క్రీడారంగానికి కేంద్రం పెద్దపీట
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:42 PM
క్రీడారంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఖేలో ఇండియా పోటీలకు నిధులు కేటాయిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.
- జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి
- మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
- అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : క్రీడారంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఖేలో ఇండియా పోటీలకు నిధులు కేటాయిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని జయప్రకాశ్ నాయయణ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి సీనియర్ ఓపెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ (జయప్రకాశ్ నారాయణ్ ట్రోఫి)ను ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించి, క్రీడావందనం స్వీకరించారు. బాక్సింగ్ టోర్నీ సందర్భంగా వివిధ రాష్ట్రాల క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని, కళాశాల చైర్మన్ కేఎస్. రవికుమార్ అభినందించారు.
క్రీడాస్ఫూర్తిని చాటాలి : ఎమ్మెల్యే యెన్నం
క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. దేశంలోని 24 రాష్ట్రాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించేలా స్టేడియం నిర్మాణానికి కేంద్రంతో మాట్లాని నిధులు సమకూర్చాలని ఎంపీని కోరారు. జేపీఎన్‌సీఈ కళాశాల చైర్మన్ కే.ఎస్ రవికుమార్ మాట్లాడుతూ కళాశాల స్థాపించి 30 ఏళ్ల సందర్భంగా బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ (ఐఏబీఎఫ్) సెక్రటరీ రాకేష్‌తాక్రాన్, రాకేష్‌భరద్వాజ్, సురేందర్‌కుమార్‌సొలంకి, రఘువీర్‌సింగ్, కళాశాల కార్యదర్శి వెంకటరామారావు, డీవైఎస్‌వో రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
బాక్సింగ్ పోటీల ఫలితాలు..
బాక్సింగ్ పోటీల్లో మొదటి రోజు జరిగిన పలు మ్యాచ్‌ల్లో ఆయా రాష్ట్రాల క్రీడాకారులు గెలుపొందారు. ప్రీ-1 ఫలితాల్లో 54 కేజీల విభాగంలో మయాంక్ చత్రి(జార్ఖండ్), 67 కేజీల విభాగంలో దిండిటిధర్మతేజ(ఆంధ్రప్రదేశ్), 67 కేజీల విభాగంలో శ్యామ్‌సింగ్ (అరుణాచల్‌ప్రదేశ్), 67కేజీల విభాగంలో ప్రియాంఘ్షసింగ్(చండీఘర్), 67 కేజీలో సుఖ్ దేవ్(ఢిల్లీ),67 కేజీలో అతిష్(జమ్ముకాశ్మీర్) విజయాలు నమోదు చేసుకున్నారు.