Share News

కదంతొక్కిన కార్మికులు..

ABN , Publish Date - Apr 23 , 2026 | 02:42 AM

ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల సాధన కోసం కదం తొక్కారు. ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌తో ప్రగతి చక్రంగా భావించే ఆర్టీసీ బస్సులకు బ్రేక్‌ పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు కదలలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు

కదంతొక్కిన కార్మికులు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల సాధన కోసం కదం తొక్కారు. ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌తో ప్రగతి చక్రంగా భావించే ఆర్టీసీ బస్సులకు బ్రేక్‌ పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు కదలలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 22న సమ్మెకు దిగుతున్నట్లు ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. ఇదేక్రమంలో ప్రభుత్వం మంగళవారం ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరిపినా విఫలం కావడంతో జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని అర్ధరాత్రి వరకు ఎదురుచూసిన కార్మికులకు నిరాశ మిగిలింది. దీంతో బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో పాటు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిపోల ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాలు నిర్వహించారు. పోలీసులు బలవంతంగా కార్మికులను విరమింపచేసినా రెండోసారి కూడా ధర్నాలు చేశారు. కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో సిరిసిల్ల, వేములవాడ రెండు డిపోల్లో 136 బస్సులు నిలిచిపోయాయి. రెండు డిపోల పరిధిలో నడిచే 44 అద్దె బస్సులను ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా నడపడానికి ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రైవేట్‌ వ్యక్తులతో అద్దె బస్సులు నడపకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల ఎస్కార్ట్‌తో బస్సులను నడిపించారు. పట్టణ ప్రాంతాలకు మాత్రమే అద్దె బస్సులు పరిమితం చేశారు. తెల్లవారుజాము నుంచి సమ్మె మొదలు కావడంతో పోలీసులు ఆర్టీసీ బస్టాండ్లలో బందోబస్తు నిర్వహించారు.

సమ్మెలో 503 మంది కార్మికులు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే దానితో పాటు 32 డిమాండ్లతో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో సిరిసిల్ల, వేములవాడ డిపోల నుంచి 503 మంది కార్మికులు పాల్గొన్నారు. దీంతో ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు ప్రభుత్వం ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలికంగా నియమించి బస్సులను నడిపించింది. దాదాపు 50 రోజులకు పైగా ఆర్టీసీ కార్మికులు పోరాటం చేశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తామని కూడా ప్రభుత్వ హెచ్చరించింది. ఎస్మా ప్రయోగిస్తామని చెప్పినా సమ్మె విరమించకపోవడంతో సుదీర్ఘ కాలంగానే కొనసాగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీతో సమ్మె విరమించారు. అప్పటినుంచి ఆర్టీసీలో ట్రేడ్‌ యూనియన్‌ పాత్ర కూడా తగ్గింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే ముందు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వం విలీనంతో సహా అనేక హామీలు ఇచ్చింది. హామీలు నెరవేరకపోవడంతో కార్మికులు, ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

ప్రయాణికులకు తప్పని తిప్పలు

ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్లడంతో జిల్లాలోని ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే రైతులు, ఇతర కార్మికులు ఇబ్బందులు పడుతూ మళ్లీ ఆటోలు, ప్రైవేట్‌ వాహనాల వైపు మొగ్గు చూపారు. జిల్లాలో సిరిసిల్ల డిపో నుంచి 21 అద్దె బస్సులు, వేములవాడ డిపో నుంచి 23 అద్దె బస్సులను ప్రైవేట్‌ వ్యక్తులతో నడిపించారు. వాటిని కూడా కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు ఉపయోగించడంతో మండల కేంద్రాలకు, గ్రామాలకు బస్సులు వెళ్లకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లాంటి నగరాలకు వెళ్లడానికి ప్రైవేట్‌ వాహనాలకు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వచ్చింది.

వేములవాడకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు

వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో భీమేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆర్టీసీ సమ్మెతో బస్సులు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. వేములవాడ బస్టాండ్‌లో వాహనాల కోసం గంటలు తరబడి ఎదురుచూశారు. చివరకు ప్రైవేట్‌ వాహనాలలో వారి గమ్యస్థానాలకు వెళ్లారు. బస్సులు నిలిచిపోవడంతో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఇవీ..

- ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.

- 2021 వేతన సవరణకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి, 2025 వేతన సవరణ చేపట్టాలి.

- మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతినెలా రూ.400కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి

- కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. పోస్టులను పర్మినెంట్‌ ఉద్యోగాల కింద భర్తీ చేయాలి.

- ట్రేడ్‌ యూనియన్‌లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.

- ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. కండక్టర్‌, డ్రైవర్లపై కేఎంపీఎల్‌, ఈపీకే వేధింపులు మానుకోవాలి.

- ఎలక్ట్రిక్‌ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సులకు ఇవ్వద్దు.

- అద్దె బస్సులను, వాటి డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేసుకోవాలి.

- గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో పనిచేస్తున్న సిబ్బందిని కరీంనగర్‌ జోన్‌, హైదరాబాద్‌ జోన్లకు బలవంతంగా బదిలీ చేసే ఉత్తర్వులను రద్దు చేయాలి.

- 2019 సమ్మె కాలంలో నమోదైన పోలీస్‌ కేసులను ఎత్తివేయాలి.

- మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి.

- ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలి.

- రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలను చెల్లించాలి. వారి దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలి.

Updated Date - Apr 23 , 2026 | 02:42 AM