Share News

పరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:58 PM

గణపసముద్రం జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం రోడ్డెక్కారు.

పరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు
ఖిల్లాఘణపురంలో రాస్తారోకో చేస్తున్న గణపసముద్రం రిజర్వాయర్‌ ముంపు బాధితులు

- ఖిల్లాఘణపురం బస్టాండ్‌ ముందు రాస్తారోకో

- ఎకరానికి రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌

ఖిల్లాగణపురం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : గణపసముద్రం జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం రోడ్డెక్కారు. శుక్రవారం వనపర్తి జిల్లా, ఖిల్లాఘణపురం బస్టాండ్‌ ముందు ముంపు రైతుల సంఘం అధ్యక్షుడు నల్లమద్ది రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలాశయం నిర్మాణానికి భూసేకరణకు అవార్డు పూర్తి చేసి 7 నెలలు గడిచినా పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ. 12.80 లక్షలు చెల్లిస్తామని చెప్పిన అధికారులు 980 మంది రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నట్లు తెలిపారు. కొడంగల్‌ నారాయణపేట ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 20 లక్షలు చెల్లించిందని, అలాగే మాకు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి గతంలో చెప్పిన విధంగా తమకు న్యాయం చేయాలని కోరారు. రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. పోలీసులు వారిని పక్కకు తప్పించేందుకు యత్నించడంతో పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాస్తారోకోలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు బుచ్చిబాబుగౌడ్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సామ్యానాయక్‌, నాయకులు బెస్త గోపాల్‌, సిరిసాల సాయినాథ్‌, ఆశన్న, బాల్‌రెడ్డి, మల్లేశ్‌, ఆంజనేయులుగౌడ్‌, శరత్‌, రాజు, రామచంద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 11:58 PM