందా? లేదా? అనేది తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఇందుకు ఈ-పోర్టల్‌, ఎన్నికల కమిషన్‌ మొబైల్‌ యాప్‌లో చూసుకోవచ్చు. పేరు లేకపోయినా.. వివరాల్లో తప్పులు ఉన్నా.. ఎన్నికల అధికారులకు అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చు. కొత్త ఓటర్లు కూడా నిబంధనల ప్రకారం ఫారం-6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. జాబితాలో పేరు లేకపోతే నిర్ణీత గడువులో అభ్యంతరాలను సంబంధిత ఈఆర్‌వో, ఏఈఆర్‌వోకు అందజేయాలి. అలాగే, దరఖాస్తు, అవసరమైన ఆధారాలు సమర్పించాలి. ఆ తర్వాత, ఇలా వచ్చిన దరఖాస్తులన్నిటినీ పరిశీలించి, ఓటరు జాబితాను సవరిస్తారు. ఎన్నికల సంఘం నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈనెల 17వ తేదీ నుంచే క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణను ప్రారంభిస్తారు. సెప్టెంబరు 30 వరకు దీనిని చేపడతారు. వాటి పరిష్కారాన్ని అక్టోబరు 15వ తేదీలోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత అక్టోబరు 19 వరకు తుది ఓటరు జాబితాను వెల్లడించనున్నారు.


7-National-11-08.jpg

ఇవి కూడా చదవండి..

తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..

సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

Updated Date - Aug 11 , 2026 | 05:45 AM