Share News

ఎర్లీ బర్డ్‌.. అంతంతే

ABN , Publish Date - May 05 , 2026 | 01:25 AM

బల్దియాల్లో ఆస్తి పన్నులో రాయితీ పథకం ఎర్లీ బర్డ్‌ అంతంతే అన్నట్లుగా మారింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఇంటి పన్నులు చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఎర్లీ బర్డ్‌ స్కీం తీసుకువచ్చింది.

ఎర్లీ బర్డ్‌.. అంతంతే

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

బల్దియాల్లో ఆస్తి పన్నులో రాయితీ పథకం ఎర్లీ బర్డ్‌ అంతంతే అన్నట్లుగా మారింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఇంటి పన్నులు చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఎర్లీ బర్డ్‌ స్కీం తీసుకువచ్చింది. పాత బకాయిలు లేకుండా. చెల్లింపులు జరిపిన వారికి ఏప్రిల్‌ 1 నుంచి 30వ తేదీ వరకు నివాస, వాణిజ్య భవనాలకు సంబంధించి ఐదు శాతం రాయితీ ప్రతి సంవత్సరం ఇస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో ఎర్లీ బర్డ్‌ స్కీంపై ప్రజల్లో నామమాత్రంగానే స్పందన కనిపించింది. ఏప్రిల్‌ 30 తేదీ వరకు సిరిసిల్ల మున్సిపాలిటీలో గత సంవత్సరం ఎర్లీ బర్డ్‌ స్కీంలో వచ్చిన ఆదాయం కంటే స్వల్పంగా పెరిగింది. వేములవాడ మున్సిపాలిటీలో తగ్గింది. ఐదు శాతం రాయితీ వినియోగించుకొని ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా సిరిసిల్లలో రూ 2.59 కోట్లు ఆస్తి పన్ను వసూలు కాగా, వేములవాడ మున్సిపాలిటీలో రూ. 1.20 కోట్ల ఆదాయం సమకూరింది.

గత సంవత్సరం సిరిసిల్లలో రూ. 2.37 కోట్లు, వేములవాడలో 1.40 కోట్ల ఆదాయం వచ్చింది. ఎర్లీ బర్డ్‌ ద్వారా ముందస్తుగానే పన్నుల చెల్లింపులు చేయడం వల్ల వడ్డీల భారం తగ్గడమే కాకుండా ఐదు శాతం రాయితీ లభిస్తుంది. ఐదు శాతం రాయితీతో మున్సిపాలిటీలకు ముందస్తు ఆదాయం సమకూరుంది. అయితే పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతుండడంతోనే అనుకున్న స్థాయిలో లక్ష్యం నెరవేరడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 10.22 కోట్ల ఆదాయం

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో 2025-26 ఆస్తి పన్నులకు సంబంధించి సిరిసిల్ల మున్సిపాలిటీల్లో 92.83 శాతం, వేములవాడలో 83.33 శాతం పన్నులు వసూలు చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 23,786 భవనాలు ఉన్నాయి. ఇందులో వాణిజ్య, నివాసం కలిసి ఉన్న గృహాలు 2,926 ఉండగా, వాణిజ్య భవనాలు 2,595, నివాస గృహాలు 18,265 ఉన్నాయి. ఇందుకు సంబంధించి రూ 6.99 కోట్లు లక్ష్యం ఉండగా రూ 6.49 కోట్లు వసులు చేశారు. బకాయిలు రూ.50.13 లక్షలు మిగిలింది. ఎర్లీబర్డ్‌లో రూ2.59 కోట్లుతో 37.44 శాతంగా ఉంది. వేములవాడలో 14,929 భవనాలకు ఇందులో వాణిజ్య, నివాసం కలిసి ఉన్న గృహాలు 1,177 ఉండగా ,వాణిజ్య భవనాలు 2,279, నివాస గృహాలు 1,1473 ఉన్నాయి. ఇందుకు సంబంధించి 4.47 కోట్లు లక్ష్యం కాగా రూ 3.73 కోట్లు వసూలు చేశారు. బకాయిలు రూ. 74.66 లక్షలు ఉంది. ఎర్లీబర్డ్‌ ద్వారా రూ 1.20 కోట్లతో 26.96 శాతంగా ఉంది.

Updated Date - May 05 , 2026 | 01:25 AM