Share News

సింగరేణి బొగ్గు మాయం.. అంతా అయోమయం

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:13 AM

సింగరేణి కాలరీస్‌ బొగ్గు నిల్వల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. రాజకీయ పార్టీలు చేస్తున్న రూ.1600 కోట్ల కుంభకోణం ఆరోపణల సంగతి పక్కన పెడితే యాజమాన్యం చెబుతున్న.....

సింగరేణి బొగ్గు మాయం.. అంతా అయోమయం

  • తవ్వినకొద్దీ అనుమానాలు

  • యాజమాన్యం లెక్కల్లోనూ కానరాని స్పష్టత

గోదావరిఖని, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): సింగరేణి కాలరీస్‌ బొగ్గు నిల్వల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. రాజకీయ పార్టీలు చేస్తున్న రూ.1600 కోట్ల కుంభకోణం ఆరోపణల సంగతి పక్కన పెడితే యాజమాన్యం చెబుతున్న లెక్కల్లోనే అంతులేని అయోమయం కనిపిస్తోంది. 40లక్షల టన్నుల(4 మిలియన్‌ టన్నులు) వ్యత్యాసంపై సూటిగా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ప్రకటించిన అధికారిక గణాంకాలే ఆరోపణలకు పునాదిగా మారాయి. 69.01 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 65.27 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా, అమ్మకం జరిగినట్లు సింగరేణి ప్రకటించింది. మిగిలిన 3.74 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాకుండానే సింగరేణి ప్రకటించిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణిలో యేటా 1 నుంచి 2లక్షల టన్నులు తేడా ఉండటం సహజమే. అయితే 2024-25లో 3.74 మిలియన్‌ టన్నులు తేడా రావడం సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ అంశంపై తమ వద్ద ప్రస్తుతం 26.77లక్షల టన్నుల స్టాకు ఉందని చెప్పడం మినహా 4 మిలియన్‌ టన్నుల ఆరోపణలపై సింగరేణి యాజమాన్యం స్పందించలేదు. 3.74 మిలియన్‌ టన్నులు బొగ్గును నిల్వలుగా చూపించి 2025-26 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తిలో ఈ మొత్తాన్ని కలిపి సర్దుబాటు చేసేందుకు సింగరేణి ప్రయత్నిస్తుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు 2024-25 ఆర్థిక ఫలితాలను సింగరేణి ఇంకా ప్రకటించలేదు. ప్రకటిస్తే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తనిఖీల్లో జాప్యం కూడా అనుమానాలకు తావిస్తున్నది. ఏప్రిల్‌లో తనిఖీలు జరగాల్సి ఉండగా కేంద్ర బృందాలు ఆలస్యంగా రావడం, కేంద్రమంత్రే ముఖ్యమంత్రికి లేఖ రాయడం బొగ్గు మాయం ఆరోపణలను బలపరుస్తుంది. 2024-25 బొగ్గు నిల్వలపై కాగ్‌ పరిశీలన కూడా జరగలేదు. 4 మిలియన్‌ టన్నుల బొగ్గు మాయం నిర్ధారణకు స్వతంత్ర ఫోరెన్సీక్‌ అడిట్‌, కాగ్‌ ఫిజికల్‌ వెరిఫికేషన్‌ జరగాల్సి ఉంది. ఆరోపణలు నిజమో కాదో తేల్చాల్సిన బాధ్యత కూడా సింగరేణి యాజమాన్యానిదే. అప్పటి వరకు 4 మిలియన్‌ టన్నుల ’మాయం’ మచ్చ సింగరేణి మోయాల్సిందే. దిద్దుబాటు చర్యల్లో భాగంగా శ్రీరాంపూర్‌ ఓపెన్‌కాస్టులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో ఓపెన్‌హౌ్‌స పేర సింగరేణిలో ఎలాంటి బొగ్గు మాయం జరగలేదని, అంతా పారదర్శకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదు.


’గుర్తింపు’ కోసమేనా?

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, విద్యుత్‌ ఉత్పత్తి, కారుణ్య నియామకాలపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి కేంద్రీకరించాయి. షెడ్యూల్‌ ప్రకారం 2026 సెప్టెంబర్‌లో అంటే మరో 3 మాసాల్లో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగాల్సి ఉంది. 2023 డిసెంబర్‌లో కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. అయితే గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీకి 2024 సెప్టెంబర్‌లో గుర్తింపు సంఘంగా ధ్రువీకరించారు. అప్పటి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం రెండేళ్లకు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సింగరేణిపై రాజకీయ పార్టీలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

సింగరేణిలో అవకతవకలపై సీబీఐ విచారణ కోరాలి

  • బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌.. సోలార్‌ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణ

సింగరేణిలో గడచిన 12 సంవత్సరాలుగా జరుగుతున్న అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే, సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అక్రమాలపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. సింగరేణిలో పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తాము మూడు రోజుల క్రితం లేఖ ఇస్తే తొలుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంగీకరించారని తెలిపారు. ఆ తర్వాత పర్మిషన్‌ లేదని చెప్పారని, ఇప్పుడు కనీసం ఫోన్‌లో కూడా స్పందించడం లేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ వాస్తవాలను వెలికితీస్తుందోననే భయంతో, తప్పులు బయటపడతాయనే ఆందోళనతోనే ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. సోలార్‌ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించే చిత్తశుద్ధి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఉందా? అని ప్రశ్నించారు. డీజిల్‌, జెలిటన్‌లను కూడా మార్కెట్‌ ధర కంటే 30 శాతం అదనంగా మధ్యవర్తుల ద్వారా కొంటూ సింగరేణికి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Jun 21 , 2026 | 05:14 AM