Share News

52 వేల కోట్లతో గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:05 AM

తమ ప్రజాప్రభుత్వం హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధికి, శరవేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

52 వేల కోట్లతో   గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి
RTC

  • 52 వేల కోట్లతో

గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి

  • భారీగా మౌలిక వసతుల విస్తరణ చేపట్టాం

  • రూ.38వేల కోట్లతో రెండో దశ మెట్రోకు శ్రీకారం

  • ఆటో కార్మికులకు త్వరలో సంక్షేమబోర్డు

  • మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌ వెల్లడి

  • ప్రజాభవన్‌లో ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ ఆవిష్కరణ

  • ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధికి ప్రాధాన్యం

  • గత ప్రభుత్వం చుక్కనీరు అదనంగా తేలే

  • తాగునీటి అవసరాలను పట్టించుకోలేదు

  • కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే

మెట్రో, ఎయిర్‌పోర్టు, రింగ్‌రోడ్డు,

వర్సిటీల ఏర్పాటు: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): తమ ప్రజాప్రభుత్వం హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధికి, శరవేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. మహానగర సమగ్ర ప్రగతి లక్ష్యంగా రూ. 52 వేల కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. శుక్రవారం బేగంపేటలోని ప్రజాభవన్‌లో ఆర్టీసీ, హైదరాబాద్‌ మెట్రో రైలు సంయుక్తంగా అందుబాటులోకి తెచ్చిన ‘ఆర్టీసీ- మెట్రో కామన్‌ పాస్‌’, మీ టికెట్‌ యాప్‌, డిజిటల్‌ వీక్లీ బస్‌పా్‌సలను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, గడ్డం వివేక్‌ వెంకటస్వామి, అజారుద్దీన్‌తో కలిసి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సుమారు 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆటోచార్జీల సవరణ జీవోను విడుదల చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడారు. హైదరాబాద్‌ తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు కృష్ణా, గోదావరి, మంజీరా జలాలను తీసుకొచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని చెప్పారు. ఓఆర్‌ఆర్‌, శంషాబాద్‌ విమానాశ్రయం, బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌, డీఆర్‌డీఓ, బీడీఐఎల్‌, హెచ్‌సీయూ, ఐఐఐటీ వంటి సంస్థలు కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయని గుర్తుచేశారు. అదే పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కనీసం తాగునీటి అవసరాలను కూడా పట్టించుకోలేదని, చుక్క తాగునీటిని కూడా అదనంగా తీసుకురాలేదని మండిపడ్డారు. నగరంలో పౌర సదుపాయాలను పెంచేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.35 వేలకోట్లతో వంతెనలు, అండర్‌పా్‌సలు, రేడియల్‌ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని.. జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్‌, మంచినీటి ప్రాజెక్టుల పనులతో కలిపి మొత్తం రూ. 52 వేల కోట్లతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రజారవాణాను బలోపేతం చేసేందుకు రూ.38 వేల కోట్లతో మెట్రో రెండోదశ ప్రాజెక్టు చేపడుతున్నట్టు చెప్పారు.


ఆటో కార్మికులకు సంక్షేమబోర్డు: పొన్నం

హైదరాబాద్‌ నగరంలో ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఆర్టీసీ, మెట్రో, ఆటో వ్యవస్థలను సాంకేతికతతో అనుసంధానిస్తున్నామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. సుమారు 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆటోచార్జీల సవరణను.. ప్రజలపై భారం పడకుండా, డ్రైవర్లకు న్యాయం జరిగేలా చేపట్టామన్నారు. ఆటో కార్మికుల కోసం త్వరలోనే ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అవసరమైతే ఆర్టీసీకి చెందిన కొంత స్థలం విక్రయించి అయినా సంస్థ రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇక కార్మిక మంత్రి వివేక్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రజా రవాణాను పెంచడం అత్యవసరమని చెప్పారు. ఆర్టీసీ-మెట్రో సమన్వయంతో ప్రస్తుతం రోజుకు 5 లక్షలుగా ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య 10 లక్షలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్‌, పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

నేడు మెట్రోలో మంత్రుల బృందం పర్యటన

పాస్‌ విడుదల కార్యక్రమంలో రూ.400 విలువైన రోజువారీ మెట్రో-ఆర్టీసీ కామన్‌ పాస్‌లను సీఎం రేవంత్‌ సహా 15 మంది మంత్రుల కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనుగోలు చే శారు. ఈ కామన్‌ పాస్‌ సౌకర్యం, క్షేత్రస్థాయి అనుసంధానాన్ని స్వయంగా పరిశీలించేందుకు శనివారం ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో రైలులో.. అక్కడి నుంచి సచివాలయం వరకు బస్సులో మంత్రుల బృందం ప్రయాణించనుంది.

ఒకే పాస్‌తో బస్సు, మెట్రో ప్రయాణం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ను ప్రపంచంలో వేగవంతమైన నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దే ‘హైదరాబాద్‌ రైజింగ్‌-క్యూర్‌’ విజన్‌లో భాగంగా ప్రజా రవాణాను సమీకృతం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజారవాణా వ్యవస్థలను అనుసంధానం చేసినప్పుడే మెరుగైన సేవలు అందుతాయని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ఆర్టీసీ, హైదరాబాద్‌ మెట్రో ఉమ్మడి ప్రయాణ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.

Updated Date - Oct 03 , 2026 | 04:07 AM