Share News

ఛండికా నమోస్తుతే...

ABN , Publish Date - Oct 14 , 2026 | 11:13 PM

శరన్నవరాత్రి ఉత్సవాల్లో బుధవారం దుర్గామాత మహా ఛండీదేవి రూపంలో దర్శనమిచ్చింది. భక్తులు, భవానీ దీక్షాపరులు అమ్మవారిని దర్శించి తరించారు.

ఛండికా నమోస్తుతే...
మహాశక్తి ఆలయంలో అమ్మవారికి పసుపుకొమ్ములతో అలంకరణ

కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 14 ఆంధ్రజ్యోతి) : శరన్నవరాత్రి ఉత్సవాల్లో బుధవారం దుర్గామాత మహా ఛండీదేవి రూపంలో దర్శనమిచ్చింది. భక్తులు, భవానీ దీక్షాపరులు అమ్మవారిని దర్శించి తరించారు. మహాశక్తి ఆలయంలో ఉదయం మహాఛండీ (కూష్మాండ) పూజ, పసుపు కొమ్ములతో అలంకరణ, సాయంత్రం వివిధ దేవతల స్తోత్ర పారాయణాలు జరిగాయి. శుక్రవారం ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం సరస్వతీ పూజ, సాయంత్రం పల్లకీ సేవ నిర్వహిస్తున్నారు. ఈ రోజు దాండియాలో రెడ్‌ కలర్‌ డ్రెస్‌ కోడ్‌తో పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. యజ్ఞవరాహస్వామిక్షేత్రంలో విశేషాలంకరణ, చతుష్షష్ఠి పూజ, కుంకుమార్చనలు నిర్వహించారు. పాతబజార్‌ గౌరీశంకరాలయంలో కాత్యాయని అలంకరణ చేశారు. 108 రకాల మిఠాయిలను నైవేద్యంగా సమర్పించారు. వావిలాలపల్లి విజయలక్ష్మీ కనకదుర్గ దేవాలయంలో ఛండీ హోమం, అన్నప్రసాద వితరణ జరుగగా అమ్మవారికి వైష్ణవీదేవి అలంకారం చేశారు. ఈ కార్యక్రమంలో 51వ డివిజన్‌ కార్పోరేటర్‌ బండారి వేణు దంపతులు, భవానీ దీక్షాపరులు పాల్గొన్నారు.భగత్‌నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు దంపతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 11:13 PM