యూజర్ల పోస్టులపై ప్రభుత్వ ఆంక్షల గురించి తెలుసుకునే ఛాన్స్!
ABN , Publish Date - Sep 22 , 2026 | 02:52 PM
తమ పోస్టులను ఏయే దేశాల్లోని ప్రభుత్వాలు నిషేధించాయో యూజర్లు తెలుసుకునేందుకు వీలుగా ఎక్స్ ఓ కోత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: తమ పోస్టులకు గతంలో వలె వ్యూస్ రావట్లేదని తరచూ కొందరు ఎక్స్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కారణం ఎంటో తెలియక సతమతం అవుతుంటారు. వివిధ దేశాల్లో ప్రభుత్వాలు యూజర్ల పోస్టులపై విధించే ఆంక్షలు ఇందుకు కారణం కావచ్చు. ఇలాంటి నిషేధాల గురించి తెలుసుకునే సదుపాయాన్ని ఎక్స్ తాజాగా అందుబాటులోకి తెచ్చింది. పారదర్శకత పెంపొందించేందుకు గత అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన అండర్ ది హుడ్ ఫీచర్‌లో భాగంగా ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. తాజాగా ఆ ఫీచర్‌ను మరింత విస్తరించింది.
ఈ ఫీచర్ ప్రకారం, తమ పోస్టులపై ఏయే దేశాల్లోని ప్రభుత్వాలు నిషేధం విధించాయో తెలుసుకోవచ్చు. తద్వారా వ్యూస్ తగ్గడానికి ప్రభుత్వ ఆంక్షలే కారణమా? కాదా? అన్న విషయంపై యూజర్లకు స్పష్టత ఏర్పడుతుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ పోస్టులపై క్రితం నెలలో విధించిన ఆంక్షల గురించి తెలుసుకోవచ్చు. ఇందుకోసం వెబ్ యూజర్లు https://x.com/i/under_the_hood వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. యాప్ యూజర్లు తన ప్రొఫైల్ ఐకాన్‌ను క్లిక్ చేసి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తరువాత యువర్ అకౌంట్ ఆప్షన్‌లోని అండర్ ది హుడ్ ను ఎంచుకుని మునుపటి నెల నివేదికను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ అర్హతలు ఉంటేనే..
ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉండదని కూడా ఎక్స్ స్పష్టం చేసింది. కనీసం ఏడాది క్రితం క్రియేట్ చేసుకున్న అకౌంట్స్‌కు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా, క్రితం నెలలో కనీసం 10 పోస్టులు పెట్టిన వారికే ఈ నివేదిక అందుబాటులో ఉంటుంది. కొత్త యూజర్లు, ఎక్స్‌లో అంతగా యాక్టివ్‌గా ఉండని వారికి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. వివిధ ప్రభుత్వాల డిమాండ్ మేరకు కొన్ని, అకౌంట్స్, పోస్టులను ఎక్స్ కనబడకుండా చేస్తుందన్న విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
ఏఐకి కొత్త పేరు పెట్టండి.. ప్రజలకు ట్రంప్ పోలింగ్
ఒకే ఫ్రేమ్‌లో మిల్కీ వే, శుక్రుడు, పర్పుల్ మెరుపులు