జలసిరితో భూగర్భ జలాల పెంపు
ABN , Publish Date - Nov 01 , 2026 | 11:12 PM
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జలసిరి కార్యక్రమాన్ని చేపట్టింది.
- నీటి నిల్వ పనులకు ప్రాధాన్యం
- ముమ్మరంగా ఇంకుడుగుంతలు, ఫాంపాండ్, నీటి కుంటల నిర్మాణం
గండీడ్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జలసిరి కార్యక్రమాన్ని చేపట్టింది. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ (వీబీ జీ రాంజీ) అనే పథకం ద్వారా ఇంకుడుగుంతలు, ఫాంపాండ్, ఊట చెరువులు, ఊట కుంటల పనులు చేపట్టింది. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఇంకుడు గుంతలు, పొలాల్లో పంట చెరువులు నిర్మించనున్నారు. వ్యక్తిగత నిర్మాణానికి రూ.6 వేలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలకు రూ.13 వేలు ప్రభుత్వం కేటాయించింది. కూలీలతో పాటు మెటీరియల్ కోసం ఖర్చు చేస్తారు. వర్షం పడినప్పుడు గ్రామం నుంచి బయటకు వెళ్లే వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకించేందుకు వీలుగా గ్రామం బయట డ్రైన్ ఎండ్ పాయింట్ సోక్‌పిట్ నిర్మిస్తారు. దీనికి దాదాపు రూ.90 వేల నుంచి రూ.లక్ష ఖర్చు చేయనున్నారు. కాగా మండలంలో 27 గ్రామ పంచాయతీలకు మొత్తం 150 ఫాంపాండ్‌లు, 5 వేల ఇంకుడు గుంతలు, 27 ఊట కుంటలు, 40 కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో గ్రామానికి దాదాపు 180 ఇంకుడు గుంతలు, ఒక ఊటకుంట నిర్మించేందుకు ప్రతిపాదించారు. కొన్ని పనులు పూర్తికావడంతో మరిన్ని పనులకు స్థలాలను గుర్తించి, నిర్మాణ అనుమతుల కోసం అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
వ్యవసాయ పొలాల్లో పంట కుంటలు
గ్రామాల్లో రైతుల వ్యవసాయ పొలాల్లో పంట కుంటలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీన్ని వర్షపు నీటిని నిల్వ చేసుకునే విధంగా నిర్మించనున్నారు. ఇందుకోసం 12 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు నిర్మాణానికి రూ.90 వేలు, అలాగే 15 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు తవ్వితే రూ.1.10 లక్షలు అందజేయనున్నారు. ఫాంపాండ్ నిర్మాణంతో వర్షం నీటితో పాటు తక్కువ వచ్చే బోరు మోటారు నీటిని నిల్వ చేసుకొని మోటారు సాయంతో పంటలకు నీటిని పారించుకోవచ్చు.